సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ఘటన దురదృష్టకరం: Revanth

ABN , First Publish Date - 2022-06-17T17:24:50+05:30 IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ఘటన దురదృష్టకరం: Revanth

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఈ రోజు జరిగిన ఘటన దురదృష్టకరం. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితం ఇది. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్’ సరైనది కాదని స్పష్టం అవుతోంది.  ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలి’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. 


కాగా... ‘అగ్నిపథ్‌’ను రద్దు చేయాలంటూ ఈరోజు ఉదయం ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి చేశారు. రైళ్లపై రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. అంతేకాకుండా మూడు రైళ్లకు నిప్పు పెట్టారు. ప్లాట్‌పాంలపై రాళ్లతో దాడి చేస్తూ పూర్తి ధ్వంసం చేశారు. వేలాదిగా ఆర్మీ అభ్యర్థులు స్టేషన్‌లోకి చొచ్చుకురావడంతో పోలీసులు వారిని అదుపుచేయలేకపోయారు. చివరకు ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు అభ్యర్థులు గాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో ఆ వైపుగా రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.  సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర నుంచి ట్రాఫిక్‌ను మళ్లించారు. ఇటు బోయిన్‌పల్లి మదర్ తెరిసా స్టాచ్యూ దగ్గర నుంచి పోలీసులు దారి మళ్లించారు. సికింద్రాబాద్ స్టేషన్‌కు వస్తున్న అన్ని బస్సులను, అన్ని రోడ్లను బంద్ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి ఒక ఆటో, బస్సు లేకుండా ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రయాణికులు కిలోమీటర్ల మేర నడిచి వెళుతున్నారు. 


Updated Date - 2022-06-17T17:24:50+05:30 IST