ప్రయాణ యాతన

ABN , First Publish Date - 2021-01-17T05:15:25+05:30 IST

సంక్రాంతికి స్వగ్రామాలకు వచ్చి తిరుగు ప్రయాణమైన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. రైళ్లలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణ యాతన అనుభవిస్తున్నారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాస్తున్నారు. కొందరు విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు కార్లను ఆశ్రయిస్తుండా దాన్ని ఆసరా చేసుకొని ట్రావెల్స్‌ నిర్వాహకులు భారీగా బాదేస్తున్నారు.

ప్రయాణ యాతన
ఒంగోలు ఆర్టీసీ డిపోలో బస్సుల వద్ద ప్రయాణికుల తాకిడి

రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్‌

కిటకిటలాడుతున్న బస్సులు

బస్టాండ్‌లు, స్టేషన్లలో రద్దీ

గంటల తరబడి పడిగాపులు

ప్రైవేటు కారు ట్రావెల్స్‌కు డిమాండ్‌

బాడుగలను భారీగా పెంచి 

సొమ్ము చేసుకుంటున్న నిర్వాహకులు 


ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 16  : సంక్రాంతికి స్వగ్రామాలకు వచ్చి తిరుగు ప్రయాణమైన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. రైళ్లలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణ యాతన అనుభవిస్తున్నారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాస్తున్నారు. కొందరు విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు కార్లను ఆశ్రయిస్తుండా దాన్ని ఆసరా చేసుకొని ట్రావెల్స్‌ నిర్వాహకులు భారీగా బాదేస్తున్నారు. 

ఉద్యోగాలకు, చదువులు, ఉపాధి కోసం రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు పెద్దపండుగ అయిన సంక్రాంతికి సొంతూళ్లకు చేరుకున్నారు. మూడు రోజులు పండుగ సంబరాల్లో మునిగి తేలారు. శనివారం నుంచి పిల్లాపాపలతో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే రద్దీకి తగిన విధంగా బస్సులు లేకపోవడం, కరోనా ప్రభావంతో పూర్తిస్థాయిలో రైళ్లు తిరగకపోవడం, లాక్‌డౌన్‌ అనంతరం జనరల్‌ బోగీలను పునరుద్ధరించకపోవడంతో ప్రయాణ కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. 


పల్లె వెలుగుల కోసం పడిగాపులు 

పల్లెల నుంచి పట్టణాలకు ప్రయాణించేందుకు జిల్లాలో అధిక శాతం ఆర్టీసీనే ఆధారం. అయితే అందుకు అనుగుణంగా బస్సులు నడవడం లేదు. దీంతో ఇతర ప్రాంతాలకు తిరుగు ప్రయాణమైన వారు పట్టణాలకు చేరుకోవడానికే నానాపాట్లు పడుతున్నారు. ఎలాగోలా వచ్చినా వారు వెళ్లాల్సిన ప్రాంతాలకు ప్రైవేటు ట్రావెల్స్‌లో కానీ, ఆర్టీసీలో కానీ ఖాళీలు లేని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు ట్రావెల్స్‌లోని ఓల్వా, ఇంద్ర, సూపర్‌ లగ్జరీ, స్లీపర్‌, గరుడా వంటి బస్సుల్లో ఇప్పటికే రిజర్వేషన్‌లు ఫుల్‌ అయ్యాయి. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌లకు పరుగులు తీస్తున్నారు. 


బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో రద్దీ

జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో శనివారం నుంచి రద్దీ నెలకొంది. బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ ఖాళీలు లేకపోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు. జనరల్‌ భోగీలు లేని విషయం తెలియని అనేక మంది రైల్వే స్టేషన్లకు వెళ్తున్నారు. రైళ్లు కిటకిటలాడుతుండటంతో ఉసూరు మంటూ వెనుదిరుగుతున్నారు. 


ప్రైవేటు కార్లకు డిమాండ్‌ 

రైళ్లలో రిజర్వేషన్‌ ఖాళీలు లేక, ఆర్టీసీలో ప్రయాణించేందుకు టికెట్లు దొరక్క తిరిగి పట్టణాలు, నగరాలకు వెళ్లేందుకు ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం వెళ్లేందుకు కొందరు ప్రైవేటు కారు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని వారు బాడుగులను భారీగా పెంచి అందిన కాడికి దండుకుంటున్నారు.  ఫలితంగా ఒక కుటుంబం హైదరాబాద్‌ వెళ్లేందుకు రూ.15 వేల నుంచి రూ. 20 వేల వరకూ వెచ్చించాల్సి వస్తోంది. 




Updated Date - 2021-01-17T05:15:25+05:30 IST