కరోనా కట్టడి దిశగా కామారెడ్డి

ABN , First Publish Date - 2021-05-09T03:53:36+05:30 IST

వేగంగా వ్యాప్తి చెందుతున్న మహమ్మారి కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాం గం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతీ ఇంటిని సర్వే చేసి కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని జల్లె డ పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కరోనా కట్టడి దిశగా కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో సర్వే నిర్వహిస్తున్న బృందం

జిల్లాలో ఇంటింటా సర్వేతో అనుమానితుల గుర్తింపు
వెయ్యి బృందాలతో జిల్లాను జల్లెడ పడుతున్న వైద్యఆరోగ్యశాఖ
లక్షణాలు ఉంటే కిట్‌ అందజేత
ఇప్పటి వరకు 4,217 కరోనా అనుమానితులను గుర్తించిన బృందాలు
పీహెచ్‌సీలో కరోనా చికిత్స
పరీక్షల పేరిట కాలయాపనకు చెక్‌
జిల్లాలో తగ్గిన కరోనా టెస్టులు

కామారెడ్డి, మే 5(ఆంధ్రజ్యోతి): వేగంగా వ్యాప్తి చెందుతున్న మహమ్మారి కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాం గం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతీ ఇంటిని సర్వే చేసి కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని జల్లె డ పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పరీక్షలు చేయించుకోవ డం, ఫలితాలు రావడం ఇలా కాలయాపన చేసి ఎక్కువ మందికి వైరస్‌ వ్యాప్తి చేయించడానికి కారణమైన వారిని గుర్తించి వెంటనే కొవిడ్‌ మెడికల్‌ కిట్స్‌ అందజేస్తున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉండా లని సర్వే బృందాలు బాధితులకు పలు సూచనలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4,217మంది అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి కరోనా కిట్లను అందజేశారు.


జిల్లాలో 2.10 లక్షల కుటుంబాలు
కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశా ల మేరకు జిల్లాలో కలెక్టర్‌ శరత్‌ పర్యవేక్షణలో వైద్య ఆరోగ్యశాఖ ఫీవర్‌ సర్వే చేపడుతోంది. జిల్లాలోని 22 మండలాల్లో 526 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో 2,10,957 కుటు ంబాలు ఉన్నట్లు గుర్తించారు. గత నాలుగు రోజుల నుంచి జిల్లాలో వైద్యఆరోగ్యశాఖ ఇంటింటా సర్వే చేపడుతున్నారు. ఇందులో ఇప్ప టి వరకు 4,217 మంది అనుమానిత కరోనా లక్షణాలు ఉన్నట్లుగా సర్వే బృందాలు గుర్తించాయి. వీరందరికీ కరోనా కిట్లు అందజేయడంతో పాటు హోం ఐసోలేషన్‌లో ఉంచుతూ ఆరోగ్య పరిస్థితులపై సలహాలు, సూచనలు ఇస్తున్నారు.


జిల్లాను జల్లెడ పడుతున్న సర్వే బృందాలు
జిల్లాలో ప్రతీ ఇంటిని జల్లెడ పట్టి కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. మొత్తం వెయ్యి సర్వే బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటా ఫివర్‌ సర్వే చేపడుతున్నారు. ఇలా ప్రతీ వె య్యి మంది జనాభాకు ఒక బృందాన్ని పంపించి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ టీమ్‌లో ఏఎన్‌ఎం, ఆశవర్కర్‌, అంగన్‌వాడీ కార్యకర్త, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్‌ సిబ్బందితో బృందాలు ఏర్పాటు చేశారు. వీరు ప్రతీరోజు 50 ఇళ్ల చొప్పున సుమారు 500 మంది ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఇంట్లో అందరు ఆరోగ్యంగా ఉన్నా రా.. ఎవరికైన కొవిడ్‌ లక్షణాలు ఉన్నాయనే మొదలైన విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతీ ఒక్కరిని పరీక్షించి జ్వరం, జలుబు, ఆక్సిజన్‌ శాతం మొదలైన విషయాలు నిర్ధారించుకుంటున్నారు. ఎవరికి ఏ లక్షణాలు ఉన్నట్లు తెలిసినా వెంటనే వారిని హోం ఐసోలేషన్‌లో ఉం డాలని సూచించడం, కొవిడ్‌ చికిత్సకు వాడే అజిత్రోమెసిన్‌, విటమిన్‌-సీ, డీ, పారాసిటమల్‌, జింకోవిట్‌, ఆవిరి క్యాప్సిల్స్‌ అందజేస్తున్నారు. ఇలా అందజేయడంతో పాటు రోజు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ సలహాలు సూచనలు ఇస్తున్నారు.
వ్యాప్తి నియంత్రణ
గత ఏడాది కొవిడ్‌ మొదటి దశ వ్యాప్తి సందర్భంగా అందరూ భయాందోళన కు గురయ్యారు. రానురాను ఈ భయం లేకుండా పోయింది. అయితే కొవిడ్‌ రెం డో దశ అతి వేగంగా వ్యాప్తి చెందడం, మరణాలు కూడా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రజల్లో మాత్రం అప్రమత్తత లోపించింది. దీనికి తోడు రోజుకు వందలాది మంది కొవిడ్‌ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు చేయడం, కిట్ల కొరత ఏర్పడడం, చికిత్స అందించడంలో జాప్యం జరుగుతోంది. గతంలో కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని గుర్తించడం సులభంగా ఉండేం ది. కానీ ఎక్కువ కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లో పరీక్షలకు ఫలితాలకు, మందుల పంపిణీకి ఆలస్యం అవుతోంది. దీంతో ఈ గ్యాప్‌ సమయంలో సదరు కొవిడ్‌ పాజిటివ్‌ బాధితులు, కుటుంబ సభ్యులను ఇతరులను కలవడం, ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో పరీక్షల ఫలితాలు వచ్చే నాటికి జరగాల్సిన నష్టం జరిగి వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందుతోంది. ఈ పరిస్థితుల్లో నిర్వహించే ఇంటింటి సర్వేతో పాజిటివ్‌ కేసులను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేసి వ్యాప్తిని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రతీ పీహెచ్‌సీలో కొవిడ్‌ చికిత్స
ప్రస్తుతం భయానక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో 21 పీహెచ్‌సీలు, 6 సీహెచ్‌సీలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం కరోనా పరీక్షలతో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో పాటు కరోనా ఓపీ సైతం చేపడుతున్నారు. పరీక్షలు చేసుకున్నప్పటికీ కరోనా లక్షణాలు ఉంటే కొవిడ్‌ కిట్లను అందజేస్తున్నారు. మరోవైపు ఇంటింటా సర్వే బృందాలు తిరుగుతూ కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తూ స్థానిక పీహెచ్‌సీలకు బాధితుల సమాచారాన్ని చేరవేస్తున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారి ఆరోగ్య పరిస్థితులను సర్వే బృందాలతో పాటు పీ హెచ్‌సీ వైద్య సిబ్బంది కూడా తెలుసుకుంటూ పలు సలహాలు సూచనలు ఇస్తు న్నారు. ఏ లక్షణాలు ఉన్నా నేరుగా కేంద్రానికి వెళ్లి ముందుగా కొవిడ్‌ మెడికల్‌ కిట్‌ను తీసుకుని వాటిని వాడేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇలా ఎక్కడి వారికి అక్కడే చికిత్స చేయడంతో వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

Updated Date - 2021-05-09T03:53:36+05:30 IST