ట్రాఫిక్‌ వ్యూహంలో..!

ABN , First Publish Date - 2021-01-22T06:36:17+05:30 IST

విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డుతో పాటు నగరంలోకి ప్రవేశించే జాతీయ రహదారులపై గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

ట్రాఫిక్‌ వ్యూహంలో..!
పాలీక్లినిక్‌ రోడ్డులో ట్రాఫిక్‌ రద్దీ

విజయవాడ నగరం ఉక్కిరిబిక్కిరి

ప్రయాణికులకు నాలుగు గంటల నరకం

అంతర్గత రహదారుల్లోనూ ఇక్కట్లు

కరకట్టపైనా కష్టాలు


విధులకు వెళ్లాల్సిన వారు వీధుల్లోనే చిక్కుకుపోయారు. ప్రయాణాలు చేయాల్సిన వారికి ప్రత్యామ్నాయ మార్గాలూ నరకాన్ని చూపించాయి. కరకట్ట మీద ఒక వైపు నుంచి వచ్చే వాహనాలే కనిపించాయి. విజయవాడ నగరంలో గురువారం ఉదయం రోడ్లపైకి వచ్చిన ప్రతివారూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేసే వాహనాల ప్రారంభ కార్యక్రమం బెంజ్‌సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేయడంతో జాతీయ రహదారితో పాటు, మహాత్మాగాంధీ రోడ్డును కూడా పూర్తిగా మూసివేశారు. ఆ ప్రభావం నగరంలోని అన్ని రహదారులపై పడింది. ముఖ్యంగా కారల్‌మార్క్స్‌ రోడ్డుతో పాటు, నగరంలోని అంతర్గత రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.


ఆంధ్రజ్యోతి, విజయవాడ : విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డుతో పాటు నగరంలోకి ప్రవేశించే జాతీయ రహదారులపై గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఫలితంగా నగరంలోని అంతర్గత రహదారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. రామలింగేశ్వరనగర్‌ కరకట్ట, రామవరప్పాడు రింగ్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌ ప్రాంతాల్లో వాహనదారులు ట్రాఫిక్‌ వ్యూహంలో చిక్కుకుపోయారు. రామలింగేశ్వరనగర్‌ కరకట్టపై ట్రాఫిక్‌ రెండు వైపులా ఉంటుంది. రాణిగారితోట వైపు నుంచి యనమలకుదురు వైపు నిత్యం వేలాది వాహనాలు తిరుగుతాయి. అదే సమయంలో యనమలకుదురు వైపు నుంచి వాహనాలు కృష్ణలంక వైపునకు వస్తాయి. స్క్యూబ్రిడ్జి వద్ద ఉన్న ఇంటర్‌ జంక్షన్‌ వద్ద ఈ వాహనాలు ఇటు బెంజ్‌సర్కిల్‌, అటు వారధి వైపు వెళ్తాయి. జాతీయ రహదారిని మూసివేయడంతో ఇంటర్‌ జంక్షన్‌లోకి వాహనాలు రాలేదు. దీంతో కృష్ణలంక వైపు నుంచి, ఇటు నుంచి వెళ్లే వాహనాలన్నీ కరకట్ట మార్గంలోనే రాకపోకలు సాగించాయి. దీనికితోడు మచిలీపట్నం వైపు నుంచి బెంజ్‌సర్కిల్‌కు వచ్చే వాహనాలను ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి కృష్ణవేణి రోడ్డులోకి మళ్లించి కరకట్ట ఎక్కించారు. ఫలితంగా ఈ రహదారి మొత్తం బ్లాక్‌ అయిపోయింది. బెంజ్‌సర్కిల్‌లో రేషన్‌ వాహనాల ప్రారంభ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ వాహనాలు చాలా వరకు ఇదే మార్గంలోకి వచ్చి చేరాయి. 


ప్రయాణికులకు గజిబిజి

దూర ప్రాంతాలకు ప్రయాణించేవారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. రైళ్లు పెద్దగా లేకపోవడంతో ఎక్కువ మంది ఇప్పుడు ఆర్టీసీ బస్సులపై ఆధార పడుతున్నారు. పలు పనులపై విజయవాడ వచ్చిన  వారు, ఇక్కడి నుంచి తమ సొంత ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఉదయం నుంచీ నరకం చూశారు. పెనమలూరు, కానూరు ప్రాంతాల నుంచి పీఎన్‌బీస్‌కు ఆటోల్లో వెళ్లే ప్రయాణికులు కరకట్ట రోడ్డులోనూ, గొల్లపూడి వైపు నుంచి వచ్చే ప్రయాణికులు కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్‌లోనూ చిక్కుకుపోయారు. ప్రధాన మార్గాలన్నీ కార్లు, భారీ వాహనాలతో నిండిపోవడంతో ద్విచక్ర వాహనదారులు నరకం చవిచూశారు. ఆంక్షలు విధించిన అన్ని మార్గాల్లోనూ పోలీసులను ఏర్పాటు చేసినప్పటికీ ట్రాఫిక్‌ను చక్కదిద్దడం వారివల్ల కాలేదు. చివరికి కొన్ని జంక్షన్లలో ఆటోడ్రైవర్లు ట్రాఫిక్‌ను ముందుకు సాగడానికి సహకరించారు. డివైడర్లు లేని మార్గాల్లో ఒక వైపు వెళ్లే వాహనదారులే మొత్తం రహదారిని ఆక్రమించడంతో రెండో వైపు వెళ్లే వాహనదారులకు మార్గం లేకుండా పోయింది. ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను రద్దీ ప్రాంతాల్లో కాకుండా విశాలమైన స్థలం ఉన్న ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటే మంచిదని పలువురు అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్‌లో చిక్కుకొని, బయటపడలేనివారు మాత్రం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.



Updated Date - 2021-01-22T06:36:17+05:30 IST