Partition Tragedy: విద్వేషాలు రగల్చొద్దు: జైరాం రమేష్

ABN , First Publish Date - 2022-08-14T20:19:01+05:30 IST

దేశ విభజన నాటి విషాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ..

Partition Tragedy: విద్వేషాలు రగల్చొద్దు: జైరాం రమేష్

న్యూఢిల్లీ: దేశ విభజన నాటి విషాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు విమర్శించింది. ఆగస్టు 14వ తేదీని ''దేశ విభజననాటి అత్యంత భయానక సంఘటనలను గుర్తు చేసుకునే రోజు'' (Partition Horrors Remembrance Day)గా జరుపుకోవడం వెనుక ప్రధానమంత్రి నిజమైన ఉద్దేశం వేరే ఉందని, అత్యంత బాధాకరమైన నాటి ఘటనలను ఆయన రాజకీయ లక్ష్యాల సాధన కోసం, రాజకీయ పోరాటలకు ఉపకరణంగా వాడుకుంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ (Jairam Ramesh) ఆరోపించారు. నాటి విషాద ఘటనల్లో లక్షలాది మంది ప్రజలు స్థానభ్రంశం చెందారని, అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాలను ఎన్నటికీ మరచిపోరాదని, వారిని అగౌరవపరచరాదని అన్నారు.


దీనికి ముందు, మోదీ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, ఆగస్టు 14ను దేశ విభజననాటి భయానక పరిస్థితులను గుర్తు చేసుకునే రోజుగా పాటిస్తున్న నేపథ్యంలో దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయినవారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తెలిపారు. మన చరిత్రలో విషాదకర సమయంలో కష్టనష్టాలకు గురై, పట్టుదల, తట్టుకునే సామర్థ్యంతో అభివృద్ధి కోసం పాటుపడుతున్నవారందరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు. మోదీ గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రసంగిస్తూ, ఆగస్టు 14ను దేశ విభజననాటి భయానక పరిస్థితులను గుర్తు చేసుకునే రోజుగా ప్రకటించారు.


రెండు దేశాల థియరీ సావార్కర్‌దే...

కాగా, దేశవిభజన నాటి విషాదాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేయరాదని, విద్వేషాలు, పక్షపాతాన్ని ఎగదోసే ప్రయత్నం చేయరాదని జైరాం రమేష్ అన్నారు. ''అసలైన నిజం ఏమిటంటే... రెండు దేశాల సిద్ధాంతాన్ని సావార్కర్ పుట్టించారు. జిన్నా దానిని పరిపూర్ణం చేశారు. విభజనను మనం అంగీకరించకుంటే ఇండియా ముక్కముక్కలుగా చీలిపోయి, పూర్తిగా పతనమవుతుందని సర్దార్ పటేల్ రాశారు'' అని ఆయన తెలిపారు. ఇవాల్టి ఆధునిక సావార్కర్లు, జిన్నాలు దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారని ఆయన ఆరోపించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు పాటుపడిన గాంధీ, నెహ్రూ, పటేల్, ఇతర నేతల వారసత్వాన్ని కాపాడేందుకు భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, విద్వేష రాజకీయాలు ఓటమి పాలవుతాయని అన్నారు.

Updated Date - 2022-08-14T20:19:01+05:30 IST