త్రిశంకు స్వర్గంలో ‘జగనన్న ఇళ్లు’

ABN , First Publish Date - 2021-10-17T07:05:08+05:30 IST

వైఎస్‌ఆర్‌ జగనన్న ఇళ్ల కాలనీలు త్రిశంకుస్వర్గంలో పడ్డాయి. ప్రస్తుతం జిల్లాలో వీటి నిర్మాణం ఆగిపోయింది.

త్రిశంకు స్వర్గంలో ‘జగనన్న ఇళ్లు’
రాజానగరం మండలం వెలుగుబంద వైఎస్‌ఆర్‌ జగనన్నకాలనీలో ఇళ్ల నిర్మాణ పరిస్థితి

 కోర్టు తీర్పుతో ఆగిన వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం

కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చిన హౌసింగ్‌ అధికారులు

 జిల్లాలో మొదటి దశలో 28,046 ఇళ్లు మంజూరు

అందులోనూ పనులు మొదలైనవి  వందలలోనే..

 డబ్బు చాలక.. నిర్మాణాలకు ముందుకు రాని లబ్ధిదారులు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

వైఎస్‌ఆర్‌ జగనన్న ఇళ్ల కాలనీలు త్రిశంకుస్వర్గంలో పడ్డాయి. ప్రస్తుతం జిల్లాలో వీటి నిర్మాణం ఆగిపోయింది. ఆయా కాలనీల్లో పదులసంఖ్యలో మొదలైన ఇళ్ల నిర్మాణాన్ని ఆపేయాలని హౌసింగ్‌ అధికారులు ఆయా కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తుండడం గమనార్హం. సెంటు భూమిలో ఇళ్లను ఎలా నిర్మిస్తారని, దానివల్ల కాలుష్య సమస్య ఏర్పడుతుందని, అందువల్ల వీటిని ఆపేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. 100మందికి పైగా లబ్ధిదారులు ఒక సెంటు భూమిలో ఇంటిని ఎలా నిర్మించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు వీటిని నిలిపివేస్తూ నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హౌసింగ్‌ అధికారులు ఆయా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.  కోర్టు తీర్పు వచ్చే వరకూ తమను పనులు ఆపాలని హౌసింగ్‌ అధికారులు నోటీసు ఇచ్చినట్టు వెలుగుబందలో ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్‌ ఒకరు తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణానికి మొదటి నుంచి ఆటంకాలు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం వేలాదిమందికి ఇళ్లను ఇస్తామని చెప్పినా దానికి అనుగుణంగా సరైన భూమిని సేకరించలేకపోయింది. రాజమహేంద్రవరం ప్రజలకు ఏకంగా 45వేలమందికి ఇళ్లు నిర్మించడానికి బూరుగుపూడి ఆవ భూమిని సేకరించడం వివాదాస్పదమైంది. అది కోర్టు వివాదంగా మారింది. అనేకచోట్ల కొండలను తవ్వి ఊరికి దూరంగా ఇవ్వడం, పల్లపు ప్రాంతాలను ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. ఎకరం రూ.45లక్షల వరకూ కొనుగోలు చేసి కూడా సరైన, అనువైన స్థలాలను ఇవ్వకపోవడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కోర్టు వంకలను చూపుతూ మొదటి దశలో కేవలం 32,750 ఇళ్లకు మాత్రమే అరకొరగా లేఅవుట్లు వేసి వాటిలో కొన్ని మంజూరు చేసింది.

ఫ మొదటిదశలో 28,046 మంజూరు

జిల్లాలో జగనన్న కాలనీల నిర్మాణాన్ని కొన్ని దశలుగా విభజించారు. అందులో మొదటి దశ లో 32,750ఇళ్లకు సంబంధించి 18 లేఅవుట్లు వేశారు. కానీ అందులో 28,046ఇళ్లకే మంజూరు ఇచ్చారు. జూన్‌ 3న నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాప చేయాలని ఆదేశించారు. హౌసింగ్‌ అధికారులపై ఐఏఎస్‌ అధికారిని పెట్టారు. ఒక్కో లేఅవుట్‌కు ఒక ప్రత్యే కాధికారిని నియమించారు. సచివాలయ ఉద్యోగులను ఉపయోగించి లబ్ధిదారుల మీద ఒత్తిడి తెచ్చి శంకుస్థాపనలు చేసుకునేలా ఒప్పించే ప్రయత్నం చేశారు. చాలా మంది సరేనన్నా కొందరే భూమి పూజ చేశారు. జిల్లాలో వందలసంఖ్యలో మాత్రమే ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేశారు.

