వణికిస్తున్న వైరస్‌

ABN , First Publish Date - 2021-04-23T05:25:06+05:30 IST

జిల్లాలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఇచ్చిన హెల్త్‌ బులెటిన మేరకు గడిచిన 24 గంటల్లో 279 కేసులు నమోదయ్యాయి. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, బద్వేల్‌ ప్రాంతాల నుంచి అధికంగా కేసులు నమోదవుతున్నాయి.

వణికిస్తున్న వైరస్‌
రాజుపాలెం మండలంలోని అంగనవాడీ కేంద్రంలో చిన్నారులు

మహమ్మారి కట్టడికి చర్యలేవీ..? 

మరణాల లెక్క తప్పుతోందా..

9వ తరగతి వరకు బంద్‌ చేసినా.. మూతపడని అంగనవాడీ కేంద్రాలు 

తల్లిదండ్రుల్లో కరోనా భయం

24 గంటల్లో 279 కేసులు నమోదు 


కరోనా మహమ్మారి పల్లె, పట్నం జనాల వెన్నుల్లో వణుకు పుట్టిస్తోంది. రోజుకు సగటున 250-300 కేసులు నమోదవుతున్నాయి. పొరుగున్న కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండటం.. ఆయా జిల్లాల నుంచి జనం రాకపోకలు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నిత్యం జనం భయం భయంగా కాలం గడపాల్సి వస్తోంది. కరోనా ఉధృతి దృష్ట్యా 9వ తరగతి వరకు తరగతులను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే.. అంగనవాడీ కేంద్రాలు మాత్రం యథావిధిగా నడుస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


(కడప - ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఇచ్చిన హెల్త్‌ బులెటిన మేరకు గడిచిన 24 గంటల్లో 279 కేసులు నమోదయ్యాయి. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, బద్వేల్‌ ప్రాంతాల నుంచి అధికంగా కేసులు నమోదవుతున్నాయి. 3,569 మంది నుంచి కరోనా పరీక్ష కోసం శాంపిల్స్‌ సేకరించారు. వీరిలో 279 మంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం కడప రిమ్స్‌, ప్రొద్దుటూరులో 393 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. మరో 1234 మంది హోం ఐసోలేషనలో ఉన్నారు. కరోనా చికిత్స అనంతరం కోలుకుని 96 మంది ఇంటికి చేరారు. ఇవి అధికారిక లెక్కలు. అయితే.. కరోనా లక్షణాలు ఉన్నా బయటికి చెప్పకుండా సొంత వైద్యం తీసుకుంటూ జనంలో తిరుగుతున్న వారెందరో ఉన్నారు. వారి నుంచే కరోనా వ్యాప్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న అనుమానం ఉన్నా కరోనా పరీక్ష చేయించుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు. 


ఇదీ పరిస్థితి

- గత ఏడాది మాదిరిగా ప్రస్తుతం కరోనా కట్టడి కేంద్రాలు లేవు. హోం క్వారంటైన పర్యవేక్షణ లేదు. దీంతో పాజిటివ్‌ బాధితులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. వారి నుంచి మరొకరికి వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. 

- కొందరిలో లక్షణాలు కనిపించకపోవడంతో వారు ఎలాంటి వైద్యం తీసుకోవడం లేదు. అలాంటి వ్యక్తుల ద్వారా ముప్పు పొంచి ఉంది. 

- చాలా మంది మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం ఊసే లేదు. శానిటైజర్‌ వినియోగం బాగా తగ్గింది. ఇంటికి వెళ్లినా సబ్బుతో చేతులు కడుక్కోవడం మానేశారు. టీ కొట్లు, శీతల పానియాల దుకాణాల వద్ద జనం మాస్కులు లేకుండా గుంపులు గుంపులుగా ఉంటున్నారు.

- కరోనా నుంచి ఉపశమనం కోసం గోరువెచ్చని నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. గత ఏడాది ముప్పాతిక శాతం మంది అవలంబించారు. ప్రస్తుతం ఎండ వేడిమి దృష్ట్యా గోరువెచ్చనీరు తాగడం తగ్గించారు. 

- గత ఏడాది పెళ్లిళ్లు, ఫంక్షన్లకు 50 మందికి మించి అనుమతి ఉండేది కాదు.. ప్రస్తుతం ఆ నిబంధనలు సడలించడంతో వందలాది మంది హాజరవుతున్నారు. రాజకీయ నాయకుల సభలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అక్కడి నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది.  


