ట్రావెల్స్‌.. ట్రబుల్స్‌.. పతనస్థితిలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ రంగం

ABN , First Publish Date - 2020-08-08T18:30:23+05:30 IST

ఉభయ రాష్ర్టాల మధ్య ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో అత్యంత కీలక భూమిక వహించే ప్రైవేటు ట్రావెల్స్‌రంగం పతన స్థితికి చేరింది. దేశంలోని వివిధ రాష్ర్టాలకు సైతం లగ్జరీ బస్సులు నడిపే

ట్రావెల్స్‌.. ట్రబుల్స్‌.. పతనస్థితిలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ రంగం

తూర్పు గోదావరి జిల్లాలో 200కు పైగా బస్సులు నిలిపివేత

శిథిలస్థితికి చేరుతున్న కోట్ల విలువైన బస్సులు

ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డ వేలమంది కార్మికులు

ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు

బస్సెక్కాలంటే భయపడుతున్న ప్రయాణికులు


(అమలాపురం-ఆంధ్రజ్యోతి): ఉభయ రాష్ర్టాల మధ్య ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో అత్యంత కీలక భూమిక వహించే ప్రైవేటు ట్రావెల్స్‌రంగం పతన స్థితికి చేరింది. దేశంలోని వివిధ రాష్ర్టాలకు సైతం లగ్జరీ బస్సులు నడిపే ట్రావెల్స్‌రంగం కుదేలు కావడంతో వాటిలో పనిచేస్తున్న వందల మంది కార్మికులు గత ఐదు నెలలుగా పస్తులుండే పరిస్థితులు ఎదురయ్యాయి. ట్రావెల్స్‌ నడవకపోవడంతో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర హెల్పర్లకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవు. ఇప్పటికే కొన్ని ట్రావెల్స్‌ నిర్వహణ కార్యాలయాలు సైతం మూతబడ్డాయి. కోనసీమ సహా జిల్లా నలుమూలలా కోట్ల రూపాయల విలువైన బస్సులు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఐదు నెలల నుంచి ప్రైవేట్‌ ట్రావెల్స్‌రంగం అయోమయంగా మారింది. జిల్లా నలుమూలల నుంచి 200 బస్సులకు పైగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ర్టాలకు ప్రయాణికులను తీసుకుని వెళ్లేవి. మార్చి 22 నుంచి ట్రావెల్స్‌ బస్సులను ప్రభుత్వ ఆదేశాల మేరకు యాజమాన్యాలు ఎక్కడికక్కడే నిలిపివేశారు. దీంతో బస్సులు తుప్పు పట్టే దశకు చేరుకు న్నాయి. ఒక ట్రావెల్‌ బస్సులో డ్రైవర్‌, కండక్టరు, క్లీనర్‌తో కలిపి ఆరుగురి భవిష్యత్తు అగమ్యగోచరమైంది. వీరితోపాటు ట్రావెల్‌ ఏజెంట్ల సంఖ్య వందల్లోనే ఉంటుంది. జిల్లాలో జయంతి, కావేరి, ధనుంజయ, ఆరెంజ్‌, సిరి, సీఎంఆర్‌, సీఆర్‌కే, మేఘన, ఎస్‌జీకే వంటి మొత్తం 33 ట్రావెల్స్‌ కంపెనీలకు చెందిన బస్సులు ప్రస్తుతం మూలనపడ్డాయి. 


కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న తరుణంలో ట్రావెల్స్‌లో ప్రయాణిస్తే ఏ ముప్పు ముంచుకొస్తుందో నన్న భయంతో ప్రయాణికులెవరూ అటువైపు చూడడంలేదు. ప్రత్యామ్నాయంగా క్యాబ్‌లు, ఇతర వాహనాలతోపాటు ద్విచక్ర వాహనాలపైనే సుదూర ప్రయాణం చేసే పరిస్థితులు కొనసాగుతు న్నాయి. ఈ తరుణంలో గత ఐదు నెలలుగా వీరి ఉపాధి మొత్తం దెబ్బతింది. ఒక్క కోనసీమ నుంచే 50 నుంచి 60 బస్సులు నిత్యం రహదారులపై సదండి చేసేవి. రాత్రి 7 గంటలు దాటితే ఆయా ప్రాంతాల రహదారులతోపాటు జాతీయ రహదారి వెంబడి వందల సంఖ్యలో ప్రైవేటు బస్సులు రవాణా చేయడం ద్వారా రహదారికి ఇరువైపులా ఉండే పలు వ్యాపార సంస్థలు, హోటళ్లు వంటివి వాటిపై ఆధారపడినడిచేవి. ఇప్పుడు కార్మికులంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా కేంద్ర మైన కాకినాడలో ప్రైవేటు ట్రావెల్‌ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లతోపాటు ఏజెంట్లు ఆందోళన చేసి అధికారులకు వినతి పత్రం అందజేశారు.


 ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ట్రావెల్స్‌ సిబ్బందికి ఆటోడ్రైవర్ల తరహాలో రూ.10 వేల సాయాన్ని ప్రకటించాలని డిమాండు చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆధారపడి జీవించే వందల కుటుంబాలవారు ప్రత్యామ్నాయ ఉపాధి లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అమలా పురం పట్టణానికి చెందిన ట్రావెల్‌ ఏజెంట్‌ గోకరకొండ బాల ఆవేదన వ్యక్తం చేశారు. ట్రావెల్స్‌ కార్యాలయాల అద్దెలు చెల్లిం చకపోవడంతో ఇప్పటికే కొన్ని ఖాళీ అయ్యాయి. డ్రైవర్లు, క్లీనర్ల తోపాటు సిబ్బంది ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల్లో భాగంగా ఆటోలు నడపడం, కూరగాయల వ్యాపారం, ఉపాధిహామీ, తాపీపని వంటి పనుల వైపు మళ్లుతున్నారు. మొత్తంమీద కరోనా ఎంతో లగ్జరీగా ఉండే బస్సులు ఎక్కడికక్కడే నిరుప యోగంగా పడి ఉండడంతోపాటు వాటిపై ఆధారపడి జీవించే వందల కుటుంబాల జీవనస్థితిని విచ్ఛిన్నం చేసింది. 

Updated Date - 2020-08-08T18:30:23+05:30 IST