శబరిమల భక్తులకు ఆటంకాలు : దేవస్థానం బోర్డు

ABN , First Publish Date - 2021-08-25T20:16:32+05:30 IST

శబరిమల స్వామి అయ్యప్ప దేవాలయంలో కోవిడ్-19 ఆంక్షలను

శబరిమల భక్తులకు ఆటంకాలు : దేవస్థానం బోర్డు

కొచ్చి : శబరిమల స్వామి అయ్యప్ప దేవాలయంలో కోవిడ్-19 ఆంక్షలను సడలించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరాలని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది. రాష్ట్ర పోలీసులు నిర్వహిస్తున్న వర్చువల్ క్యూ సిస్టమ్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే భక్తులను అడ్డుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయని బోర్డు చెప్తోంది. 



ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ ఎన్ వాసు మాట్లాడుతూ, తాము వర్చువల్ క్యూ సిస్టమ్‌కు వ్యతిరేకం కాదన్నారు. స్లాట్లను బుక్ చేసుకోలేకపోతున్నామని భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. రోజుకు 15 వేల మంది భక్తులను ప్రభుత్వం అనుమతించినప్పటికీ, ఎనిమిది రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో కేవలం 14 వేల మంది భక్తులు మాత్రమే పాల్గొన్నారని పేర్కొన్నారు. రోజుకు కేవలం 20 శాతం స్లాట్లు మాత్రమే బుక్ అవుతున్నాయన్నారు. బుక్ చేసుకున్నవారిలో 50 శాతం మంది మాత్రమే దేవాలయానికి వస్తున్నారని తెలిపారు. ఈ ఆంక్షల వల్ల భక్తులు నిరుత్సాహానికి గురవుతున్నారని తాము భావిస్తున్నామన్నారు. 


ఇదిలావుండగా, బోర్డు ఆర్థిక బలం క్షీణించడంతో ఇతర వనరులపై దృష్టి పెట్టవలసి వస్తోందన్నారు. జీతాలు, పింఛన్లు, పరిపాలనాపరమైన ఖర్చులకు నెలకు రూ.40 కోట్లు అవసరమన్నారు. ఈ బోర్డు ఆధీనంలో ఉన్న 1,240 దేవాలయాల నుంచి నెలకు వచ్చే ఆదాయం రూ.10 కోట్లకు తగ్గిపోయిందన్నారు. 2017-18లో రెవిన్యూ రూ.390 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.100 కోట్లకు తగ్గిపోయిందన్నారు.


ఈ నేపథ్యంలో కోవిడ్-19 ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వాన్ని కోరాలని బోర్డు నిర్ణయించిందన్నారు. 


Updated Date - 2021-08-25T20:16:32+05:30 IST