కొనసాగుతున్న అంగనవాడీ కేంద్రాలు

పాఠశాలలు కరోనా హాట్‌స్పాట్లుగా మారడంతో పలువురు విద్యార్థులు వైరస్‌ బారిన పడ్డారు. వారి నుంచే తల్లిదండ్రులకు వ్యాపిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 9వ తరగతి వరకు తరగతులు రద్దు చేసింది. అయితే.. ఐదేళ్లలోపు చిన్నారులు ఉండే అంగనవాడీ కేంద్రాలు యథావిధిగా సాగుతున్నాయి. జిల్లాలో 3,621 అంగనవాడీ కేంద్రాలు ఉన్నాయి. 2.30 లక్షల మంది చిన్నారులు, 45 వేలకు పైగా గర్బిణీ, బాలింతలు అంగనవాడీ సేవలు పొందుతున్నారు. సగటు హాజరు 60-65 శాతం ఉందని జిల్లా ఐసీడీఎస్‌ అధికారులు తెలిపారు. 9వ తరగతి వరకు స్కూళ్లు రద్దు చేసినా అంగనవాడీ కేంద్రాల కొనసాగింపుపై చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీటిని కూడా తాత్కాలికంగా రద్దు చేసి ఆయాలు, వలంటీర్ల ద్వారా పౌష్టికాహారం, గుడ్లు ఇళ్లకే సరఫరా చేయాలని కోరుతున్నారు. 


మరణాల రేటు లెక్క తప్పుతోందా..?

జిల్లాలో కరోనా మరణాల రేటు లెక్క తప్పుతున్నట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. మంగళవారం నుంచి గురువారం వరకు 72 గంటల్లో కేవలం ఒకరు మాత్రమే మృతిచెందారని వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన హెల్త్‌ బులెటినలో సూచిస్తోంది. అయితే బుధవారం ఒక్కరోజే రిమ్స్‌లో రాయచోటి, ఎర్రగుంట్ల మండలాలకు చెందిన ఇద్దరు, కడప నగరానికి చెందిన ఒకరు, మంగళవారం కడప నగరం చిన్న చౌకుకు చెందిన మరో వ్యక్తి మృతి చెందారు. తెలిసిన మరణాలే నాలుగు ఉంటే.. వైద్యాధికారులు కేవలం ఒక్కరే మృతి చెందినట్లు లెక్క చూపడం కొసమెరుపు. ఇలాంటి మరణాలు ఎన్ని దాచారో అన్న ప్రశ్న తలెత్తుతోంది. 


కట్టడి.. చికిత్స కోసం ప్రత్యేక చర్యలు 

- సీహెచ హరికిరణ్‌, కలెక్టర్‌

కరోనా వ్యాప్తి రాష్ట్రవ్యాప్తంగా సగటు 25 శాతం పాజిటివ్‌ రేటు ఉంటే.. జిల్లాలో 6-7 శాతం మాత్రమే ఉంది. అయినా కరోనా కట్టడి, బాధితులకు వైద్యసేవలు అందించడంలో మెరుగైన చర్యలు చేపడుతున్నాం. రిమ్స్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ బెడ్లు 300 నుంచి 700లకు పెంచుతున్నాం. రిమ్స్‌లో నిర్వహించే సాధారణ జబ్బుల శస్త్ర చికిత్సలు డెంటల్‌ ఆసుపత్రికి మారుస్తున్నాం. అలాగే రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాలకు తిరుపతి నగరం దగ్గరవుతుంది. అక్కడ ఉన్న ఈఎ్‌సఐ ఆసుపత్రిలో 200 బెడ్లు మన జిల్లా బాధితులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఆ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశాము. సానుకూలంగా స్పందించారు.  ప్రజలు కూడా మాస్కులు, భౌతిక దూరం, శానిటైజర్‌లు వినియోగించడం రోజువారి చర్యల్లో భాగంగా పాటించాలి. ఫంక్షన్లు, సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఇల్లు దాటి బయటకు రాకూడదు. జ్వరం, జలుబే కదాని సొంత వైద్యం చేసుకోకుండా తప్పక  కరోనా పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్‌ నిర్ధారణ అయితే కొవిడ్‌-19 హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకోవాలి. ప్రారంభంలోనే జాగ్రత్త పడితే మరణాల రేటు పూర్తిగా నివారించవచ్చు. నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు.

Updated Date - 2021-04-23T05:25:06+05:30 IST