2,000 మంది బదిలీ

ABN , First Publish Date - 2022-07-01T06:50:39+05:30 IST

నేతల ఒత్తిడి...సిఫారసు లేఖలతోనే ఈసారి ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరిగాయి.

2,000 మంది బదిలీ

సిఫారసులకే పెద్దపీట

అధికార యంత్రాంగంపై ప్రజా ప్రతినిధుల తీవ్ర ఒత్తిడి

పలు శాఖల్లో పోస్టింగ్‌లకు చేతులు మారిన కాసులు!

అర్ధరాత్రి తరువాత కొన్ని శాఖల్లో బదిలీ ఉత్తర్వులు 

జిల్లా పరిషత్‌లో 333 మందికి స్థాన చలనం


విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి):

నేతల ఒత్తిడి...సిఫారసు లేఖలతోనే ఈసారి ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో బదిలీల ప్రక్రియకు విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున నోడల్‌ అధికారిగా వ్యవహరించారు. రెవెన్యూతో పాటు అన్ని శాఖల్లో బదిలీలు ఆయన పర్యవేక్షణలోనే జరిగాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి సుమారు రెండు వేల మందికి బదిలీలు జరిగినట్టు అంచనా. కాగా బదిలీల్లో ఈ పర్యాయం అధికార పార్టీ నేతల సిఫారసులకు అధికారులు పెద్దపీట వేశారు. కోరుకున్న చోట పోస్టింగ్‌ కోసం సిఫారసు లేఖ తప్పనిసరి అయిపోయిందని, ప్రభుత్వ అధికారులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండడం బదిలీలు జరిగిన తీరుకు అద్దం పడుతోంది.  


అధికారులపై నేతల ఒత్తిడి

తమకు బాగా కావాల్సిన అధికారులు, సిబ్బంది బదిలీల్లో అధికార పార్టీ నేతలు కీలకంగా వ్యవహరించారు. ఇందులో భాగంగా కొంతమంది ప్రజాప్రతినిధులు సంబంధిత జిల్లా అధికారులను కలిసి తమ ప్రతిపాదనలు అందించారు. మరికొన్ని చోట్ల తమ అనుచరులను పంపించి, తమ అభిమతాన్ని వెల్లడించారు. అదే సమయంలో సిఫారసు లేఖలతో సిబ్బంది హల్‌చల్‌ చేశారు. బదిలీల ప్రక్రియకు గురువారం చివరిరోజు కావడంతో అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టర్లతో విశాఖ కలెక్టర్‌ మల్లికార్జున వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించి, తుది జాబితాలపై నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉద్యోగుల బదిలీల వివరాలు మాత్రం రాత్రి పదకొండు గంటల వరకు విడుదల చేయలేదు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  

జాబితాలు విడుదల చేస్తే ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిడి వస్తుందన్న కారణంగా రెవెన్యూ, ఇరిగేషన్‌, డీఆర్‌డీఏ, డీపీవో...ఇలా అనేక శాఖల ఉద్యోగుల వివరాలు అర్ధరాత్రి తరువాత వెల్లడించే అవకాశం ఉందంటున్నారు. కీలకమైన రెవెన్యూ శాఖలో రాత్రి 12 తరువాతే ఆర్డర్లు వస్తాయని గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న తహసీల్దారు ఒకరు వ్యాఖ్యానించారు. ఇంకా వ్యక్తిగతంగా ఆర్డర్లు ఇస్తారని లేదా సంబంధిత జిల్లా అధికారి మెయిల్‌కు పంపుతారని చెబుతున్నారు. కాగా కలెక్టర్‌ మల్లికార్జున గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ జిల్లాలో రెండు వేల మందికి బదిలీలు జరుగుతాయని సూచనప్రాయంగా చెప్పారు. నిబంధనల మేరకు బదిలీలు చేస్తున్నామన్నారు. ఇదిలావుండగా ఏజెన్సీలో పోస్టింగ్‌కు ఎవరూ ముందుకురాలేదు. ఏదో ఒక కారణంతో తప్పించుకునేందుకు తమకు తెలిసిన అధికార పార్టీ నేతలతో ఒత్తిడి తెచ్చారు. అల్లూరి జిల్లాలో అన్ని శాఖలకు ఉద్యోగులు అవసరమని ఉన్నతాధికారులు గుర్తించారు. అయితే అక్కడకు వెళ్లేందుకు ఉద్యోగులు ససేమిరా అనడంతో దీనిని ఎలా అధిగమించాలో తెలియక ముగ్గురు కలెక్టర్లు మల్లగుల్లాలు పడ్డారు. 


