వారధి.. ఈజీ దారిదీ!

ABN , First Publish Date - 2022-05-16T06:52:00+05:30 IST

వారధి.. ఈజీ దారిదీ!

వారధి.. ఈజీ దారిదీ!

కనకదుర్గమ్మ వారధి వద్ద ట్రాఫిక్‌ తగ్గించే ప్రణాళిక

గుంటూరు వైపు బస్టాండ్‌ను  ఐలాండ్‌ ఎదురుగా మార్చే యోచన


విజయవాడ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్తున్న బస్సులు ఆగేది అక్కడే. గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌కు వెళ్లే బస్సులు మలుపు తిరిగేదీ అక్కడే. జాతీయ రహదారికి ఇవతలి వైపు నుంచి అవతలి వైపునకు తిరిగే మలుపు కూడా అదే. ఒకే వైపునకు మూడు విభిన్న దారులున్న ప్రదేశమది. అదే వారధికి దిగువన ఉన్న భారీ కూడలి. వచ్చిపోయే బస్సులను ఎక్కడ ఆపాలన్న దానిపై స్పష్టత లేకపోవడం, సరిగ్గా మలుపుల వద్దే బస్టాప్‌ను ఏర్పాటు చేయడం, మలుపుల వరకు ఐలాండ్‌లు ఉండటంతో ఇక్కడ పరిస్థితి తికమక గానే ఉంటుంది. అంతకంటే ప్రమాదకరంగానూ మారింది. దీనికి పరిష్కారం చూపించడానికి కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. 


ఆంధ్రజ్యోతి-విజయవాడ : కనకదుర్గమ్మ వారధికి ఎడమ వైపున ఉన్న గుంటూరు బస్టాండ్‌ను కుడి వైపునకు మారిస్తే ట్రాఫిక్‌ ఇక్కట్లు తీరుతాయని ట్రాఫిక్‌ పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన పూర్తిస్థాయిలో పట్టాలు ఎక్కాలంటే ఆర్టీసీ, నగరపాలక సంస్థ, జలవనరుల శాఖ అధికారులతో చర్చించాలని నిర్ణయించారు. 

మలుపుతో కష్టాలెన్నో..

పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్లే బస్సులు కృష్ణలంక ఆర్వోబీపై నుంచి వచ్చి వారధికి దిగువ ఉన్న ఐలాండ్‌ కూడలి వద్ద మలుపు తీసుకుని గుంటూరు రహదారిపైకి ప్రవేశిస్తాయి. ఆర్టీసీ అధికారులు సరిగ్గా ఆ ప్రదేశంలోనే బస్టాప్‌ను ఏర్పాటు చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇక్కడే వేచి ఉంటున్నారు. మొత్తం ఇక్కడ మూడు మలుపులు ఉన్నాయి. రాణిగారితోట వైపు నుంచి పశువుల ఆస్పత్రి వీధిలోకి వెళ్లాల్సిన వాహనదారులు వారధి వద్ద మొదటి మలుపు నుంచి వెళ్లాలి. రెండో మలుపు నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాల వైపు వెళ్లే బస్సులు వస్తాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి పీఎన్‌బీఎస్‌కు వచ్చే బస్సులు మూడో మలుపు నుంచి వెళ్తాయి. పీఎన్‌బీఎస్‌ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్లే బస్సులను ఇక్కడ ఉన్న స్టాప్‌ వద్ద ఆపడంతో మూడో మలుపులోకి వెళ్లాల్సిన బస్సులకు మార్గం ఉండట్లేదు. ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు, ఆటోలే కాకుండా కొన్ని లారీలు, ఇతర కంటైనర్లు రావడంతో మొత్తం రహదారి స్తంభించిపోతోంది. ఫలితంగా మొదటి మలుపు నుంచి పశువుల ఆస్పత్రి రోడ్డులోకి వెళ్లాల్సిన వాహనదారులు రూటు తప్పి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. వారధికి అందాల లుక్‌ను ఇవ్వడానికి ఇక్కడ విశాల ప్రదేశంలో భారీ ఐలాండ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మూడు మలుపులను వేరు చేసేలా ఐలాండ్‌లు ఏర్పాటు చేశారు. దీనివల్ల ఈ కూడలిలో ఉన్న రహదారులు ఇరుగ్గా మారాయి. ఏకకాలంలో రెండు బస్సులు పక్కపక్కన వెళ్లాలంటే ఇబ్బందే. 

ఇదీ కొత్త ప్రతిపాదన 

గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏర్పాటుచేసిన బస్టాప్‌ను రాణిగారితోట వైపునకు మార్పు చేయాలన్నది కొత్త ప్రతిపాదన. ఐలాండ్స్‌ వైపు నుంచి స్ర్యూబ్రిడ్జి వైపునకు వచ్చే రహదారికి పక్కన జలవనరుల శాఖకు చెందిన ఖాళీ స్థలం ఉంది. ఆర్టీసీ అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఇక్కడ పెద్ద బస్‌బేను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నారు. దీనివల్ల రాణిగారితోట వైపున ఉన్న మలుపుల వద్ద బస్సులు ఆగే అవకాశం ఉండదని ట్రాఫిక్‌ అధికారులు భావిస్తున్నారు. ఈ ఐలాండ్‌కు సమీపానే బస్‌బే ఉంటుంది కాబట్టి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్టాప్‌లో ఎలాంటి సౌకర్యాలు లేవు. కొత్తగా ఇరిగేషన్‌ స్థలంలో బస్‌బే ఏర్పాటు చేసి, అక్కడ ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించడానికి వీలుంటుంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి పీఎన్‌బీఎస్‌కు వచ్చే బస్సులు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులను నిలపడానికి ప్రత్యేకంగా నిర్దిష్టమైన ప్రదేశాన్ని ట్రాఫిక్‌ పోలీసులు సూచించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనపై ట్రాఫిక్‌ అధికారులు వీఎంసీతో సంప్రదింపులు చేశారు. త్వరలో జరగబోయే ట్రాఫిక్‌ సలహా మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనను కలెక్టర్‌ ముందు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఆర్టీసీ, జలవనరుల శాఖ, వీఎంసీ, ట్రాఫిక్‌ విభాగాధికారులు ఒక మాట మీదకు వస్తే వారధి వద్ద ట్రాఫిక్‌ వర్రీస్‌ తొలగిపోతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. 




Updated Date - 2022-05-16T06:52:00+05:30 IST