ఆగిన రైళ్లు.. ప్రయాణికుల పాట్లు

ABN , First Publish Date - 2022-07-02T05:32:43+05:30 IST

గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో శుక్రవారం రైళ్ల ప్రయాణికులు నరకం చూశారు. కనీస సమాచారం లేకుండా ఐదు గంటల సేపు ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోయాయి.

ఆగిన రైళ్లు.. ప్రయాణికుల పాట్లు
గుంటూరు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికలు పడిగాపులు

నల్గొండ - శ్రీరాంపురం మధ్య ఇంజనీరింగ్‌ పనులు

గుంటూరు డివిజన్‌లో ఎక్కడికక్కడ నిలిచిన పలు రైళ్లు

రాత్రి 8 గంటలకు క్లియరెన్స్‌తో యథావిధిగా రాకపోకలు


గుంటూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో శుక్రవారం రైళ్ల ప్రయాణికులు నరకం చూశారు. కనీస సమాచారం లేకుండా ఐదు గంటల సేపు ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు అల్లాడిపోయారు. డివిజన్‌ పరిధిలోని నల్గొండ - శ్రీరాంపురం రైల్వేస్టేషన్ల మధ్య చేపట్టిన బ్రిడ్జి  మరమ్మతులు సకాలంలో పూర్తికాలేదు. 2 గంటల 15 నిమిషాల పాటు లైన్‌ బ్లాక్‌కు అనుమతి తీసుకోగా పనులు పూర్తి అయ్యేసరికి ఐదు గంటలు పట్టింది. లైన్‌బ్లాక్‌ కారణంగా సికింద్రాబాద్‌ - తిరువనంతపురం సెంట్రల్‌ శబరి ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌ - రేపల్లె ఎక్స్‌ప్రెస్‌లను మాత్రమే 135 నిమిషాల పాటు రీషెడ్యూల్‌ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే పనులు జాప్యం కావడంతో శబరి, రేపల్లె రైళ్లతో పాటు ఫలక్‌నుమా, పల్నాడు, చెన్నై, విశాఖ, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లు నిలిపేయాల్సి వచ్చింది. అలానే గుంటూరు వైపు నుంచి వెళ్లిన రైళ్లని కూడా నల్గొండ, సమీప స్టేషన్లలో నిలిపేశారు. శబరి ఎక్స్‌ప్రెస్‌ శ్రీరాంపురం స్టేషన్‌లో మూడు గంటలకు పైగా నిలిపేశారు. చిట్యాల, వలిగొండ, రామన్నపేట, నాగిరెడ్డిపల్లి, బొమ్మాయిపల్లి స్టేషన్లలో రేపల్లె, ఫలక్‌నుమా, పల్నాడు, విశాఖ, చెన్నై, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లను నిలుపుదల చేశారు. శబరి, రేపల్లె ఎక్స్‌ప్రెస్‌లు రెండు గంటలకు పైగా జాప్యం అవుతాయని ప్రయాణికులకు ముందుగానే తెలియజేశారు. మిగతా రైళ్లు యథావిధిగా నడుస్తాయన్నారు. సమాచారం ఇవ్వకుండా నల్గొండ - పగిడిపల్లి సెక్షన్‌లోని చిన్న రైల్వేస్టేషన్లలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను గంటల తరబడి నిలుపుదల చేయడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. స్టేషన్‌ మాష్టర్‌ గదుల వద్దకు వెళ్లి అదే పనిగా ఎప్పుడు క్లియరెన్స్‌ వస్తుందని వాకబు చేశారు. వెంట తెచ్చుకున్న ఆహారపదార్థాలు, మంచినీళ్లు అయిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కాగా రాత్రి 8 గంటల సమయంలో ఎట్టకేలకు మరమ్మతులు పూర్తి చేసి క్లియరెన్స్‌ ఇచ్చారు. అయితే గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ వైపునకు ఎదురొచ్చిన జన్మభూమి, నాగర్‌సోల్‌, ఇంటర్‌ సిటీ, గువహటి ఎక్స్‌ప్రెస్‌లకు క్రాసింగ్‌ల కోసం నిలుపుదల చేయడంతో మరికొంత జాప్యం జరిగింది. రాత్రి 11 గంటల తర్వాత వరుసగా సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే రైళ్లు వస్తాయని గుంటూరు రైల్వేస్టేషన్‌లో అనౌన్స్‌మెంట్‌ ద్వారా తెలిపారు. రైళ్లు ఆలస్యంగా వస్తాయని తెలియక హౌరా, చెన్నై, తిరుపతి, భువనేశ్వర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆయా రైళ్లలో టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకున్న వారు ముందుగానే రైల్వేస్టేషన్‌కు వచ్చి గంటల తరబడి రైళ్ల రాక కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. 



 

Updated Date - 2022-07-02T05:32:43+05:30 IST