ట్రా‘ఫికర్‌’!

ABN , First Publish Date - 2021-11-01T06:35:46+05:30 IST

విజయవాడ నగరవాసులను నిత్యం వేధిస్తున్న సమస్య ట్రాఫిక్‌.

ట్రా‘ఫికర్‌’!

బెజవాడలో వాహనదారులకు అడుగడుగునా కష్టాలే 

వీవీఐపీలు పర్యటిస్తే మరిన్ని చిక్కులు

కాన్వాయ్‌ కదలక ముందే పోలీసుల హడావిడి

గంటలకొద్దీ ట్రాపిక్‌ వ్యూహంలోనే


పాలకులు రోడ్లపైకి వస్తే ప్రజలు పక్కకు తొలగాల్సిందే.. వారు ప్రయాణించే మార్గంలోకి వాహనాలతో ప్రవేశిస్తే.. ట్రాఫిక్‌ వ్యూహంలో చిక్కి.. పగలే చుక్కలు లెక్కపెట్టాల్సిందే. అవసరం తొందర పెడుతున్నా ముందుకు వెళ్లడానికి ఉండదు. ప్రాణాలమీదకు వచ్చినా.. గోడువినే వారు ఉండరు.  విజయవాడ నగరంలో పెరిగిపోయిన ట్రాఫిక్‌తో వాహనదారులకు రోజూ కష్టమే.. వీవీఐపీలు వచ్చినపుడు ఆ కష్టం రెట్టింపవుతుంది. వాహనదారులు సహనం తెచ్చిపెట్టుకోలేరు. అలా అని అసహనాన్ని పైకి వెళ్లగక్కలేరు.. ఆదివారం నగరానికి ఒకరు కాదు.. ఇద్దరు వీవీఐపీలు వచ్చారు. ఓపక్క ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. మరోపక్క మిజోరం గవర్నరు హరిబాబు.. రెండు గంటలపాటు ఎక్కడి వాహనాలు అక్కడే. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ తరువాత కూడా కొన్ని గంటలపాటు ఆ ప్రభావం కొనసాగింది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ నగరవాసులను నిత్యం వేధిస్తున్న సమస్య ట్రాఫిక్‌.  వీవీఐపీల పర్యటనలున్నప్పుడు ఆ సమస్య ఇంకా ఎక్కువ. వారి భద్రత కోసం పోలీసులు అవలంభించే విధానాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా నగరంలో బహిరంగ ప్రదేశాల్లో ఈవెంట్లు, ఉత్సవాలు నిర్వహించినప్పుడు ట్రాఫిక్‌ మళ్లిస్తారు. ఈ వివరాలను ముందుగానే ప్రకటిస్తారు కాబట్టి, ప్రజలు అందుకనుగుణంగానే తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకుంటారు. ప్రముఖుల పర్యటనలు ఉంటే మాత్రం ఆ మార్గంలో ట్రాఫిక్‌ను ఎప్పుడు నిలిపివేస్తారు? ఎన్ని గంటలపాటు నిలిపివేస్తారు? అనే సమాచారం వాహనదారులకు తెలియక ట్రాఫిక్‌ వ్యూహంలో చిక్కుకుపోతున్నారు. శని, ఆదివారాల్లో నగరంలో వాహనదారులు ఇటువంటి కష్టాలనే ఎదుర్కొన్నారు.


గంటల తరబడి ఇబ్బందులు

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, ముఖ్యమంత్రి జడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రతలోకి వస్తారు. ఈ భద్రతను దృష్టిలో పెట్టకుని బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉంటున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మిజోరం గవర్నరు కంభంపాటి హరిబాబు రెండు రోజులపాటు కమిషనరేట్‌ పరిధిలో ఉన్నారు. వెంకయ్యనాయుడు ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మిజోరం గవర్నరు హరిబాబు గురునానక్‌ కాలనీలో ఉంటున్న కుమార్తె ఇంటికి వచ్చారు. ఈ ఇద్దరూ నగరంలో ఆదివారం పర్యటించారు. మహాత్మాగాంధీ రోడ్డులోని రామ్మోహన గ్రంథాలయంలో ఏపీజే అబ్దుల్‌ కలాం, భరతమాత విగ్రహాలను ఆవిష్కరించడానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆత్కూరు నుంచి రామ్మోహన గ్రంథాలయానికి వచ్చేవరకు, అక్కడి నుంచి తిరిగి ఆత్కూరు వెళ్లేవరకు నగరంలో వాహనదారులకు కష్టాలు తప్పలేదు. సాధారణంగా ప్రముఖుల వాహనాలు వారు బస చేసిన ప్రదేశం నుంచి బయలుదేరడానికి 20 నిమిషాల ముందు పోలీసులకు సమాచారం అందుతుంది. దీనికి గంట, రెండు గంటల ముందుగానే పోలీసులు వారు పర్యటించే మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నారు. వెంకయ్యనాయుడు ఆత్కూరు నుంచి రామ్మోహన గ్రంథాలయానికి వచ్చే సమయంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఆయన గ్రంథాలయానికి చేరుకుని, విగ్రహాలను ఆవిష్కరించి, మొత్తం కార్యక్రమాన్ని ముగించుకునే వరకు ఎంజీ రోడ్డులో రెండు వైపులా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. సుమారు రెండు గంటలపాటు జాతీయ రహదారి పైన, ఎంజీ రోడ్డులో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. 

గురునానక్‌ కాలనీలో ఉన్న మిజోరం గవర్నరు కంభంపాటి హరిబాబు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిసేందుకు ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్‌కు వెళ్లారు. ఆ సమయంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ప్రముఖుల కాన్వాయ్‌ బయలుదేరే సమయానికి ఆపాల్సిన ట్రాఫిక్‌ను ముందుగానే నిలిపివేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రముఖులు పర్యటిస్తే తామెందుకు ఇబ్బందులు పడాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ, ప్రముఖుల భద్రత కేటగిరిని బట్టి ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు. వీఐపీ కాన్వాయ్‌ వచ్చే సమయానికి ఆ మార్గంలో అంతరాయం లేకుండా ఉండడం కోసమే ముందుగా ట్రాఫిక్‌ను నిలిపివేస్తారని తెలిపారు. 

Updated Date - 2021-11-01T06:35:46+05:30 IST