సంప్రదాయ కళాసోయగాలు

ABN , First Publish Date - 2022-09-23T07:51:37+05:30 IST

తిరుపతి శిల్పకళాశాలలో జరుగుతున్న సంప్రదాయ కళల వర్క్‌షాప్‌, ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

సంప్రదాయ కళాసోయగాలు
సిమెంటు శిల్పం - దారు శిల్పం - లోహ శిల్పం

శిల్పకళాశాలలో ఆకట్టుకుంటున్న ప్రదర్శన

నేడు ఆఖరి రోజు


తిరుపతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తిరుపతి శిల్పకళాశాలలో జరుగుతున్న సంప్రదాయ కళల వర్క్‌షాప్‌, ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. బుధవారం మొదలైన ఈ వర్క్‌షాప్‌ శుక్రవారంతో ముగుస్తుంది. వివిధ సంప్రదాయ కళల మీద నిపుణుల ఉపన్యాసాలు సాగుతున్నాయి. గురువారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రదర్శనలోని కళాఖండాలను సందర్శించి కళాకారులతో మాట్లాడారు. వివిధ కళారూపాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్మాణం, శిలా శిల్పం (రాయితో విగ్రహాలు చేయటం), సుధా శిల్పం (సిమెంట్‌లో విగ్రహాలు చేయటం), లోహ శిల్పం (పంచలోహాలతో విగ్రహాలు చేయటం), దారు శిల్పం (చెక్కతో విగ్రహాలు చేయటం), సంప్రదాయ వర్ణచిత్రలేఖనం, కలంకారీ కళాకృతులు శిల్పకళాశాల ప్రాంగణంలో ప్రదర్శనలో ఉన్నాయి. ఇక్కడ ఆరు విభాగాల్లో డిప్లొమా కోర్సులున్నాయి. నాలుగేళ్ల కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం ఉంది. దీంతోపాటు విద్యార్థులు కళాశాలలో చేరిన వెంటనే లక్ష రూపాయలు వారి పేరిట బ్యాంకులో టీటీడీ డిపాజిట్‌ చేస్తుంది. కోర్సు పూర్తయ్యాక వడ్డీతో సహా చెల్లిస్తారు. ఉపాధి భద్రతకు టీటీడీ ఇస్తున్న భరోసా ఇది. అయితే కలంకారీకి మాత్రం ఈ ఏర్పాటు లేదు. భారతదేశంలోనే కలంకారీ సంప్రదాయ కళకు శ్రీకాళహస్తి పుట్టినిల్లు. కలంకారీ విద్యార్థులకు కూడా లక్ష రూపాయలు డిపాజిట్‌ చేసే ఏర్పాటు చేస్తే మన జిల్లాకు చెందిన ఈ ప్రాచీన కళకు మరింత జీవం పోసినట్లవుతుంది. 


తరచూ వర్క్‌షాపులు నిర్వహించాలి: ఈవో

శిల్పశాస్త్రంలోని వివిధ విభాగాల్లో నిష్ణాతులను పిలిచి తరచూ శిల్పకళాశాలలో వర్క్‌షాపులు నిర్వహించాలని  ఈవో ఆదేశించారు. వర్క్‌షాపు నిర్వహణకు చొరవ చూపిన జేఈవో సదాభార్గవిని ఆయన అభినందించారు. చిత్రలేఖనంలో మెలకువలు, ప్రతిమా లక్షణం, శైవ వైష్ణవ శక్తి ఆగమాలపై ఉపన్యసించిన  శేషబ్రహ్మం, నాగేశ్వరరావు, సుందరరాజన్‌, బ్రహ్మాచార్యులను సత్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటరెడ్డి, డీఈవో గోవిందరాజన్‌, సీఈ నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-23T07:51:37+05:30 IST