అగ్నిపథ్‌ సరైంది కాదు

ABN , First Publish Date - 2022-06-18T08:54:14+05:30 IST

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం జరిగిన ఘటన దురదృష్టకరమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఇది ఆర్మీ

అగ్నిపథ్‌ సరైంది కాదు

పాత విధానాన్నే కొనసాగించాలి: రేవంత్‌రెడ్డి 

రాకేష్‌ కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలి: మధుయాష్కీ


హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం జరిగిన ఘటన దురదృష్టకరమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఇది ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా మోదీ ప్రభుత్వం చేసిన నిర్ణయం ఫలితమన్నారు. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్థపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్‌’ సరైనది కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం, పాత విధానాన్నే కొనసాగించాలని ట్విటర్‌లో ఆయన డిమాండ్‌ చేశారు. రాకేశ్‌ మృతి బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు చేసిన హత్య అని ఆరోపించారు. దీనికి రెండు ప్రభుత్వాలూ బాధ్యత వహించాలన్నారు. కాగా, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఘటనతో ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలకు, కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అగ్నిపథ్‌ పథకంతో నష్టపోతున్న విద్యార్థులే ఆందోళన చేస్తున్నారని తెలిపారు. సైనికులకు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని.. అగ్నిపథ్‌ పేరుతో సైనిక నియామకాల్లో నాలుగేళ్ల సర్వీసు పెట్టడం దారుణమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విహన్మంతరావు అన్నారు. ఆర్మీని ప్రయివేటీకరించే సన్నాహాల్లో భాగంగానే అగ్నిపథ్‌ పథకాన్ని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ ఆరోపించారు.


పోలీసు కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్‌ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, అగ్నిపథ్‌ పథకం ఆర్‌ఎ్‌సఎస్‌ అజెండాలో భాగమని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ అన్నారు. కాగా, బాసర ట్రిపుల్‌ ఐటీలో కనీస వసతుల కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులకు సంఘీబావం తెలిపేందుకు వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. 


అగ్నిపథ్‌ మోసపూరితం: ఎస్‌యూసీఐ(కమ్యూనిస్టు)

సైన్యంలో తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకం పూర్తిగా మోసపూరిత విధానమని ఎస్‌యూసీఐ(కమ్యూనిస్టు) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురహరి అన్నారు. ఈ పథకాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-06-18T08:54:14+05:30 IST