కొత్త జీతాల బిల్లులు చేయండి.. మేం చేయం!

ABN , First Publish Date - 2022-01-23T04:59:11+05:30 IST

కొత్త పీఆర్సీ జీవోల ప్రకారం జనవరి జీతాల బిల్లులు చేయాలంటూ ట్రెజరీ అధికారులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.

కొత్త జీతాల బిల్లులు చేయండి..  మేం చేయం!
జిల్లా ట్రెజరీ కార్యాలయం

ట్రెజరీ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిళ్లు

కొత్త పీఆర్సీవి చేసేది లేదంటున్న అధికారులు 


నెల్లూరు (హరనాథపురం), జనవరి 22 : కొత్త పీఆర్సీ జీవోల ప్రకారం జనవరి జీతాల బిల్లులు చేయాలంటూ ట్రెజరీ అధికారులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అయితే, తాము జేఏసీల తరఫున ఉద్యమ బాటలో ఉన్నందున చేసేది లేదని అధికారులు తేల్చి చెప్పేశారు. కొత్త జీవో ప్రకారం జీతాల బిల్లులు చేయాలంటే 2018 జూలై జీతం నుంచి వరుసగా మారుతున్న ఉద్యోగుల జీతాలను లెక్కకట్టాలి. ఉద్యోగి సర్వీసు రిజిస్టర్లను డీడీవోల నుంచి ట్రెజరీ ఉద్యోగులు  తెప్పించుకోవాలి. ఇక్కడ పరిశీలించి, అంతా బాగుంటే ఆ నాటి నుంచి వరుసగా మారుతున్న జీతాన్ని లెక్కించి ట్రెజరీ అధికారి ఓకే చేయాలి. అప్పడు సర్వర్‌లోకి ఉద్యోగి జీతం వివరాలు వెళతాయి. ఆ తరువాత  ఆ బిల్లులు సంబంధితశాఖ కార్యాలయానికి చేరుతాయి. ఆయా కార్యాలయాల  డీడీవోలు ఉద్యోగి జీతం బిల్లు జనరేట్‌ చేయాలి. ఆ బిల్లు మళ్లీ ట్రెజరీకి వస్తుంది. ట్రెజరీలో ఆమోదం తెలిపాక  ట్రెజరీ నుంచి ఫైనాన్స శాఖ ముఖ్య కార్యదర్శి వద్దకు వెళుతుంది. అక్కడ పరిశీలన తరువాత కొత్త జీతం ఉద్యోగి ఖాతాలో పడుతుంది. ఇందుకు పది రోజుల సమయం పడుతుంది. ఉద్యోగులకు జీతాలు సవ్యంగా రావాలంటే ఈ నెల 25వ తేదీలోగా ఈ పని పూర్తి కావాలి. అయితే, ఉన్న 2, 3 రోజుల వ్యవధిలో ఇదంతా సాధ్యం కాదని  తెలుస్తోంది. కాగా, జిల్లా ట్రెజరీ ద్వారా ప్రతినెలా 40 వేల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారు. 


పాత జీతాల బిల్లులైతేనే..


పాత జీతాల బిల్లులు అయితేనే పాస్‌ చేస్తామని ట్రెజరీ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు చేయబోమని ఖరాఖండిగా ఉన్నతాధికారులకు తేల్చి చెబుతున్నారు. ఇతర శాఖల ఉద్యోగులు కూడా పాత జీతాలే కావాలని, కొత్త పీఆర్సీ జీవో ప్రకారం జీతాలు వద్దని కోరడంతో ట్రైజరీ ఉద్యోగులకు కొంతమేర ఉపశమనం కలిగింది. 


ఒత్తిడి పెరిగింది 


కొత్త పీఆర్సీ జీవోల ప్రకారం జీతాల బిల్లులు చేయాలని ఉన్పతాధికారుల నుంచి  ఒత్తిడి బాగా పెరిగి పోయింది. బిల్లులు చేయబోమని చెప్పేశాం. పాత జీతాల బిల్లులైతే చేస్తామని చెప్పాం. ఉద్యోగులకు అన్యాయం జరిగే ఏ బిల్లులనూ చేయం. 

పి. కిరణ్‌కుమార్‌, ఏపీటీఎ్‌సఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

Updated Date - 2022-01-23T04:59:11+05:30 IST