నగరం.. నరకం!

ABN , First Publish Date - 2021-11-03T06:27:20+05:30 IST

విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ సమస్య వాహనదారులకు విసుగెత్తిస్తోంది.

నగరం.. నరకం!
సీఎం కార్యక్రమం కారణంగా సోమవారం ఎంజీ రోడ్డులో నిలిచిపోయిన ట్రాఫిక్‌

రహదారులపై సామర్థ్యానికి మించిన ట్రాఫిక్‌

సగం జీవితం ట్రాఫిక్‌లోనే

సిగ్నల్‌ లైట్లు ఉన్నా అలంకారమే

కనిపించని వీఎంఎస్‌

అటకెక్కిన విదేశీ అధ్యయనం

పాలకుల నిర్లక్ష్యం.. పౌరులకు శాపం 


గొల్లపూడిలో బయలుదేరిన ఒకటో నెంబరు బస్సు పోరంకి చేరాలంటే ఒకప్పుడు పట్టిన సమయం గంట. ఇప్పుడు ఎన్ని గంటలు పడుతుందో నిత్యం ఆ బస్సును నడిపే సిబ్బందిని అడిగినా చెప్పలేరు. 


బెంజ్‌సర్కిల్‌ నుంచి రామవరప్పాడు రింగ్‌కు ప్రయాణ సమయం ఒకనాడు పది నిమిషాలు.. ప్రస్తుతం అర్ధగంటలో చేరినా వాహనదారులకు పెద్ద ఊరటే. ఆ సమయంలో వీవీఐపీలు ఎవరైనా ఆ మార్గంలో ప్రయాణిస్తే ఇక ఆ రోజు నరకమే. 


ప్రధాన కూడలిలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడితే ఎన్ని నిమిషాలు నిరీక్షించాలో ప్రయాణికులకు తెలుసు. కానీ ప్రస్తుతం విజయవాడ నగరంలో చాలా కొద్ది ప్రాంతాల్లో మినహా సిగ్నల్స్‌ పనిచేస్తున్న దాఖలాలే లేవు. ట్రాఫిక్‌ పోలీసు ఎన్ని గంటలు ఆపితే అన్ని గంటలూ నిరీక్షించాల్సిందే. 


విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ సమస్య వాహనదారులకు విసుగెత్తిస్తోంది. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంటి నుంచి బయలుదేరిన నగరవాసులు అనుకున్న సమయానికి గమ్యానికి చేరుకుంటే ఆ రోజు పండగే. ‘ఈ రోజు ఏ ప్రముఖుడూ నగరంలోకి రాకూదు..’ అనుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. అలా అనుకునేవారిలో వాహనదారులే కాదు.. ట్రాఫిక్‌ పోలీసులు కూడా ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం సాగించడం కంటే, నగరంలోకి ప్రవేశించాక గమ్యానికి చేరడమే కష్టం. పేరుకే ఇది నగరం.. ట్రాఫిక్‌ వ్యవస్థను నియంత్రించే అధునాతన సాంకేతిక వ్యవస్థకు ఇది చాలా దూరం. ఈ సమస్యను పరిష్కరించేందుకు విదేశాలకు వెళ్లి మరీ అధ్యయనాలు చేసిన అధికారులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.. ఈ నగరం ఇక ఎప్పుడు ‘దారి’లో పడుతుందో!


61.88 కిలోమీటర్ల విస్తీర్ణం.. 64 డివిజన్లు.. రెండు ప్రధాన రహదారులు.. మూడు జాతీయ రహదారులు.. మరికొన్ని అంతర్గత రహదారులు.. ఇదీ విజయవాడ లెక్క. పెరిగిన నగర జనాభా.. అందుకనుగుణంగా పెరిగిన వాహనాలను తట్టుకునేంత విశాలంగా నగర రహదారులు లేవు. ప్రస్తుతం నగరాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య ఏమిటని ప్రశ్నిస్తే నగర పౌరులందరూ చెప్పే సమాధానం ఒక్కటే.. ట్రాఫిక్‌.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఇది విద్యలవాడ. వాణిజ్య కేంద్రం. రాష్ట్ర రాజధానికి చెంతనే ఉన్న ఈ నగరానికి బయట ప్రాంతవాసుల రాకపోకలూ అధికమే. ఇక్కడ ట్రాఫిక్‌ నిర్వహణ పోలీసులకు పెద్ద సవాల్‌. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ప్రాంతంలో భాగంగా మారిన విజయవాడకు ట్రాఫిక్‌ సమస్య లేకుండా చేయాలని నాటి పాలకులు, అధికారులు భావించారు. నగరాన్ని స్వచ్ఛంగా తయారు చేయడంతోపాటు ఆటోమెటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ ప్రతిపాదనలు ఏ దశలో ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది.


పొరుగు రాష్ట్రం అనుభవమిదీ..

