దేశద్రోహం సరే, ‘ఉపా’ సంగతేమిటి?

ABN , First Publish Date - 2022-06-16T06:11:36+05:30 IST

భారత ప్రభుత్వం 2009లో తెచ్చిన ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (అన్‌ లాఫుల్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌ – ‘ఉపా’) రద్దుకు ప్రజలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు....

దేశద్రోహం సరే, ‘ఉపా’ సంగతేమిటి?

భారత ప్రభుత్వం 2009లో తెచ్చిన ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (అన్‌ లాఫుల్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌ – ‘ఉపా’) రద్దుకు ప్రజలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో అమలుపరిచిన టాడా చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని ప్రజలు ఆందోళనలు చేస్తే రద్దు చేశారు. తర్వాత తీసుకువచ్చిన పోటా చట్టాన్ని అదే ప్రాతిపదికన రద్దు చేశారు. ఈ రెండింటి సారాంశంతో పురుడు పోసుకున్న ఈ ‘ఉపా’ చట్టం మరింత క్రూరమైనది. రాజ్యాంగంలోని అధికరణం 14 ప్రసాదించిన సమానత్వపు హక్కును, అధికరణం 19(1) కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను, అధికరణం 21 గ్యారెంటీ చేసిన జీవించే హక్కునూ ఉపా చట్టం హరిస్తుంది. కావున దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రదర్శించిన ఔదార్యం ఉపా రద్దు విషయంలో కూడా ప్రదర్శించాలి. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రజల హక్కులను కాలరాయడానికి కాలుదువ్వుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని కట్టడి చేయడానికి సుప్రీంకోర్టుకు ఇదొక గొప్ప అవకాశం.


ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి నేరం చేశాడన్న అనుమానం కలిగితే చాలు పోలీసులు అతన్ని అరెస్టు చేయవచ్చు. ఈ అనుమానాలు పోలీసులకు ఈ దేశ మేధావులపైనే ఎక్కువ కలుగుతున్నట్టున్నాయి. రాజ్యాంగం పక్షాన, ప్రజా హక్కుల పక్షాన, దేశ సంక్షేమం పక్షాన నీతిగా, నిజాయితీగా, ధైర్యంగా మాట్లాడిన మేధావులు ఈ చట్టం వల్ల నిర్భందాలకు, అరెస్టులకు గురవుతూ జైలు పాలవుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ‘ఉపా’ కింద నాలుగేళ్ల క్రింద అరెస్టు చేసిన వరవరరావు, ఆనంద్‌ తేల్‌ తుంబ్డే, సోమాసేన్‌, సాయిబాబా, రోనా విల్సన్‌, ఫాదర్‌ స్టాన్‌ స్వామి తదితరులనేకమందిలో ఒకరిద్దరికి తప్ప మిగిలినవారికి బెయిలు రాక జైళ్లలోనే మగ్గిపోతున్నారు. బెయిలు నిరాకరించిన కారణంగానే స్టాన్‌ స్వామి ఆరోగ్యం క్షీణించి జైలులో చనిపోయాడు.


