పోస్టాఫీస్‌లో నిలిచిన లావాదేవీలు

ABN , First Publish Date - 2021-06-10T04:58:07+05:30 IST

పోస్టాఫీస్‌లో నిలిచిన లావాదేవీలు

పోస్టాఫీస్‌లో నిలిచిన లావాదేవీలు
ఖాళీగా ఉన్న టెక్కలి హెడ్‌పోస్టాఫీస్‌

- నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి

- ఇబ్బందిపడుతున్న ఖాతాదారులు

టెక్కలి : పట్టణానికి చెందిన టి.నారాయణరావు టెక్కలి హెడ్‌ పోస్టాఫీస్‌లో తన సేవింగ్‌ ఖాతాలో ఉన్న నగదును పొందేందుకు పోస్టాఫీస్‌కు వెళ్లాడు. నాలుగు రోజులు గడుస్తున్నా తన ఖాతా నుంచి నగదు పొందేందుకు అవకాశం లేక వెనుదిరిగాడు. పోస్టాఫీస్‌ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా తాను సేవింగ్‌ ఖాతాలో దాచుకున్న నగదును పొందలేక పోయాడు... ఇలా ఎంతోమంది టెక్కలి హెడ్‌ పోస్టాఫీస్‌లో సేవింగ్‌ ఖాతా లావాదేవీలకు దూరమయ్యారు. రోజుకు సుమారు రూ.25లక్షల వరకు జరిగే డిపాజిట్‌, విత్‌డ్రాలు ప్రస్తుతం నిలిచిపోయాయి. కరోనా కష్టకాలంలో తాము దాచుకున్న నగదు విత్‌డ్రాల కోసం నానా అవస్థలు పడుతున్నట్టు పలువురు ఖాతా దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు సేవింగ్‌ బ్యాంక్‌ లావాదేవీలు, రైల్వే రిజర్వేషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. నెట్‌బ్యాంకింగ్‌కు సంబంధించిన మోడెం మొరాయించడంతో అటు పోస్టల్‌ శాఖ సిబ్బంది సైతం ఖాతాదారులకు జవాబు చెప్పలేక చేతులెత్తేస్తున్నారు. ఈ విషయమై హెడ్‌పోస్ట్‌ మాస్టర్‌ కె.తిరుపతిరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా... నాలుగు రోజులుగా సాంకేతిక సమస్య తలెత్తిందని, సేవింగ్‌ బ్యాంక్‌ లావాదేవీలు నిలిచిపోయాయని, ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లానని చెప్పారు. 


Updated Date - 2021-06-10T04:58:07+05:30 IST