పరివర్తన

ABN , First Publish Date - 2022-06-24T06:31:13+05:30 IST

మనిషిలోని రాక్షసుణ్ణి మట్టుపెట్టి... మంచి దారి వైపు నడిపించే శక్తి పశ్చాత్తాపానికి ఉంది.

పరివర్తన

నిషిలోని రాక్షసుణ్ణి మట్టుపెట్టి... మంచి దారి వైపు నడిపించే శక్తి పశ్చాత్తాపానికి ఉంది. ఎన్నో దుర్మార్గాలు చేసిన వ్యక్తిలో... ఒక చిన్న సంఘటనతో చాలా పెద్ద మార్పు రావచ్చు. అలాంటి మార్పు కలిగిన ఒక వ్యక్తి కథ ఇది.

ఒక ఊర్లో ఒక జమీందారు ఉండేవాడు. తన ఆస్తిపాస్తులు చూసుకొని గర్వపడేవాడు. తనకు నచ్చిన స్త్రీలను బలవంతంగా రప్పించుకొనేవాడు. అందరూ అతనంటే భయంతో బతికేవారు. 

ఒక రోజు ఆ జమీందారు వేరే ఊరు వెళుతున్నాడు. దార్లో ఒక ఇంటి ముందు కూర్చొని,  ఏదో పని చేసుకుంటున్న అమ్మాయి మీద అతని కన్ను పడింది.  ఆ రాత్రి ఆమెను తన ఇంటికి తీసుకురమ్మని సేవకులకు ఆజ్ఞాపించాడు. 

ఆ అమ్మాయిది చాలా పేద కుటుంబం. ఆమె తల్లితండ్రులను జమీందారు సేవకులు బెదిరించారు. ‘‘జమీందారు మాట వినకపోతే మీ ప్రాణాలకు ముప్పు తప్పదు’’ అని హెచ్చరించారు. భయపడిన ఆమె తల్లితండ్రులు... ఆ అమ్మాయిని ఎలాగో ఒప్పించారు. రాత్రి ఆమె జమీందారు ఇంటికి వచ్చింది. అతను అప్పటికే ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. ఆమె భయంతో వణుకుతూ నిలబడింది. ధర్మపరాయణత కలిగిన ఆ అమ్మాయి అల్లా్‌హను ప్రార్థిస్తూ ‘దేవా! ఈ చెడు పని నుంచి నన్ను ఎలాగైనా రక్షించు’ అనుకుంటూ బరువెక్కిన మనసుతో కన్నీటిపర్యంతం అయింది.


జమీందారు ఆమె దగ్గరకు వెళ్ళి... ‘‘నీకు ఏం కావాలో కోరుకో. ఇవాళ నా కోరిక తీరిస్తే నీకు ఏం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను’’ అన్నాడు.

‘‘నాకు అల్లాహ్‌ ఇచ్చిన దానితో చాలా సంతోషంగా ఉన్నాను. ఇటువంటి చెడు పనికి నేను అసలు ఒప్పుకోను. షహర్‌ మైదానంలో... తీర్పు దినాన... అల్లాహ్‌ ఎదుట నిలబడి జవాబు చెప్పాల్సి ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు భగభగ మండే నరకంలో శాశ్వతంగా ఉండాల్సిందే’’ అంది.


ఆమె మాటల విన్న అతనికి కొరడా దెబ్బ తిన్నట్టయింది. ‘ఒక నిరుపేద అమ్మాయి... కావలసినంత సంపద ఇస్తానని తను ఆశ పెట్టినప్పటికీ ప్రలోభపడకపోగా... అల్లాహ్‌ ఇచ్చిన దానితో సంతోషంగా ఉన్నానని చెబుతోంది. చెడు చేస్తే అల్లాహ్‌ ఎదుట క్షమాపణ తప్పదని అంటోంది. ఆల్లాహ్‌ నాకు ఎంతో సంపద ఇచ్చాడు. అఽధికారం ఇచ్చాడు. కానీ ఆల్లాహ్‌ పట్ల ఆ పేద పిల్లకు ఉన్న విశ్వాసం నాలో ఏదీ? మరి తీర్పు రోజున నా పరిస్థితి ఏమిటి?’ అనే ఆలోచన 

ఆ జమీందారును కుదిపేసింది.

గదిలో వెలుగుతున్న దీపం దగ్గరకు వెళ్ళాడు. తన రెండు చేతులను మంట మీద పెట్టి కాల్చుకున్నాడు. 

‘‘ఆల్లాహ్‌! నా తప్పులను క్షమించు. జీవితంలో మంచి మార్గం వైపు నడిపించు’’ అంటూ సాష్టాంగపడ్డాడు. అతనిలో పరివర్తనను గమనించిన ఆ అమ్మాయి... అల్లా్‌హకు కృతజ్ఞతలు తెలుపుకొంటూ అక్కడి నుంచి బయటకు నడిచింది.   

       మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2022-06-24T06:31:13+05:30 IST