ఇంకా పండగ స్పెషల్స్‌ రైళ్లా?

ABN , First Publish Date - 2021-01-25T06:08:03+05:30 IST

ఇప్పట్లో పండగలు లేకపోయినా రైల్వే శాఖ ఫెస్టివల్‌ స్పెషల్స్‌ పేరుతో రైళ్లని పట్టాలెక్కిస్తోండటం విమర్శలకు తావిస్తోంది.

ఇంకా పండగ స్పెషల్స్‌ రైళ్లా?

 తత్కాల్‌ ఛార్జీల వసూలుతో ఆక్యుపెన్సీ శాతం పతనం

ఇలాగైతే పునరుద్ధరించిన రైళ్లు రద్దు అయ్యే అవకాశం

పండగలు లేనప్పుడు ఫెస్టివల్‌ స్పెషల్‌ అని ఎలా అంటారు?


గుంటూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఇప్పట్లో పండగలు లేకపోయినా రైల్వే శాఖ ఫెస్టివల్‌ స్పెషల్స్‌ పేరుతో రైళ్లని పట్టాలెక్కిస్తోండటం విమర్శలకు తావిస్తోంది. దసరా, దీపావళి, క్రిస్మస్‌, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండగలు గడిచిపోయినా ఇంకా పండగ స్పెషల్‌ పేరుతోనే రైళ్లని నడుపుతూ తత్కాల్‌ ఛార్జీలు వసూలు చేస్తుండటంతో రైలు ప్రయాణం ప్రయాణికులకు భారంగా మారింది. ఫెస్టివల్‌ స్పెషల్‌ కింద నడుపుతున్న రైళ్లకు 500 కిలోమీటర్ల దూరం లోపు ఏ స్టేషన్‌ నుంచి ఏ స్టేషన్‌కి అయినా ఒకే ఛార్జీని వసూలు చేస్తుండటంతో టిక్కెట్‌ బుకింగ్‌ మరింత ప్రియంగా మారింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కి ఏసీ త్రీటైర్‌కి రూ.1,100కు పైగా ఛార్జీ వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు వెనకడుగు వేస్తున్నారు. పండగలు ముగిసిన దృష్ట్యా ఆ నిబంధన ఎత్తి వేయాలని, అలానే కొత్తగా ప్రవేవపెడుతోన్న రైళ్లని సాదారణ ప్రత్యేక రైళ్లుగా నడపాలని రైల్వే యూజర్స్‌ కోరుతున్నారు. 

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల తాకిడి పూర్తిగా తగ్గిపోయింది. అయినప్పటికీ శబరి ఎక్స్‌ప్రెస్‌ని పండగ స్పెషల్‌గానే నడుపున్నారు. స్లీపర్‌క్లాస్‌కే సికింద్రాబాద్‌ నుంచి గుంటూరుకు రూ.415, ఏసీ త్రీటైర్‌ అయితే రూ.1,100 పెట్టి టిక్కెట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే నిబంధనని నరసపూర్‌, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లకి కూడా వర్తింపు చేస్తున్నారు. కాగా కొత్తగా ఈ నెల 27వ తేదీ నుంచి వారానికి మూడు రోజుల పాటు నడవనున్న సికింద్రాబాద్‌ - విశాఖపట్టణం - సికింద్రాబాద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌ని కూడా పండగ స్పెషల్‌ కేటిగిరీ కింద నోటిఫై చేశారు. అలానే రాయగడ ఎక్స్‌ప్రెస్‌ని కూడా పండగ స్పెషల్‌గా తీసుకొస్తున్నారు. దీని వలన ప్రయాణికుల ఆదరణ గణనీయంగా తగ్గుతుంది. సహజంగా రోడ్డు ప్రయాణం కంటే రైలు ప్రయాణం ఖర్చు తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆదరిస్తారు. అలాంటిది బస్సు ఛార్జీ కంటే ఎక్కువగా రైలు టిక్కెట్‌ ఉంటే ప్రయాణికులు కచ్చితంగా బస్సులనే ఆశ్రయిస్తారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి గుంటూరు మీదగా రాకపోకలు సాగిస్తున్న పలు రైళ్ల విషయంలో నెలకొన్నది. తత్కాల్‌ ఛార్జీ వసూలు చేస్తోండటం వలన ఇంచుమించు 50 శాతం సీట్లు/బెర్తులు ఖాళీగా ఉంటోన్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. నరసాపూర్‌, నారాయణాద్రి, శబరి, గువహటి వంటి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో టిక్కెట్‌ దొరకాలంటే చాలా ముందస్తుగా బుకింగ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. నేడు రైలు బయలుదేరే రోజు మూడు, నాలుగు గంటల ముందు చూసినా వందలసంఖ్యలో ఖాళీలు కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు సంక్రాంతి, శబరిమల వెళ్లే ప్రయాణికులు వలన కాస్త అయినా టిక్కెట్లు బుకింగ్‌ అయ్యాయి. ఇప్పుడు ఆ పరిస్థితి రాలేదు. సమీపంలో పెద్ద పండగలు/సెలవులు లేవు. అయినప్పటికీ ఏ కొత్త రైలుని ప్రవేశపెడుతున్నా దానికి పండగ స్పెషల్‌ అని జోడిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పండగ స్పెషల్స్‌ని సాదారణ ఎక్స్‌ప్రెస్‌/ సూపర్‌ఫాస్టులు మార్చకపోతే ప్రయాణికులు లేక ఖాళీగా తిప్పాల్సిన పరిస్థితి ఉత్పన్నమౌతుంది. ఆ పరిస్థితుల్లో ఆక్యుపెన్సీ శాతం లేక రైళ్లని రద్దు చేయాల్సిందిగా బోర్డు ఆదేశాలు జారీ చేసే అవకాశం లేకపోలేదు. 

Updated Date - 2021-01-25T06:08:03+05:30 IST