కరోనాతో బాధపడుతున్నారా.. మీ పిల్లలను ఇలా కాపాడుకోండి

May 9 2021 @ 10:46AM

  • ఆలన.. పాలన.. అన్నీ తామై..!
  • చిన్నారులకు అండగా ‘ట్రాన్సిట్‌ హోమ్స్‌’
  • కొవిడ్‌ బారిన పడిన తల్లిదండ్రుల నుంచి రక్షణ
  • సెంటర్లలో పోషకాహారం, 24 గంటలపాటు ఆరోగ్య సేవలు
  • పేరెంట్స్‌కు నెగిటివ్‌ వచ్చాకే ఇంటికి చేరవేత
  • జంట నగరాలు, శివారులోని 7 ప్రాంతాల్లో కేంద్రాల ఏర్పాటు
  • కరోనా కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేయూత
  • చైల్డ్‌లైన్‌ 1098కు కాల్‌ చేస్తే సత్వర సేవలు

హైదరాబాద్‌ సిటీ : పాజిటివ్‌ నిర్ధారణ అయిందా.. ఇద్దరూ కరోనాతో బాధపడుతుంటే పిల్లలను ఎలా కాపాడుకోవాలి.. వారికి రోజువారీగా ఆహారం ఎలా అందించాలి, స్నానం ఎలా చేయించాలి.. దుస్తులు ఎలా వేయాలి.. అని ఆందోళన చెందుతున్నారా..! అయితే  దిగులు చెందకండి. కరోనా విపత్కర పరిస్థితుల్లో హోం క్వారంటైన్‌, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల పిల్లలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు స్ర్తీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జంట నగరాలు, శివారుల్లోని వివిధ ప్రాంతాల్లో ‘ట్రాన్సిట్‌ హోమ్స్‌’ పేరిట ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. 


ఈనెల 6న ప్రారంభం..

కరోనా బాధితుల పిల్లల కోసం ఈనెల 6న అమీర్‌పేట్‌లోని మధురానగర్‌ స్ర్తీ, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్‌లో ‘ట్రాన్సిట్‌హోమ్స్‌’ను మంత్రి సత్యవతి రాథోడ్‌ లాంఛనంగా ప్రారంభించారు. కరోనా కష్టకాలంలో చిన్నారులు, బాలబాలికలను వైరస్‌ నుంచి కాపాడేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.

కేంద్రాల్లో సేవలు ఇలా..

కుటుంబంలోని భార్యభర్తలు, లేకుంటే ఇద్దరిలో ఎవరైనా ఒకరు కొవిడ్‌తో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ట్రాన్సిట్‌ హోమ్స్‌ హెల్ప్‌ డెస్క్‌, చైల్డ్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేసి సమాచారం అందిస్తే వెంటనే సిబ్బంది బాధితుల ఇంటికి వెళ్లి చిన్నారులను కేంద్రాలకు తీసుకెళ్లారు. అంతకుముందే పిల్లలకు కొవిడ్‌ పరీక్ష చేయించి నెగెటివ్‌ రిపోర్టు దగ్గర ఉంచుకుని సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది. పరీక్ష చేయించకుంటే ట్రాన్సిట్‌ హోమ్స్‌ నిర్వాహకులే కొవిడ్‌ టెస్టు చేయించి వసతి కల్పిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో ప్రతి చిన్నారికి 24 గంటలపాటు వైద్యసేవలందించేందుకు అందుబాటులో పిడియాట్రిషన్‌, ఎంబీబీఎస్‌ డాక్టర్‌, నర్సు, అటెండర్‌, ముగ్గురు సహాయకులు ఉంటున్నారు. భౌతిక దూరంతో ఒక్కొక్కరికి బెడ్‌, సబ్బు, టూత్‌పేస్టు, భోజనప్లేటు, తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండకుండా గట్టి చర్యలు చేపట్టారు.


కేంద్రంలో ఉంటున్న పిల్లలు 24 గంటలపాటు మాస్కు ధరించాలని సూచిస్తున్నారు. ఇంటి నుంచి తీసుకొచ్చిన చిన్నారులు, బాలబాలికలు ట్రాన్సిట్‌ హోమ్స్‌లో ఉన్న సమయంలో అనుకోకుండా కరోనా బారిన పడితే వారిని వెంటనే నగరంలోని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేయనున్నారు. తల్లిదండ్రులు ఆస్పత్రి నుంచి వచ్చే వరకు, ఇంట్లో ఉంటే క్వారంటైన్‌ గడువు ముగిసే వరకు అత్యంత జాగ్రత్తగా పిల్లలను కాపాడుతున్నారు. కేంద్రంలో ఉంటున్న చిన్నారులు, సిబ్బంది కదలికలను సీసీ టీవీల ద్వారా అనునిత్యం పర్యవేక్షిస్తున్నారు. సురక్షితమైన వసతిని అందించడంతోపాటు మంచి పోషకాహారం, ఆటపాటలతో సరదాగా గడిపిస్తున్నారు. ప్రధానంగా తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్నామనే దిగులు లేకుండా ప్రతి రోజూ రెండు, మూడు సార్లు వీడియోకాల్‌లో మాట్లాడిస్తున్నారు. అలాగే మానసికంగా ధైర్యం కల్పిస్తూ ఇంటిలో ఉన్న అనుభూతి తెప్పిస్తున్నారు.

కేంద్రాలు ఎక్కడంటే..

అమీర్‌పేట్‌లోని మధురానగర్‌లో ట్రాన్సిట్‌ హోమ్స్‌ ఫర్‌ గ్లర్స్‌

సికింద్రాబాద్‌లో ఆశ్రిత హోమ్‌ ఫర్‌ బాయ్స్‌

మహేశ్వరం మండలంలో ప్రజ్వల అస్తనివాస్‌

రాజేంద్రనగర్‌లో ఎస్‌ఓఎస్‌ చిల్డ్రన్‌ విలేజ్‌ ఫర్‌ గ్లర్స్‌

వనస్థలిపురంలో వివేకానంద విద్యా వికా‌స్‌కేంద్ర

ఘట్‌కేసర్‌ మండలంలోని మజార్‌గూడలో షౌన్‌ కేర్‌ ఫర్‌ గ్లర్స్‌

సికింద్రాబాద్‌లో డాన్‌బాస్కో హోమ్‌ ఫర్‌ బాయ్స్‌ 


సంప్రదించాల్సిన నంబర్లు..

040-23733665 (రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు)

చైల్డ్‌లైన్‌ నంబర్‌: 1098

ఎవరు అర్హులంటే: 5-18 వయసు కలిగిన వారు

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.