పాసింజర్‌ రైళ్లు ఎప్పుడొస్తాయో?

Nov 29 2021 @ 00:11AM

నరసరావుపేట మార్గంలో పగలు నడవని రైళ్లు 

రైల్వే వెనకడుగు..  ప్రయాణికులు తీవ్రంగా ఇక్కట్లు

గుంటూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కరోనా తర్వాత అన్ని మార్గాల్లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. నరసరావుపేట మార్గంలో పగలు పాసింజర్‌ రైళ్ల గురించి ఎందుకనో రైల్వే శాఖ స్పందించడలేదు. ఈ మార్గంలో పాసింజర్‌ రైళ్ల రాకపోకలు ఎప్పటి నుంచి పునరుద్ధరణ జరుగుతాయోనని పరిసర ప్రాంతాల ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కరోనా తర్వాత ఇప్పటి వరకు కేవలం ఒక్క డెమూ రైలుని మాత్రమే రైల్వే శాఖ పునరుద్ధరించింది. అది గుంటూరులో వేకువజామున 6 గంటలకు బయలుదేరి కాచీగూడకు వెళుతున్నది. ఈ రైలుకు కూడా పరిమితంగానే హాల్టింగ్‌లు ఇచ్చారు. గుంటూరులో బయలుదేరితే జిల్లాలో కేవలం పేరేచర్ల, ఫిరంగిపురం, నరసరావుపేట, వినుకొండ రైల్వేస్టేషన్లలో మాత్రమే నిలుపుదల సౌకర్యం కల్పించారు. దీని వల్ల నుదురుపాడు, సాతులూరు, మునమాక, సంతమాగులూరు, వెల్లలచెరువు, శావల్యాపురం, చీకటీగలపాలెం, గుండ్లకమ్మ తదితర ప్రాంతాల ప్రజలకు రైలుసౌకర్యం అనేది లేకుండా పోయింది. వారు రైలు ఎక్కాలంటే వ్యయప్రయాసలకోర్చి వినుకొండ, నరసరావుపేట, ఫిరంగిపురానికి చేరుకోవాల్సి వస్తున్నది. 

అన్ని మార్గాల్లో పునరుద్ధరణ

కరోనా తొలి, రెండు దశల వ్యాప్తి తర్వాత పాసింజర్‌ రైళ్లని ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా రైల్వే శాఖ గుంటూరు డివిజన్‌లోని అన్ని మార్గాల్లో పునరుద్ధరించింది. మాచర్ల, విజయవాడ, రేపల్లె మార్గాల్లో పాసింజర్‌ రైళ్లు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా కూతపెడుతున్నాయి. బస్సు చార్జీలతో పోల్చితే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అయినా తక్కువ చార్జీ కావడంతో ప్రయాణికులు రైళ్ల ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. కాగా గతంలో నరసరావుపేట మార్గంలో పగలు విజయవాడ - హుబ్లీ, గుంటూరు - డోన్‌, రేపల్లె - మార్కాపురం పాసింజర్‌ రైళ్లు నడిచేవి. అలానే రాత్రి వేళ విజయవాడ - బెంగళూరు సిటీ పాసింజర్‌ రైలు కూడా అందుబాటులో ఉండేది. దీంతో ఆ మార్గంలో తరచుగా పాసింజర్‌ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండేవి. అలాంటిది కరోనా తొలి దశ ప్రారంభానికి ముందు వాటిని రద్దు చేసిన రైల్వే శాఖ ఇప్పటి వరకు వాటిల్లో ఒక్కటి కూడా పునరుద్ధరించలేదు.

వినతులకే పరిమితం

డీఆర్‌యూసీసీ, జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యులు రైళ్ల పునరుద్ధరణ గురించి ఇప్పటికే పలుమార్లు రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రయాణికులు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా రైల్వేకి విజ్ఞప్తులు పంపుతున్నారు. నరసరావుపేట, గుంటూరు ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, గల్లా జయదేవ్‌ కూడా ప్యాసింజర్‌ రైళ్ల పునరుద్ధరణ గురించి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు నివేదించారు. అయినప్పటికీ ఇప్పటివరకు పగలు ప్యాసింజర్లలో ఒక్కటి కూడా పట్టాలెక్కించలేదు. 

తిరుపతి, రేపల్లె పాసింజర్లది ఇదే వరస

కొవిడ్‌కి ముందు గుంటూరు - తిరుపతి - గుంటూరు పాసింజర్‌ రైలు నడిచేది. అర్ధరాత్రి వేళ గుంటూరులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటల సమయంలో తిరుపతికి చేరుకునేది. అలానే తిరుపతిలో మధ్యాహ్నం బయలుదేరి అర్ధరాత్రి దాటాక గుంటూరుకు వచ్చేది. ఇక నిత్యం ఉదయం రేపల్లెలో బయలుదేరి సికింద్రాబాద్‌కు సాయంత్రం చేరే పాసింజర్‌ రైలుని కూడా రైల్వే శాఖ పునరుద్ధరించలేదు. ఎంతో డిమాండ్‌ ఉన్న ఈ రైళ్లని పట్టాలెక్కించకపోవడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.