పిక్‌నిక్‌లో విషాదం

ABN , First Publish Date - 2022-05-29T05:08:51+05:30 IST

అంత వరకూ స్నేహితులతో కలసి కేరింతలు కొట్టిన ఆ చిన్నా రులు అంతలోనే ప్రమా దంలో చిక్కుకున్నారు.

పిక్‌నిక్‌లో విషాదం
గల్లంతయిన నిహాల్‌ (ఫైల్‌)

  1. జీడీపీలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి 
  2. మరొకరు గల్లంతు..  


గోనెగండ్ల, మే 28: అంత వరకూ స్నేహితులతో కలసి కేరింతలు కొట్టిన ఆ చిన్నా రులు అంతలోనే ప్రమా దంలో చిక్కుకున్నారు.  ఒకరు మృత్యువాత పడగా... మరొకరి కోసం గాలిస్తున్నారు.     ఎస్‌ఐ కిశోర్‌ కుమార్‌ రెడ్డి  తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణం రాయనగర్‌లో ఉన్న ఎంబీ చర్చి, ఒకేషనల్‌ బైబుల్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో ఆదివారం సండే స్కూల్‌ ప్రోగ్రాం కింద 120 మంది విద్యార్థులు దేవేంద్ర, కిరణ్‌కుమార్‌, జానల ఆధ్వర్యంలో రెండు బస్సులు, ఒక ఆటోలో గాజులదిన్నె ప్రా జెక్టుకు వచ్చారు. ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించిన అనంతరం భోజనం చేశారు. వీరిలో రాజేష్‌ (14), నిహాల్‌(15) సాయంత్రం 4 గంటల సమయంలో ప్రాజెక్టులోకి ఈతకు వెళ్లారు. కొంత సమయానికే రాజేష్‌ నీటిలో విగతజీవిగా తేలడంతో అక్కడున్న ఉన్న కొంతమంది గమనించి మృతదేహాన్ని బయటకు తీశారు. మరో విద్యార్థి నిహాల్‌ ఆచూకీ  లభ్యం కాలేదు. పోలీసులకు తెలపడంతో సంఘటనా స్థలానికి చేరుకొని జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడే వరకు ఆచూకీ లభ్యం కాలేదు. తహసీల్దార్‌ వేణుగోపాల్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

 -  ఆదోని పట్టణం రాయనగర్‌కు చెందిన జోసెఫ్‌, శాంతమ్మల రెండో కుమారుడు రాజేష్‌ నెహ్రూ మెమోరియల్‌ స్కూల్‌లో ఏడో తరగతి పూర్తి చేశాడు. వీధిలోని పిల్లలందరూ సండే స్కూల్‌ ప్రోగ్రాం కింద గాజుల దిన్నె ప్రాజెక్టుకు వెళ్తుండటంతో తల్లి శాంతమ్మకు చెప్పి బయలుదేరాడు. ‘ఉదయం హీరోలా నల్లకళ్లద్దాలు పెట్టుకొని వచ్చినావు కదా నాన్నా... సాయంత్రంకల్లా ఈ లోకాన్ని విడిచిపోయావా’ అంటూ తల్లి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

నిహాల్‌ కోసం గాలింపు..

ఆదోని పట్టణంలోని రాయనగర్‌ చందిన చిట్టిబాబు, మంజుల ఏకైక కుమారుడు నిహాల్‌. మిల్టన గ్రామర్‌ స్కూల్‌లో 8వ తరగతి పూర్తి చేశాడు. తోటి పిల్లలతో గాజులదిన్నె ప్రాజెక్ట్‌కు వచ్చాడు. నిహాల్‌, రాజే ష్‌లు ఈత కోసం నీటిలోకి వెళ్లారు. రాజేష్‌ మృతిచెందగా...నిహాల్‌ ఆచూకీ దొరకలేదు. రాత్రి పోద్దు పోయే వరకు జాలర్లతో పోలీసులు వెతికించినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఉన్న ఒక్క కుమారుడు గల్లంతు కావడంతో నిహాల్‌ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 




Updated Date - 2022-05-29T05:08:51+05:30 IST