 పేదల కష్టాలు

ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకు వచ్చిన పేదలకు అనేక కష్టాలు మొదలయ్యాయి.  ప్రభుత్వం ఊరికి దూరంలో లేఅవుట్లు వేసింది. లబ్ధిదారుడికి ప్రభుత్వం వాటాకింద రూ.లక్షా80వేలు ఇవ్వడానికి అంగీకరించింది. కానీ ఇది కేవలం బేస్‌మెంట్‌కు కూడా సరిపోని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అనేక రకాలు బెదిరింపులు చేసిన ప్రచారం జరుగుతోంది. పునాదులు వేసుకుం టే ఇళ్ల పట్టా ఉంటుందని, లేకపోతే రద్దవుతుందని బెదిరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు ముందుగా వచ్చినా హౌసింగ్‌ అధికారులవద్ద నిధులు లేకపోవడంతో బిల్లులు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు అక్కడక్కడా ఒప్పందాలు పెట్టుకుని ఐరన్‌, సిమెంట్‌ సరఫరా చేసి లక్షా80వేలలో దీన్ని మినహాయించుకులా చేసింది. దీంతో హౌసింగ్‌ అధికారులు కొం దరు కాంట్రాక్టర్లకు వీటిని అప్పగించారు. బయటనుంచి కొందరు కాంట్రాక్టర్లు తాపీమేస్ర్తీల పేరు తో వచ్చి రూ.5లక్షలనుంచి రూ.6లక్షల వరకూ ఇస్తే ఇల్లు పూర్తిగా నిర్మిస్తామని ఒప్పందం పెట్టుకున్నారు. ఇందులో కొందరు ముందుకు వచ్చి కాంట్రాక్టు ఇచ్చారు. అప్పులు తెచ్చి కొంత డబ్బు ఇచ్చినా హౌసింగ్‌ అధికారులనుంచి రావాల్సిన సొమ్ములు రాకపోవడంతో గిజలాడిపోతున్నారు. ఇక ఎవరూ ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. రాజమహేంద్రవరం అర్బన్‌ పేదలకోసం రాజానగరం మండలం వెలుగుబందలో 11719 ఇళ్లకు లేఅవుట్‌ వేసి 8193మందికి ఇళ్లను మంజూరు చేశారు. కానీ అందులో 30మంది మాత్రమే ఇళ్ల నిర్మాణం చేపట్టడం గమనార్హం. ప్రస్తుతం జిల్లాలో ఆలమూరు ఎర్రాకాలనీ, కాకినాడ రూరల్‌లోని నేమాం-3, సామర్లకోట, రాజమహేంద్రవరం ప్రాంతంలోని వెలుగుబంద, అమలాపురం పరిధిలోని చిందాడగరువు-1, తాళ్లరేవు పరిధిలోని చొల్లంగి, రాజోలు పరిధిలోని పొదలాడ, మామిడికుదురు పరిధిలోని మొగలికుదుర్రు, పిఠాపురం పరిధిలోని కుమరపురం, కడియం పరిధిలోని వేమగిరి-2, సీతానగరం మండలంలోని మునికూడలి, జగ్గంపేట పరిధిలోని కాట్రావులపల్లి, శంకవరం మండలంలోని కత్తిపూడి, తుని పరిధిలోని చేపూరు, ఆర్‌సీపురం పరిధిలోని ద్రాక్షారామ, బిక్కవోలు మండలంలోని కొంకుదురు, మండపేట మండలంలోని వేములపల్లి, యు.కొత్తపల్లి పరిధిలోని కొమరగిరి లేఅవుట్లలో ఇళ్లనిర్మాణానికి శంకుస్థాపనలు మొదలు పెట్టినట్టు అధికారులు చెబుతున్నారు. సామర్లకోట వంటి ప్రాంతాల్లో తప్ప మిగతాచోట్ల పదుల సంఖ్యలోనే నిర్మాణం మొదలుపెట్టారు. 

ఫ ఆసరా డబ్బు మళ్లింపు

డ్వాక్రా మహిళలకు జగనన్న ఆసరా పేరిట వడ్డీ సొమ్ము ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చాలామంది అక్కౌంట్లలో ఈ సొమ్ము పడింది. కానీ డ్వాక్రా గ్రూపులో ఉండి ఇంటి లబ్ధిదారులుగా ఉంటే ఈ ఆసరా సొమ్మును బ్యాంక్‌ ఖాతాలో నుంచి నేరుగా లబ్ధిదారులు తీసుకోకుండా అధికారులు ఆంక్షలు విధించారు. ఈ సొమ్మును ఇంటి నిర్మాణానికి మాత్రమే ఉపయోగించుకోవాలని షరత్‌ విధించారు. లేదంటే ఇంటి పట్టా, లోన్‌ రద్దవుతాయని కొన్నిచోట్ల బెదిరించినట్టు చెబుతున్నారు. పైగా డ్వాక్రా ఉన్నవారికి రూ.50వేల వరకూ రుణం ఇస్తానని చెప్పి ప్రతిఏటా ఇచ్చే రుణంలోనే ఇస్తున్నారనే ఆవేదన కూడా ఈ మహిళలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణానికి పెద్దగా స్పందన కనిపించడంలేదు.

కోర్టు తీర్పు నేపఽథ్యంలో ఆగిన ఇళ్లు

అనేక సమస్యలతో ముందుకు కదలని ఇళ్ల నిర్మాణానికి కోర్టు తీర్పు తోడైంది. సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమని, పైగా అది కాలుష్యానికి కారణమవుతుందని కోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణం ఆపేయమని అధికారులు నోటీసులు ఇవ్వడం గమనార్హం.




Updated Date - 2021-10-17T07:05:08+05:30 IST