ఒకనాడు హైదరాబాద్‌కూ ట్రాఫిక్‌ పెద్ద సమస్యగా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నప్పుడే అక్కడ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆధునాతన ట్రాఫిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. హెచ్‌ట్రిమ్స్‌ (హైదరాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం)ను భెల్‌ సంస్థతో తయారు చేయించారు. దీనికి ఆనాడు రూ.70కోట్ల వరకు వెచ్చించారు. ఈ మొత్తం ఖర్చును గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ భరించింది. నిర్వహణను ట్రాఫిక్‌ విభాగానికి అప్పగించింది. ఈ వ్యవస్థలో ఎలాంటి మరమ్మతులు వచ్చినా వాటిని సరిచేయించే బాధ్యత జీహెచ్‌ఎంసీదే. రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు ఏ మార్గంలో ట్రాఫిక్‌ ఆగిపోయింది.. ఏ మార్గంలో పోలీసులు వాహనాలను మళ్లించారు.. అనే సమాచారాన్ని తెలుసుకోవడానికి రహదారులకు పక్కన వీఎంఎస్‌ (విజువల్‌ మెసేజింగ్‌ సిస్టం)తో కూడిన ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. ఇలా చేయడం వల్ల వాహనదారులు ట్రాఫిక్‌ చిక్కుల నుంచి తప్పించుకుని ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకునే వీలుంటుంది. 


విజయవాడ సంగతేంటి?

ట్రాఫిక్‌ పోలీసుల గణాంకాల ప్రకారం విజయవాడలో మొత్తం 6,78,004 రవాణేతర వాహనాలు ఉన్నాయి. వాటిలో కార్లు 60,869, ద్విచక్ర వాహనాలు 5,05,424, ఆటోలు 27,296, భారీ వాహనాలు 19,044, చిన్న వాహనాలు 9,664, మధ్య తరహా వాహనాలు 450 ఉన్నాయి. పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి నిత్యం 450 సిటీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి కాకుండా ఇక్కడి నుంచి 2,600 బస్సులు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి. వివిధ విద్యాసంస్థలకు చెందిన బస్సులు 1700 ఉన్నాయి. నగరం మధ్య నుంచి వెళ్లే జాతీయ రహదారులపై రోజుకు నాలుగు వేలకు పైగా లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ లెక్కలు చూస్తేనే నగరంలో ట్రాఫిక్‌ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. 


ప్రాజెక్టు పట్టాలెక్కేదెప్పుడో!

నగరంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడానికి వీఎంసీ అధికారుల బృందం వివిధ దేశాల్లో ఉన్న వ్యవస్థను అధ్యయనం చేసింది. గుర్తించిన అంశాలను విజయవాడకు అన్వయించడంపై ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను నిర్వహిస్తున్న సంస్థల నిపుణులతో ఆ బృందం చర్చించింది. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదుగానీ, ఇంత వరకూ ఆ ఆలోచనలను అమలు చేయనేలేదు. 


ప్రత్యామ్నాయం ఎలా?

నగరంలో జాతీయ రహదారులను మినహాయిస్తే మహాత్మాగాంధీ రోడ్డు, కారల్‌మార్క్స్‌ రోడ్డు మాత్రమే విశాలంగా ఉంటాయి. ఈ రెండు రహదారులకు అనుబంధంగా అనేక అంతర్గత రోడ్లున్నా, ఎక్కువ భాగం ఇరుకుగానే ఉన్నాయి. ప్రధాన రహదారులపై ఏ కారణంగానైనా ట్రాఫిక్‌ ఆగితే, వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు చాలా తక్కువే. దీంతో వీవీఐపీల పర్యటనలు ఉన్నప్పుడు నగరవాసులతో పాటు బయట వాహనదారులు సైతం నరకం చవి చూస్తున్నారు. మూడు రోజుల క్రితం ఉపరాష్ట్ర వెంకయ్యనాయుడి కాన్వాయ్‌ కోసం పోలీసులు రెండు గంటలపాటు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. విసిగిపోయిన వాహనదారులు ఆయన కాన్వాయ్‌ వెళుతున్నపుడు హారన్లను మోగించి నిరసన తెలిపారు. 


సిగ్నల్స్‌ ఎక్కడ?

నగరంలో అత్యధిక ప్రాంతాలను కలిపే రెండు ప్రధాన మార్గాలు మహాత్మాగాంధీ రోడ్డు, కారల్‌మార్క్స్‌ రోడ్డు. నగరం మధ్యలో నుంచి వెళ్లే జాతీయ రహదారులను మినహాయిస్తే, ఈ రెండు రహదారులపై కూడళ్లలో సిగ్నల్‌ లైట్లు ఉన్నాయి. వాటి వెలుగు ఆరిపోయి ఏళ్లు కావస్తోంది. ప్రధాన కూడళ్లలో సిగ్నల్‌లైట్లను ఏర్పాటు చేసినా నిర్వహణ లేకపోవడంతో మూలనపడుతున్నాయి. వాటిని సరిచేయించే బాధ్యతను వీఎంసీ తీసుకోకపోవడం, పోలీసులు పట్టించుకోకపోవడంతో సిగ్నల్స్‌ నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇతర నగరాల్లో సిగ్నలింగ్‌ వ్యవస్థ ట్రాఫిక్‌ను నడిపిస్తుంటే, విజయవాడలో మాత్రం ఇంకా పోలీసులే పాత పద్ధతిలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. పాలకులు ఇంకెన్నేళ్లకు ఈ పురాతన పద్ధతికి ఫుల్‌స్టాప్‌ పెడతారో వేచి చూడాలి.

Updated Date - 2021-11-03T06:27:20+05:30 IST