జవాన్‌ ఇంట విషాదం

ABN , First Publish Date - 2022-08-18T04:38:31+05:30 IST

నిరుపేద కుటుంబానికి చెందిన రాజశేఖర్‌ మృతి చెందడంతో వారి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.

జవాన్‌ ఇంట విషాదం
రాజశేఖర్‌ (ఫైల్‌)

మృతదేహం కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు


సంబేపల్లె, ఆగస్టు 17: దేవపట్ల గ్రామం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన జవాన్‌ దెవరింటి రాజశేఖర్‌ (34) అమర్‌నాథ్‌ యాత్రలో విధులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా జమ్మూ కశ్మీర్‌లో జవాన్‌ వస్తున్న బస్సు లోయలో పడడంతో ఏడుగురు మృతి చెందిన విషయం విదితమే. వీరిలో రాజశేఖర్‌ 12 ఏళ్లుగా (ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌) జవాన్‌గా విధులు నివర్తిస్తున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజశేఖర్‌ మృతి చెందడంతో వారి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఇతడికి 13 సంవతల్సరాల క్రితం వివాహమైంది. భార్య ప్రమీల, పెద్దకుమార్తె దేర్శిని (11), కుమారుడు మోక్షిత్‌ (8),  ఏడాది వయస్సు కలిగిన చిన్న కుమార్తె హిమశ్రీ ఉన్నారు.  మూడు నెలల క్రితం జవాన్‌ ఇంటికి వచ్చినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం భార్యకు ఫోన్‌ చేసిన అతడు మధ్యాహ్నం ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కూలిపనికి వెళితే గాని పూట గడవని ఆ కుటుంబానికి సెంటు భూమి లేదు. వ్యవసాయ కూలి పనులే ఆధారం. రాజశేఖర్‌ ఉద్యోగంతో ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్న ఆ కుటుంబానికి ఉన్న ఆధారం కోల్పోవడంతో బంధువులు, కుటుంబసభ్యులు భోరుమని విలపించారు. ఇతడికి తల్లి రాములమ్మ, తండ్రి చెన్నయ్య, తమ్ముడు సురేష్‌ ఉన్నాడు. ఇతను డిగ్రీ వరకు చదువుకుని కువైత్‌ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చెల్లెలు లావణ్యకు వివాహం జరిగింది. ఉమ్మడి కుటుంబంగా ఉన్న వీరికి కొండంత అండగా ఉన్న రాజశేఖర్‌ ఒకసారిగా లేడు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహం గురువారం ఉదయం స్వగ్రామం రానుందని, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. జవాన్‌ కుటుంబాన్ని డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి పరామర్శించారు. విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి జవాన్‌ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు. 



Updated Date - 2022-08-18T04:38:31+05:30 IST