జాడలేని కొత్త పింఛన్లు!

Dec 6 2021 @ 00:46AM

3 ఏళ్ల నుంచి పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
57 ఏళ్ల వయస్సు గల వారి నుంచి పూర్తయిన కొత్త దరఖాస్తుల స్వీకరణ
ఇప్పటికీ అప్లికేషన్లను పరిశీలించని సర్కారు
గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న వృద్ధులు
జిల్లావ్యాప్తంగా 17,079 దరఖాస్తులు

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 5: మూడేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆసరా పింఛన్లు మంజూరు చేయడం లేదు. 57ఏళ్లు నిండిన వారితో పాటు ఆ రూల్‌తో సంబంధం లేనివాళ్లకు కూడా పింఛన్లు సరిగా ఇవ్వడం లేదు. దరఖాస్తు పెట్టుకున్న వాటిని కనీసం ప ట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో కొత్త పింఛన్ల జాడా లేకుండా పోయింది. గత ఆగస్టు నుంచి అక్టోబర్‌ వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు జిల్లావ్యాప్తంగా 17,079 మంది ఉన్నారు. అయితే ఇంత వరకు ఈ దరఖాస్తులను పరిశీలించిన దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే జిల్లావ్యాప్తంగా గతంలో 57ఏళ్ల వయస్సు వారికి పింఛన్లు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ప్ర కటనతో జిల్లాలో 10,531 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించాల్సిన ఈ ప్రభుత్వం తిరిగి వాటిని రద్దు చేయడమే కాకుండా మీ సేవా ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశిం చింది. ప్రభుత్వ ఆదేశాలతో అప్రమత్తమైన ప్రజలు ఆస రా పింఛన్ల కోసం మీ సేవల ద్వారా పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా మొత్తం 17,079 మంది దరఖాస్తు చేసుకుని మూడు నెలలు కావొస్తున్నా.. ఇంతవరకు పింఛన్ల చెల్లింపుపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. సర్కారు ఇప్పటి వరకు వాటిని వెరిఫై చేయనే లేదు. ఏ శాఖాధికారులు వాటిని వెరిఫై చేయాలో కూడా ఆదేశాలు ఇవ్వకపోవడంతో జిల్లాలో దరఖాస్తు చేసుకున్న 57ఏళ్ల లబ్ధిదారులతో పాటు ఈ నిబంధనతో సంబంధం లేని వారు కూడా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు నుంచే కొత్త పింఛన్లు ఇస్తామని గతంలోనే సీఎం కేసీఆర్‌ ప్రకటించినా.. ఆ గడువు దాటి ఐదు నెలలు కావొస్తోంది. అయినా ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరడం లేదు. ఇటీవల ఉప ఎన్నిక జరిగిన హుజురాబాద్‌లో మాత్రమే పింఛన్లను ఇచ్చిన ప్రభు త్వం, రాష్ట్రంలో ఎక్కడా కొత్త పింఛన్లను జారీ చేయలేదు.
చెత్తబుట్టలో పాత దరఖాస్తులు
ఈ యేడాది జూలైలో సిరిసిల్ల పర్యటన సందర్భంగా 57ఏళ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కాని ఒక్క వయస్సును తగ్గిస్తూ ఆగస్టులో ఉత్తర్వులను విడుదల చేశారే తప్ప, ఇంత వరకు పింఛన్లు ఇవ్వలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా అఽదికారులు సిద్ధం చేసిన అర్హుల లిస్టు ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ మరోసారి మీ సేవా కేంద్రాల ద్వారా ఆగస్టు 15 నుంచి 31 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. దీంతో జిల్లావ్యాప్తంగా 10,531 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని పింఛన్లు చెల్లించాల్సిన ఈ ప్రభుత్వం.. వాటిని రద్దు చేసి కొత్తగా మీ సేవల దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. దీంతో ముందుగా వచ్చిన 10,531 మంది దరఖాస్తులను చెత్తబుట్టలో పడేసింది. ప్రస్తుతం జిల్లాలో 17,079 మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్‌ వస్తుందని అనుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు సెప్టెంబరులో చెల్లిస్తుందని ఎదురు చూసినా.. ఆశలు అడియాశలే అయ్యాయి. ఇదిలా ఉంటే అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు అక్టోబరు 1నుంచి 31 వరకు మరో సారి అప్లికేషన్లను పెట్టుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని గడువు ముగిసి రెండు నెలలు కావొస్తున్నా.. సంబంధిత దరఖాస్తుల వెరిఫికేషన్‌ను ప్రారంభించ లేదు. దీంతో ఆగస్టులో ఇస్తామన్న పింఛన్‌ డిసెంబరులో కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
జిల్లాలో 66,279 పింఛన్‌దారులు
జిల్లావ్యాప్తంగా 66,279 మంది రెగ్యూలర్‌ పింఛన్‌దారులున్నారు. వీరి కి ప్రతీ నెలా రూ.14కోట్ల 84లక్షలు పింఛన్‌ల రూపంలో అందజేస్తున్నా రు. కాగా ఈ పింఛన్‌తో సంబంధం ఉన్న 60 ఏళ్లు నిండిన లబ్ధిదారులు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ.. వారు ప్రభుత్వం ఎప్పుడు పింఛన్‌ మంజూరు చేస్తుందోనని? ఎదురుచూస్తూ కాలం గడిపేస్తున్నారు. ప్రభుత్వం జిల్లాలో తగ్గించిన వయస్సు వారితో సంబంధం లేకుండా 60 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం పాత లబ్ధిదారులలో దివ్యాంగులకు రూ.3016, మిగి తా వారికి రూ.2016 చొప్పున పింఛన్‌ చెల్లిస్తోంది. మూడేళ్లుగా కొత్త పిం ఛన్లు ఇవ్వక పోవడంతో ప్రమాదాల్లో కాళ్లు చేతులు పొగొట్టుకున్నవారు, భర్త చనిపోయిన మహిళలు, బోధకాలు బాధితులు, అలాగే 55 ఏళ్లు నిండిన గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, పాత రూలు ప్రకారం వయస్సు నిండిన వృద్ధుల నుంచి పంచాయతీ సెక్రెటరీలు, ఎంపీడీవోలు అప్లికేషన్లు తీసుకుని అర్హులను గుర్తించి ఉన్నారు. వీరిని ఇప్పటికే ఎంపీడీవో లాగిన్‌లో ఆన్‌లైన్‌ చేసిన వీటిని పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్‌ అధికారులు వెరిఫై చేసి ప్రభుత్వానికి జాబితాను పంపిస్తున్నారు. కానీ ప్రభుత్వం వీటిని పట్టించుకోక పోవడంతో జిల్లాలో 57 ఏళ్లు నిండిన వారితో పాటు ఈ నిబంధనకు సంబందం లేని వారూ మూడేళ్లుగా పింఛన్‌ కోసం ఎదురుచూడక తప్పడం లేదు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు
: ఏ.కిషన్‌, డీఆర్డీఏ, ఆదిలాబాద్‌
జిల్లాలో ఆసరా పించన్ల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో 10వేలకు పైగా దరఖాస్తులను స్వీకరించాం. అయితే ప్రభుత్వం మళ్లీ మీసేవా ద్వారా కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలన్న ఆదేశాల మేరకుగత ఆగస్టు నుంచి అక్టోబరు వరకు 17,079 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. కాగా ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్ల చెల్లింపుపై ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో తాము ఏమీ చేయలేక పోతున్నాం. ఆదేశాలు వచ్చిన వెంటనే దరఖాస్తులను పరిశీలిస్తాం.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.