లారీలపై ఆంక్షలా?

ABN , First Publish Date - 2020-11-28T06:41:23+05:30 IST

పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం లోడుతో వస్తున్నాయని రాష్ట్ర సరిహద్దుల్లో వందలాది లారీలను నిలిపివేసిన ప్రభుత్వం.. రైళ్లలో భారీగా తరలిస్తున్న ధాన్యంపై చేతులెత్తేసింది.

లారీలపై ఆంక్షలా?

రైళ్ల ద్వారా ధాన్యం దిగుమతులు 

లారీ యజమానుల ఆందోళన 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

 పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం లోడుతో వస్తున్నాయని రాష్ట్ర సరిహద్దుల్లో వందలాది లారీలను నిలిపివేసిన ప్రభుత్వం.. రైళ్లలో భారీగా తరలిస్తున్న ధాన్యంపై చేతులెత్తేసింది. కొద్ది రోజులుగా జిల్లాకు చెందిన మిల్లర్లు రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు లభించే ధాన్యాన్ని భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం దిగుమతులను నియంత్రించాలని సరిహద్దు చెక్‌పోస్టులకు ప్రభుత్వం ఆదేశించిడంతో ఈ నెల మొదటి వారంలో సరిహద్దుల్లోని ఇచ్చాపురం వద్ద రాష్ట్రానికి చెందిన 500కు పైగా లారీలను నిలిపివేశారు. ఈ లారీలు వారం వరకు సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రంగంలోకి  దిగి మంత్రులు పేర్ని, కొడాలి నానిలను కలిసి విజ్ఞప్తి చేయడంతో ఇటీవలే లారీలన్నింటినీ విడుదల చేశారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రవాణాలో వేర్వేరు నిబంధనలు ఉండటం లారీ యజమానులను ఆవేదనకు గురిచేస్తోంది. లారీలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం రైళ్లలో తరలివస్తున్న ధాన్యంపై దృష్టి సారించటం లేదని పలువురు లారీ యజమానులు వాపోతున్నారు. ప్రభుత్వం ధాన్యం రవాణా ఆపివేయమని కోరగానే.. తాము ఆపివేశామని, రైళ్ల ద్వారా వచ్చే ధాన్యం సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. లారీ రవాణాకు ఒకలా, రైల్వే రవాణాకు మరోలా నిబంధనలు విధించటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు విధించిన మార్గదర్శకాలనే రైళ్ల ద్వారా జరుగుతున్న  దిగుమతులకు కూడా వర్తింప చేయాలని పలువురు లారీ యజమానులు కోరుతున్నారు. కొవిడ్‌ కారణంగా లారీలకు కిరాయిలు లేక అల్లాడిపోతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం రవాణా మాత్రమే కాస్త బాగున్నదని, ప్రభుత్వం వద్దన్న తర్వాత కిరాయిలు పోతున్నా ధాన్యం లోడ్లను ఎత్తుకోవటం లేదని వారు పేర్కొన్నారు. లారీల ద్వారా ధాన్యం రవాణా జరిగితే.. లారీ యజమానులు, లారీలపై ఆధారపడిన సిబ్బందితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా  ప్రయోజనం ఉంటుందని, అదే రైళ్ల ద్వారా జరిగితే ఆ శాఖకు మినహా ఎవరికీ ప్రయోజనం ఉండదని అంటున్నారు.  ఇందుకు సంబంధించి, మార్గదర్శకాలను రూపొందించి, అన్ని రకాల రవాణా వ్యవస్థలకు ఒకటే విధానాన్ని అమలు చేయాలని లారీ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2020-11-28T06:41:23+05:30 IST