ఆ టీచర్లకే మంచి స్థానాలు! ఏపీలో బరితెగింపు బదిలీలు!

ABN , First Publish Date - 2022-06-25T16:01:22+05:30 IST

లక్షల మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న తరుణంలో పాఠశాల విద్యాశాఖ.. అడ్డదారి బదిలీలకు తెరతీసింది. అధికారికంగా బదిలీల ప్రక్రియ ప్రారంభించకుండానే రాజకీయ అండదండలున్న వారికి మంచి స్థానాలకు బదిలీ చేసే ప్రయత్నాలు చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులున్న ఉపాధ్యాయులు..

ఆ టీచర్లకే మంచి స్థానాలు! ఏపీలో బరితెగింపు బదిలీలు!

399 మంది టీచర్లను ముందే బదిలీచేసే యత్నం

బొత్స సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులే ప్రాతిపదిక

ముందే మంచి స్థానాల ఎంపిక

వాటి ఖాళీలపై డీఈవోల నుంచి వివరాల సేకరణ

జీవో 117 వివాదం తేలకముందే ఈ బరితెగింపు ఎందుకో?

హడావుడిగా పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు

సాక్షాత్తూ సీఎంవో ఆదేశాల మేరకే మొత్తం ప్రక్రియ?



వడ్డించేవాడు మనవాడైతే.. అన్నది నానుడి! టీచర్ల బదిలీల విషయంలో మాత్రం కాస్త భిన్నంగా సాగుతోంది. షెడ్యూల్‌ కూడా విడుదల కాకముందే.. అదీ సాక్షాత్తూ సీఎం కార్యాలయం ఆదేశాల మేరకే అడ్డగోలు బదిలీలకు తెరతీసినట్లు తెలుస్తోంది. అధికారికంగా బదిలీల ప్రక్రియ ప్రారంభం కానప్పటికీ.. రాజకీయ అండదండలున్నవారి కోసం ముందుగానే మంచి స్థానాలను ఎంపిక చేస్తూ జాబితా రూపొందించేస్తున్నారు!. ఈ బది‘లీలల్లో’.. విద్యా మంత్రి బొత్స  సహా, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఆఖరికి ఓ సర్పంచ్‌ సిఫారసు కూడా ఉండడం గమనార్హం!


అమరావతి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): లక్షల మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న తరుణంలో పాఠశాల విద్యాశాఖ(Department of School Education).. అడ్డదారి బదిలీలకు తెరతీసింది. అధికారికంగా బదిలీల ప్రక్రియ ప్రారంభించకుండానే రాజకీయ అండదండలున్న వారికి మంచి స్థానాలకు బదిలీ(Transfer) చేసే  ప్రయత్నాలు చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులున్న ఉపాధ్యాయులు కోరుకుంటున్న స్థానాల్లో ఖాళీల గురించి ఆరా తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 399 మంది ఉపాధ్యాయలు వివరాలను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపి, వెంటనే వారు కోరుకున్న స్థానాల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. అది కూడా మధ్యాహ్నం 12గంటల లోపే వివరాలు ఇవ్వాలని ఆగమేఘాల మీద ఆదేశాలు జారీచేయడం గమనార్హం. ఇందులో జిల్లాల అంతర్గత బదిలీలతో పాటు అంతర్‌ జిల్లాల బదిలీల సిఫారసులు కూడా ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహా మంత్రులందరి సిఫారసులు ఇందులో ఉన్నాయి. వారితోపాటు ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేల సిఫారసులున్నట్లు జాబితాలో పాఠశాల విద్యాశాఖ చూపుతోంది. చివరికి ఓ గ్రామ సర్పంచ్‌ సిఫారసును కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఖాళీలపై వివరాలు కోరడం గమనార్హం.


మ్యాపింగే కాలేదు...

ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ తీవ్ర గందరగోళంలో ఉంది. రేషనలైజేషన్‌ ప్రక్రియ కోసం జారీచేసిన జీవో 117 వివాదాలకు కారణంగా మారింది. దానిపై సవరణలు కావాలని ఉపాధ్యాయులు పట్టుబడుతున్నారు. అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ ఇంకా నిర్ణయం వెలువడలేదు. మరోవైపు పాఠశాలల మ్యాపింగ్‌ పూర్తికాలేదు. ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇచ్చే ప్రక్రియనూ చేపట్టలేదు. మ్యాపింగ్‌ పూర్తికావడానికి మరో 10 రోజులు పట్టే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల సాధారణ బదిలీలను ప్రారంభించడానికీ మరో రెండు వారాలైనా పట్టే అవకాశం ఉంది. బదిలీలపై ప్రభుత్వం జీవో జారీచేశాక షెడ్యూలు విడుదలవుతుంది. ఆన్‌లైన్‌ విధానంలో వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీల ప్రక్రియ జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. కానీ షెడ్యూలు కూడా విడుదల కాకుండా ఈ ఉత్తర్వులు జారీకావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.


సీఎంవో చెప్పిందని...

డీఈవోలకు వచ్చిన జాబితాల్లో సీఎంవో పేరు ఉంది. అంటే నేరుగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినందున వెంటనే ఖాళీల వివరాలు ఇవ్వాలనేది పాఠశాల విద్యాశాఖ వాదన. అసలు ఏ ప్రాతిపదికన సీఎంవో ఈ వివరాలు అడిగింది? షెడ్యూలు లేకుండా సిఫారసులు ఏంటి? అనేదానిపై ఎవరి వద్దా స్పష్టత లేదు. తమకు కావాల్సిన వారికి ముందుగానే మంచి స్థానాలను కేటాయించడం కోసం అడ్డదారిలో ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియారిటీ, బదిలీ మార్గదర్శకాలు కాకుండా కావాల్సిన చోటు తొలుత వీరికి కేటాయిస్తే అనంతరం సాధారణ బదిలీల్లో మిగిలిన ఉపాధ్యాయులు అనామక స్థానాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర వివాదానికి దారితీసే అవకాశం కూడా ఉంది. ఇలా కావాల్సిన వారికి ముందుగానే మంచి స్థానాలు ఇవ్వడం నిబంధనలను తుంగలో తొక్కడమేనని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి.


బదిలీనా? బ్లాకా?

కాగా, తాజాగా డీఈవోలకు పంపిన జాబితాల్లో ప్రభుత్వం అడిగినట్లుగా ఆ స్థానాలు ఖాళీ ఉంటే ఏంచేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఆదేశించింది అనే పేరుతో వెంటనే బదిలీలు చేస్తారని, లేదంటే ఆ స్థానాలను సిఫారసులున్న వారికోసం బ్లాక్‌ చేస్తారని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఒకప్పుడు ఇలాంటి వ్యవహారాలే ఉన్నా గత రెండు పర్యాయాలుగా ఇలాంటి సిఫారసుల బదిలీలకు అవకాశం ఇవ్వడం లేదు. ఆరోపణలు వస్తున్నాయని వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా పారదర్శక విధానంలో బదిలీలు చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ చాలాకాలం తర్వాత మళ్లీ పాత విధానంలో అడ్డగోలు బదిలీలకు వైసీపీ ప్రభుత్వం తెరతీసింది. దీనిని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి!.



Updated Date - 2022-06-25T16:01:22+05:30 IST