ఈ చట్టం కింద నమోదైన కేసులు హాస్యాస్పదంగా ఉన్నాయి. క్రికెట్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలుపు సంబరాలను సోషల్‌ మీడియాలో జరుపుకున్నందుకు ఇద్దరు కశ్మీరీ యువకుల మీద, పౌరసత్వ చట్టాన్ని నిరసించిన వాళ్ల మీద, త్రిపుర ముస్లింలపై జరిగిన హింసాకాండ గురించి వాస్తవాలు సేకరించిన న్యాయవాదుల బృందం మీద ఈ కేసులను నమోదు చేశారు. ప్రధాని మోదీని గానీ, వారి మాతృసంస్థ ఆరెస్సెస్‌ను గానీ విమర్శిస్తే చాలు ఉపా వచ్చి వాలిపోతుంది. అదే గాంధీజీని అవమానపరిస్తే, గాడ్సేని కీర్తిస్తే దేశభక్తి అయిపోతుంది. 2019లో ‘ఉపా’ కేసుల్లో 33శాతం పెరుగుదల నమోదయ్యింది. బీజేపీ పాలనలో దాదాపు 11000మందిపై ‘ఉపా’ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు దాదాపుగా 50మందిని అరెస్టు చేసి మరో 150 మందిపై ఉపా సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఎ) ఒకవైపూ, తెలంగాణ ప్రభుత్వం మరొకవైపూ అరెస్టుకు కాచుకొని సిద్ధంగా ఉన్నాయి. ఏడాదిపాటు జైలు జీవితం గడిపిన నలమాస కృష్ణ, మెంచు సందీప్‌, బండారు మద్దిలేటిలు 2020 ఆగస్టులో బెయిల్‌పై విడుదలయ్యారు. విడుదలైన తర్వాత ఈ రెండేళ్లలోను వీరు ఎక్కడా బెయిలు నిబంధనలను ఉల్లంఘించలేదు. కాని ఎన్‌ఐఏ అక్టోబర్‌ 2021లో వీరి బెయిలు రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. వ్యక్తి స్వేచ్ఛకు, ప్రాణాలకు రాజ్యాంగంలోని అధికరణ 21 గ్యారంటీ ఇస్తుంది. నిందితుడు బెయిలు పొందడం అనేది ఈ ఆర్టికల్‌ పరిధిలోకి వస్తుంది. ఈ హక్కును విచ్ఛిన్నం చేయడానికి చేపట్టే ప్రతి చర్య రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుంది. నిందితుడు బెయిలు నిబంధనలను ఉల్లంఘించినప్పుడు మాత్రమే రద్దు చేయాలని కోరే అవకాశం ఉంటుంది. ఏ నిబంధనల ఉల్లంఘన జరగకుండానే ఎన్‌ఐఏ ‘ఉపా’ సెక్షన్‌ 43డి(5) కింద బెయిలు రద్దు చేయాలని కోరింది. అయినప్పటికీ స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి ఇరువైపుల వాదనలు పరిశీలించి తిరిగి బెయిల్‌ మంజూరు చేశారు. ఈ తీర్పు ఎన్‌ఐఏ అధికారుల్లో మరింత కడుపు మంట పెంచింది. రెండోసారి పొందిన బెయిలునూ రద్దు చేయాలని మళ్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ కంటే ముందు ఈ ముగ్గురిపై మరి కొన్ని సెక్షన్ల కింద కేసులు కొత్తగా నమోదు చేశారు. పాత కేసుల్లో బెయిలు వచ్చిన మాట నిజమేకాని, ఈ కొత్త కేసుల్లో బెయిలు పొందలేదు కదా కనుక పాత బెయిలు రద్దు చేస్తే కొత్త కేసులో వారిని అరెస్టు చేసే అవకాశం కల్పించాలని హైకోర్టులో వాదించింది ఎన్‍ఐఏ. హైకోర్టు డివిజన్‌ బెంచి ఈ కొత్తగా నమోదైన కేసుల్లో కూడా బెయిలు పొందాలని ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టుకు కేసుని బదలాయించింది. స్పెషల్‌ కోర్టు చివరికి ఏప్రిల్‌ 22న బెయిలు మంజూరు చేసింది. దీనితో రగిలిపోతున్న ఎన్‌ఐఏ అధికారులు మూడోసారి కూడా ప్రత్యేక కోర్టు లోపాలను ఎత్తి చూపుతూ హైకోర్టును మళ్లీ ఆశ్రయించాలని ఆలోచిస్తున్నారు. ఈ లోగా హైకోర్టుకు సెలవులొచ్చాయి కనుక వ్యవహారం ఆగిపోయింది. ప్రజల పట్ల ప్రభుత్వ యంత్రాంగాలు కక్షపూరిత వైఖరికి ఈ కేసు తార్కాణం. 1977లో ఒక తీర్పులో జస్టిస్‌ విఆర్‌ కృష్ణ అయ్యర్‌ ‘బెయిలు అనేది రూలు, జెయిలు అనేది అసాధారణ పరిస్థితిలోనే’ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి మానవీయమైన స్పూర్తిని, రాజ్యాంగ విలువలను ధిక్కరించే సెక్షన్‌ 43డి(5) ‘ఉపా’లో ఉన్నది. 


భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం దేశద్రోహ చట్టంపై రద్దు వైఖరిని అవలంబించటం సంతోషించదగ్గ విషయం. అయితే ఇపుడు వెంటనే కావాల్సింది ఈ ఉపా చట్టం రద్దు. వ్యక్తి స్వేచ్ఛ, రాజ్యాంగ విలువలు, సామాజిక ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను కలిగి ఉన్న సర్వోన్నత న్యాయస్థానం ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుర్మార్గ చట్టాలకు తావులేదని నిరూపించాలి. ప్రచారంలో ఉన్న ఒక పిట్ట కథ ప్రకారం- ఒక అడవిలో బర్రె భయంతో పరుగెడుతుంది. దానికి ఎదురైన ఎలుక ‘ఎందుకు పరిగెడుతున్నావు?’ అని అడుగుతుంది. ‘ఏనుగును పట్టుకోవటానికి పోలీసులు వచ్చారు’ అంటుంది బర్రె. ‘కానీ నువ్వు ఏనుగువు కాదు కదా?’ అంటుంది ఎలుక. ‘ఒకసారి పట్టుకున్న తరువాత నేను ఏనుగును కాదని నిరూపించుకోవడానికి ఇరవై ఏళ్లు పడుతుంది... జరుగు!’ అంటూ బర్రె పరిగెత్తింది. వెనకనే ఎలుక కూడా పరిగెత్తింది. ఉపా చట్టం మర్మం తెలిసి ఉపసంహరించేంత వరకు ఐక్య ప్రజా పోరాటాలు కొనసాగాలి.

లక్ష్మణ్‌ గడ్డం

అధ్యక్షులు, పౌర హక్కుల సంఘం

Updated Date - 2022-06-16T06:11:36+05:30 IST