జడ్పీలో 333 మందికి బదిలీ...ఏడుగురు ఎంపీడీవోలకు పోస్టింగ్‌

జిల్లా పరిషత్‌ పరిధిలో మొత్తం 633 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఒకేచోట ఐదేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకున్న ఉద్యోగులు 277 మంది. అయితే ఒకేచోట ఐదేళ్ల కంటే తక్కువ సర్వీసు పూర్తిచేసుకున్న మరికొందరు రిక్వెస్టు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర 333 మందిని బదిలీ చేసినట్టు సీఈవో విజయకుమార్‌ తెలిపారు. వీరిలో ఏడుగురు ఎంపీడీవోలు, 35 మంది పాలనాధికారులు, 51 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 87 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, 19 మంది టైపిస్టులు, 35 మంది రికార్డు అసిస్టెంట్లు, 89 మంది ఆఫీస్‌ సబార్డినేటర్లు ఉన్నారు. పద్మనాభం ఎంపీడీవో జీవీ చిట్టిరాజును కోటవురట్లకు, అక్కడ పనిచేస్తున్న సువర్ణరాజును బుచ్చెయ్యపేటకు బదిలీ చేశారు. బుచ్చెయ్యపేట ఎంపీడీవో వి.విజయలక్ష్మిని అచ్యుతాపురానికి, అక్కడ పనిచేస్తున్న సీహెచ్‌.  నిర్మలాదేవిని పద్మనాభం, జి.మాడుగుల ఎంపీడీవో జీకే వెంకన్నబాబును రావికమతానికి, అక్కడ పనిచేస్తున్న ఎన్వీ రామచంద్రమూర్తిని ఎస్‌.రాయవరానికి, అక్కడి ఎంపీడీవో డి.చంద్రశేఖర్‌ను అనకాపల్లికి బదిలీ చేశారు.

వ్యవసాయ శాఖలో..: వ్యవసాయ శాఖలో 14 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లు, 29 మంది వ్యవసాయాధికారులు బదిలీ అయ్యారు. కార్యాలయ సూపరింటెండెంట్‌, పాలనాధికారితోపాటు ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్లు, 38 మంది వ్యవసాయ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లు, 11 మంది అటెండర్లను బదిలీ చేశారు. 

పౌర సరఫరాల శాఖలో...: విశాఖ నగరం సర్కిల్‌ 1 సహాయ పౌరసరఫరాల అధికారి కె.లక్ష్మీనరసింహమూర్తిని విజయనగరం జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో శ్రీకాకుళం నుంచి మురళీనాథ్‌కు పోస్టింగ్‌ ఇచ్చారు. సర్కిల్‌-2 ఏఎస్‌వో ఎంవీవీ ప్రసాద్‌ను రాజమండ్రి బదిలీ చేయగా, అతని స్థానంలో ఎవరినీ నియమించలేదు. జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయం, నగర పరిధిలోని మూడు సర్కిళ్లల్లో పనిచేస్తున్న దాదాపు 28 మంది సిబ్బందిలో పలువురికి బదిలీ అయింది. 


ఖజానా కార్యాలయంలో

ఖజానా కార్యాలయంలో మొత్తం ఐదుగురు సీనియర్‌ అసిస్టెంట్లను బదిలీ చేశారు. విశాఖ కార్యాలయంలో ఒకరు, సీతమ్మధార సబ్‌ట్రెజరీలో ఒకరు, అనకాపల్లిలో ఇద్దరు, పాడేరులో ఒకరు బదిలీ జాబితాలో ఉన్నారు. 



దేవదాయ శాఖలో...

అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి ఎన్టీఆర్‌ జిల్లాకు బదిలీ

కొత్త ఏసీగా కె.శిరీష


విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, కనకమహాలక్ష్మి దేవస్థానం ఇన్‌చార్జి ఈవో కాళింగిరి శాంతికి ఎన్టీఆర్‌ జిల్లాకు బదిలీ అయ్యింది. ఆమె స్థానంలో శ్రీకాకుళంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న కె.శిరీషను నియమించారు. ఈమె గతంలో విశాఖపట్నంలోనే గ్రేడ్‌-1 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పలు ఆలయాల బాధ్యతలు నిర్వహించారు. పూర్ణామార్కెట్‌ దుర్గాలమ్మ, ఇసుకకొండ సత్యనారాయణస్వామి, సీతమ్మధార సాయిబాబా ఆలయాల్లో పనిచేశారు. పదోన్నతిపై ఇటీవలె శ్రీకాకుళం ఏసీగా వెళ్లారు. తాజా బదిలీల్లో కాళింగిరి శాంతి ఐదేళ్లు పూర్తికాకుండానే ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆమె అభ్యర్థనను మన్నించి, ఖాళీ అయిన స్థానంలో శిరీషను నియమించారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న టి.అన్నపూర్ణను శ్రీకాకుళం జిల్లా దేవదాయ శాఖ అధికారిగా బదిలీ చేశారు. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దేవస్థానం ఈవోగా భీమవరంలో దేవదాయ అధికారిగా పనిచేస్తున్న సి.చంద్రశేఖర్‌ను నియమించారు. ఆయనకే అల్లూరి జిల్లా దేవదాయ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. నూకాంబిక ఆలయ ఈవోగా పనిచేస్తున్న నగేష్‌ను ఇసుకకొండ సత్యనారాయణస్వామి దేవస్థానం ఈవోగా బదిలీ చేశారు.



Updated Date - 2022-07-01T06:50:39+05:30 IST