బది..లీలలు

ABN , First Publish Date - 2022-02-19T08:14:03+05:30 IST

సవాంగ్‌ ‘ఇమేజ్‌’ పెంచుతున్నట్లుగా ప్రభుత్వ పెద్దలు కలరింగ్‌ ఇచ్చారు. కానీ... ఇదే నిజమైతే, ఆయనను బదిలీ చేసి జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించరు. ...

బది..లీలలు

సర్దుకున్న సవాంగ్‌... పేచీ పెట్టిన ప్రవీణ్‌

కీలక బదిలీల విషయంలో అనూహ్య మలుపులు

సర్వీస్‌ కమిషన్‌ సారథిగా సవాంగ్‌ నియామకం

‘డీమ్డ్‌ టు బి రిటైర్డ్‌’ క్లాజుతో గవర్నర్‌కు ఫైలు

రాజ్‌ భవన్‌ ఆమోదంతో కథ సుఖాంతం

అదే సమయంలో ప్రవీణ్‌ ప్రకాశ్‌తో పేచీ

కోరింది ఒకటైతే జరిగింది మరొకటని ఆగ్రహం

ఢిల్లీకి వెళ్లేది లేదు.. పేషీలోనే ఉంటానని పట్టు

సానుకూలంగా స్పందించకపోవడంతో ‘ఢిల్లీ’కి


సవాంగ్‌ ‘ఇమేజ్‌’ పెంచుతున్నట్లుగా  ప్రభుత్వ పెద్దలు కలరింగ్‌ ఇచ్చారు. కానీ... ఇదే నిజమైతే, ఆయనను బదిలీ చేసి జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించరు. అలా ఆదేశించడమంటే... బదిలీ వేటు వేసినట్లే. నిజంగానే సవాంగ్‌కు ఏపీపీఎస్సీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని ముందే నిర్ణయించుకుని ఉంటే ఆ పద్ధతి వేరేగా ఉండేది. ఆయనను పిలిచి మాట్లాడి, ప్రక్రియ మొత్తం సిద్ధం చేసి... ఆ తర్వాత ఒకేసారి ఆయన ‘రిటైర్మెంట్‌’, సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా నియామకం ఫైళ్లు పెట్టేవాళ్లు. బదిలీ ప్రస్తావన వచ్చేదే కాదు. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

జగన్‌ సర్కారు చేసిన రెండు కీలక బదిలీలు కనీవినీ ఎరుగని మలుపులు తిరిగాయి. డీజీపీగా బదిలీ అయి... జీఏడీలో రిపోర్ట్‌ చేసుకోవాల్సిన గౌతమ్‌ సవాంగ్‌ అనూహ్యంగా ‘రిటైర్‌’ అయిపోయారు. తనకు ఇష్టం ఉందో, లేదో తెలియదుకానీ... ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్‌ అయ్యారు. ఏది ఏమైనా ఈ విషయంలో సవాంగ్‌ను సర్దుకుపోయేలా చేయడంలో ప్రభుత్వం విజయవంతమైంది. ఇక... మరో బదిలీ విషయంలో ప్రభుత్వమే ‘సర్దుకుపోవాల్సిన’ పరిస్థితి ఏర్పడింది. అది... సీఎం పేషీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ బదిలీ వివాదం! ఆయనను ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే... తాను సీఎం పేషీలోనే కొనసాగుతానని పేచీ పెడుతున్నట్లు సమాచారం! సవాంగ్‌ను అర్ధంతరంగా బదిలీ చేయడంతో జరిగిన ‘డ్యామేజ్‌’ను తగ్గించుకునేందుకు సర్కారు ఆయనకు ఏపీపీఎస్సీ సారథి పోస్టు ఆఫర్‌ చేసింది.


ఆయన ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా మీడియాకు లీకులు ఇచ్చింది. అంతేకాదు... ఈ పోస్టులో చేరాలంటే, ఐపీఎ్‌సగా తనకున్న సర్వీసు వదులుకోవాల్సిందే. మరోవైపు... ఏపీపీఎస్సీలో గత అనుభవాల దృష్ట్యా ఆ పోస్టులో చేరేందుకు సవాంగ్‌ సుముఖత చూపలేదని తెలిసింది. దీంతో... గురువారమంతా కష్టపడి, ఆయన సన్నిహితుల ద్వారా రాయబారాలు నడిపి, ఏపీపీఏస్సీ చైర్మన్‌ పదవి స్వీకరించేందుకు ఒప్పించినట్లు తెలిసింది. గురువారమే ఫైలు తయారు చేసి, శుక్రవారం దానిని రాజ్‌భవన్‌కు పంపించారు. ఇక్కడ... ఆయన వీఆర్‌ఎ్‌సతో సంబంధం లేకుండా, ‘డీమ్డ్‌ టు బి రిటైర్డ్‌’ అనే నిబంధనను వాడుకున్నారు. అంటే, సవాంగ్‌ నియామకం జరిగిన వెంటనే, ఆయన  రిటైర్‌ అయినట్టుగా భావిస్తారు. దీనివల్ల ఐపీఎ్‌సగా ఆయనకు సర్వీసు ప్రయోజనాలన్నీ పూర్తిగా లభిస్తాయి. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక... ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌ నియామకంపై గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. వెరసి... గురువారం  నుంచి శుక్రవారం మధ్యా హ్నం వరకు ప్రభుత్వం జరిపిన అనేక సంప్రదింపులు ఫలించి... ఈ కథ సుఖాంతమైంది. 62 ఏళ్ల వయసు లేదా 6 ఏళ్లు... ఆయన సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ పదవిలో ఉంటారు. వెరసి.. దాదాపు మూడున్నరేళ్లు ఆయన ఈ పదవిలో ఉంటారు.


