Jordan లో విషవాయువు లీక్.. 12 మంది మృతి.. 250 మందిపైగా బాధితులు.. కంటెయినర్‌ని ‌షిప్ ఎక్కిస్తుండగా తెగిన ఐరన్ రోప్..

ABN , First Publish Date - 2022-06-28T15:30:03+05:30 IST

జోర్డాన్‌లోని అఖ్వబా నగరంలో విషాదకర ఘటన జరిగింది. ప్రమాదవశాత్తూ విషవాయువు లీకవ్వడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 250కిపైగా మంది బాధితులుగా మారారు.

Jordan లో విషవాయువు లీక్.. 12 మంది మృతి.. 250 మందిపైగా బాధితులు.. కంటెయినర్‌ని ‌షిప్ ఎక్కిస్తుండగా తెగిన ఐరన్ రోప్..

అమాన్ : జోర్డాన్‌(Jordan )లోని అఖ్వబా నగరం(Aqaba)లో విషాదకర ఘటన జరిగింది. ప్రమాదవశాత్తూ  విషవాయువు లీకవ్వడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 250కిపైగా మంది బాధితులుగా మారారు. సోమవారం సాయంత్రం 3:30 గంటల సమయంలో అఖ్వబా పోర్టు(port of Aqaba)లో క్లోరిన్(chlorine) ట్యాంకులను నౌక(షిప్)పై లోడింగ్ చేస్తుండగా.. క్రెయిన్‌ వైఫల్యం కారణంగా ఒక కంటెయినర్‌ ప్రమాదవశాత్తూ షిప్‌పై పడిపోయింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. అనంతరం ముదురు పసుపు రంగులో దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. క్లోరిన్ వాయువు పీల్చి, మింగి లేదా తాకడం కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది బాధితులుగా మారారు. నీటితో క్లోరిన్ గ్యాస్ చర్య కారణంగా విడుదలయ్యే యాసిడ్స్ మనిషి శరీరంలోని కణాలను హాని చేస్తాయి. ఈ కారణంగానే బాధితుల సంఖ్య పెద్ద మొత్తంలో ఉందని అధికారులు వెల్లడించారు. రసాయనాన్ని నిల్వవుంచే కంటెయినర్‌ని తరలిస్తున్న సమయంలో క్రెయిన్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జోర్డాన్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.


ఐరన్ రోప్ తెగిపోవడంతోనే..

కెమికల్ కంటెయినర్‌ని మోసుకెళ్తున్న క్రెయిన్ ‘ఐరన్ రోప్’ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కంటెయినర్‌లో 25-30 టన్నుల క్లోరిన్ గ్యాస్ ఉంది. నౌక ద్వారా డిబౌటీకి తరలించాల్సి ఉందని పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కెమికల్ కంటెయినర్ ప్రమాదవశాత్తూ నౌకపై పడిపోవడం, పేలిపోవడం, భారీగా పొగ వెలువడడం వీడియోలో స్పష్టంగా  కనిపించాయి. ఆ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించింది. విష వాయువు నుంచి తప్పించుకునేందుకు నౌకాశ్రయంలో పనిచేస్తున్నవారు కేకలు పెడుతూ అక్కడి నుంచి పరుగులు తీశారు. 


ఈ రసాయన ప్రమాదంలో గాయపడ్డ 199 మందికి హాస్పిటల్‌లో చికిత్స అందుతోందని బీబీసీ వెల్లడించింది. పలువురి పరిస్థితి విషమంగా ఉందని వివరించింది. కాగా పోర్టుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న అఖ్వబా నగరవాసులకు అధికారులు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. అందరూ ఇళ్లలోనే ఉండాలని, తలుపులు, కిటికీలు మూసివుంచాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తగా అఖ్వబా దక్షిణ బీచ్‌ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. గ్యాస్ లీక్, క్లీన్-‌అప్ ఆపరేషన్ కోసం ప్రత్యేక బృందాలను ఆ ప్రాంతానికి పంపించినట్టు సివిల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్న జోర్డాన్ ప్రధాని బిషర్ అల్-ఖసనే.. అఖ్వబా చేరుకున్నారు. ఈ ఘటనపై విస్తృత దర్యాప్తు జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 


కాగా క్లోరిన్‌ని పరిశ్రమలతోపాటు ఇళ్లలో క్లినింగ్ ప్రొడక్టుల్లో ఉపయోగిస్తారు. సాధారణ ఉష్ణోగ్రత, పీడనాల వద్ద క్లోరిన్ గ్యాస్ పసుపు-పచ్చ రంగులో ఉంటుంది. ఈ గ్యాస్‌ని పీల్చితే అది నీటితో చర్య జరుపుతుంది. ఫలితంగా వెలువడే యాసిడ్స్ శరీరంలోని కణాలను నాశనం చేస్తాయి. ఇక అధిక స్థాయిలో గ్యాస్‌ని పీల్చితే ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది.

Updated Date - 2022-06-28T15:30:03+05:30 IST