మాకు న్యాయం చేయండి

ABN , First Publish Date - 2020-12-03T05:41:30+05:30 IST

తాజాగా చేపడుతున్న కౌన్సెలింగ్‌లో తమను మైదాన ప్రాంతాల్లో కూడా నియమించాలనే ప్రధాన డిమాండ్‌తో వైద్య ఆరోగ్య శాఖ జోన్‌-2లో పనిచేస్తున్న మూడో బ్యాచ్‌ మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు (ఎంఎల్‌హెచ్‌పీ) బుధవారం ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని రీజనల్‌ డైరెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

మాకు న్యాయం చేయండి
ధర్నా నిర్వహిస్తున్న ఎంఎల్‌హెచ్‌పీలు

  మైదాన ప్రాంతాల్లో పనిచేసే అవకాశం కూడా ఇవ్వండి

  ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఎంఎల్‌హెచ్‌పీల ఆందోళన

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 2: తాజాగా చేపడుతున్న కౌన్సెలింగ్‌లో తమను మైదాన ప్రాంతాల్లో కూడా నియమించాలనే ప్రధాన డిమాండ్‌తో వైద్య ఆరోగ్య శాఖ జోన్‌-2లో పనిచేస్తున్న మూడో బ్యాచ్‌ మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు (ఎంఎల్‌హెచ్‌పీ) బుధవారం ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని రీజనల్‌ డైరెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కౌన్సెలింగ్‌ను బహిష్కరించి చాలాసేపు ఆర్‌డీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన వీరంతా ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్నారు. తాజాగా చేపడుతున్న కౌన్సెలింగ్‌లో తమను మైదాన ప్రాంతాల్లో కూడా నియమించాలని ఆందోళన చేపట్టారు. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆర్‌డీ వాణిశ్రీ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాధికారుల ఉత్తర్వులకు అనుగుణంగానే కౌన్సెలింగ్‌ చేపడతామని స్పష్టం చేశారు. కౌన్సెలింగ్‌కు వస్తే నిర్వహిస్తామని, లేకుంటే ఈ విషయం ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు. కాగా, మూడు జిల్లాలకు చెందిన సుమారు 77మంది ఎంఎల్‌హెచ్‌పీలకు ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో నియామక ఉత్తర్వులు ఇచ్చింది. కొవిడ్‌ కారణంగా కౌన్సెలింగ్‌ చేపట్టకుండా నేరుగా మెయిల్‌ ద్వారా నియామక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వీరంతా తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఉద్యోగాల్లో చేరిపోయారు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా వీరందరికీ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని అధికారులు నిర్ణయించి, ఆర్‌డీ కార్యాలయానికి రావాల్సిందిగా మెసేజ్‌లు పంపడంతో బుధవారం ఉదయమే ఆర్‌డీ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ కౌన్సెలింగ్‌ ఏజెన్సీ ప్రాంతం పరిధిలోనే చేస్తామని అధికారులు చెప్పడంతో వీరంతా ఆందోళనకు దిగారు. రాత్రి 6 గంటల వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆందోళన చేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీలు కౌన్సెలింగ్‌కు రాకపోవడంతో చేసేదేమీలేక ఇదే విషయాన్ని ఆర్‌డీ వాణిశ్రీ ఉన్నతాధికారులకు మెయిల్‌ ద్వారా తెలియపరిచారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు. కాగా విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ఆర్‌డీ కార్యాలయానికి వచ్చి ఎంఎల్‌హెచ్‌పీలకు సంఘీభావం తెలిపారు. ఆర్‌డీ వాణీశ్రీతో మాట్లాడారు. న్యాయం జరిగే వరకూ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు కూడా ఆందోళనకు మద్దతు తెలిపారు. 


Updated Date - 2020-12-03T05:41:30+05:30 IST