డ్యామేజ్‌? ఇమేజ్‌?

‘డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌ రెండున్నరేళ్లు పని చేశారు. ఆయనకు మరింత మంచి పోస్టు ఇస్తున్నాం’ అని ప్రభుత్వ పెద్దలు తెలిపారు. సవాంగ్‌ ‘ఇమేజ్‌’ పెంచుతున్నట్లుగా కలరింగ్‌ ఇచ్చారు. కానీ... ఇదే నిజమైతే, ఆయనను బదిలీ చేసి జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించరు. అలా ఆదేశించడమంటే... బదిలీ వేటు వేసినట్లే. నిజంగానే సవాంగ్‌కు ఏపీపీఎస్సీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని ముందుగానే నిర్ణయించుకుని ఉంటే ఆ పద్ధతి వేరేగా ఉండేది. ఆయనను పిలిచి మాట్లాడి, ప్రక్రియ మొత్తం సిద్ధం చేసి... ఆ తర్వాత ఒకేసారి ఆయన ‘రిటైర్మెంట్‌’, సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా నియామకం ఫైళ్లు పెట్టేవాళ్లు. మధ్యలో... బదిలీ అనే ప్రస్తావన వచ్చేదే కాదు. డీజీపీగా రెండున్నరేళ్లు మాత్రమే ఉండాలనే నిబంధన కూడా లేదు. తెలంగాణలో ఐదారేళ్లుగా మహేందర్‌ రెడ్డి డీజీపీగా కొనసాగుతున్నారు. వెరసి... సవాంగ్‌ ఎంత చేసినా, ఇంకా ఏదో చేయలేదనే దాహంతోనే ఆయనను బదిలీ చేశారని స్పష్టమవుతోంది. ఈ పరిణామం ‘బూమరాంగ్‌’ కావడంతో డ్యామేజ్‌ను తగ్గించుకునేందుకే కొత్త వ్యూహం రచించి, అమలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు... సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా తనకు ‘ఎదురయ్యే’ ఇబ్బందుల మాటేమిటని సవాంగ్‌ అడిగినట్లు తెలిసింది. ‘వాటిని పరిష్కరిస్తాం’ అని ప్రభుత్వం తరఫున రాయబారం నడిపిన వారు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక... ముందుగా అనుకున్న ప్రకారమైతే కసిరెడ్డి రాజేంద్రనాథ రెడ్డి శుక్రవారం డీజీపీగా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. సవాంగ్‌ విషయం కొలిక్కి రాకపోవడంతో దానిని ఒకరోజు  వాయిదా వేసుకున్నారు. శనివారం సవాంగ్‌కు అధికారికంగా, గౌరవప్రదమైన వీడ్కోలు పలికి... డీజీపీగా కసిరెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు.


ప్రవీణ్‌తో ‘పేషీ’ పేచీ

సవాంగ్‌ వివాదం సుఖాంతమైనప్పటికీ... ప్రవీణ్‌ ప్రకాశ్‌ రూపంలో సర్కారుకు మరో చిక్కు వచ్చి పడింది. సీఎం పేషీ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ను ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన సతీమణి భావనా సక్సేనా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోవడంతో... ఆమె పనిచేస్తున్న పోస్టులోకే ప్రవీణ్‌ ప్రకాశ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ప్రవీణ్‌ ప్రకాశ్‌ కోరుకున్నదొకటైతే... జరిగింది మరొకటని తెలిసింది. సీఎం పేషీలో కొనసాగుతూనే, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తానని ఆయన కోరుకున్నట్లు సమాచారం. అయితే... ఎక్కడ సమాచార లోపం తలెత్తిందో తెలియదుకానీ, ఆయనను ఏకంగా ఢిల్లీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ప్రవీణ్‌ ప్రకాశ్‌ బదిలీపై సీఎస్‌ ఉత్తర్వులు ఇచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ... ప్రవీణ్‌ ప్రకాశ్‌ మాత్రం తాను పేషీని వదలబోనని మొండికేస్తున్నట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బదిలీ అయినప్పటికీ గత మూడు రోజులుగా ఆయన పేషీలోనే  ఉన్నారు. ఎప్పట్లాగానే విధులు  నిర్వహించారు. తనను ఇక్కడే కొనసాగించాలని సీఎం జగన్‌పై ఆయన తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై సానుకూల స్పందన రాకపోవడంతో... ఢిల్లీలో కొత్త పోస్టులో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. సీఎంవో ముఖ్య కార్యదర్శి పోస్టు నుంచి రిలీవ్‌ కాకుండానే ఢిల్లీకి వెళ్లడంతో... ఇక్కడే ఉండేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్‌!

Updated Date - 2022-02-19T08:14:03+05:30 IST