కోశాధికారి పదవికి కోత?

ABN , First Publish Date - 2022-06-28T14:56:42+05:30 IST

ఏకనాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి సాగనంపడం లేదా పూర్తిగా ఆయన అధికారాలకు

కోశాధికారి పదవికి కోత?

- పన్నీర్‌ సెల్వం తొలగింపుపై ఈపీఎస్‌ అధ్యక్షతన చర్చ

- పార్టీ కార్యాలయం వద్ద బ్యానర్‌పై చింపేసిన ఓపీఎస్‌ చిత్రం  

- ఎంజీఆర్‌ మాళిగై వద్ద ఉద్రిక్తత


చెన్నై, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఏకనాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి సాగనంపడం లేదా పూర్తిగా ఆయన అధికారాలకు కత్తెర వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆయన్ని కోశాధికారి పదవి నుంచి తొలగించేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన ఆ పార్టీ కార్యనిర్వాహకుల అత్యవసర సమావేశంలో దీనిపై చర్చించినట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌), ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుసేన్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 23న వానగరంలో జరిగిన సర్వసభ్యమండలి సమావేశంలో ఏకనాయకత్వంపై తీవ్ర వివాదం చోటుచేసుకోవడంతో పన్నీర్‌సెల్వం సభ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈపీఎస్ ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకునేందుకు వచ్చే నెల 11న మళ్ళీ జరుగనున్న సర్వసభ్యమండలి సమావేశంలో చేయాల్సిన తీర్మానాలపై మూడు రోజులుగా గ్రీన్‌వేస్ రోడ్డులోని ఎడప్పాడి నివాసగృహంలో మాజీ మంత్రులు, మద్దతుదారులతో రహస్య మంతనాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పన్నీర్‌సెల్వం తన సొంత జిల్లా తేనిలో పర్యటిస్తుండగా, అన్నాడీఎంకే నిర్వాహకుల అత్యవసర సమావేశం జరుగుతుందని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం ఆదివారం రాత్రి ప్రకటించింది. ఆ మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయంలో కార్యనిర్వాహకుల సమావేశం జరిగింది. ఈ సమావేశం విషయం తెలుసుకున్న ఎడప్పాడి వర్గానికి చెందిన వందలాదిమంది కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద గుమిగూడటంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎడప్పాడి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో 70 మంది పార్టీ నిర్వాహకులు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. వేదికపై ఎడప్పాడితోపాటు పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుసేన్‌, కేపీ మునుసామి కూర్చున్నారు. ఈ సమావేశంలో పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చజరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం పార్టీ కోశాధికారిగా ఉన్న పన్నీర్‌సెల్వంను ఆ పదవి నుంచి తొలగించాలని పార్టీ నిర్వాహకులంతా పట్టుబట్టారు. ఆ విషయమై వచ్చే నెల 11న జరుగనున్న సర్వసభ్యమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుందామని నేతలంతా నిర్ణయించినట్లు సమాచారం. ఓపీఎస్ ను తొలగించి పార్టీ సీనియర్‌ నేతలు కేపీ మునుసామి, దిండుగల్‌ శ్రీనివాసన్‌లో ఒకరిని కోశాధికారిగా నియమించాలని పార్టీ నిర్వాహకులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎడప్పాడిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించే విషయంపై సమగ్రంగా చర్చించారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం 11.45 గంటలకు ముగిసింది.


ఓపీఎస్‏కు వ్యతిరేకంగా నినాదాలు...

పార్టీ నిర్వాహకుల సమావేశం సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం రహదారి పూర్తిగా కార్యకర్తలతో నిండిపోయింది. సమావేశానికి హాజరైన ఎడప్పాడి, ఆయన మద్దతుదారులైన మాజీ మంత్రులకు మద్దతుగా కార్యకర్తలు నినాదాలు చేశారు.  అదే సమయంలో పార్టీ కార్యకర్త ఒకరు కార్యాలయానికి ఆనుకుని ఏర్పాటు చేసిన బ్యానర్‌లోని పన్నీర్‌సెల్వం ఫొటో చింపి నేలపై విసిరికొట్టాడు. ఇదిలా వుండగా తన ఆమోదం లేకుండా పార్టీ నిర్వాహకుల సమావేశం ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకమంటూ ప్రకటించిన ఓపీఎస్‌.. తేని జిల్లా పర్యటన ముగించుకుని హడావుడిగా చెన్నై చేరారు. మంగళవారం ఆయన పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అందుబాటులో వున్న నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 


ద్రోహానికి మారుపేరు ఓపీఎస్‌: జయకుమార్‌

ఈ సమావేశం అనంతరం అన్నాడీఎంకే సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి డి.జయకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నిర్వాహక కమిటీలో మొత్తం 74 మందికిగాను 65 మంది సమావేశానికి హాజరయ్యారని చెప్పారు. నలుగురు సభ్యులు అనారోగ్యం వల్ల రాలేకపోతున్నట్లు లేఖలు పంపారని, ఐదుగురు గైర్హాజరయ్యారని తెలిపారు. పార్టీ నియమావళి ప్రకారం సమన్వయకర్తలు లేకుండా పార్టీ నిర్వాహకుల కమిటీ సమావేశం జరిపేందుకు వీలుందని, ఈ విషయం పన్నీర్‌సెల్వంకు తెలియకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. పన్నీర్‌సెల్వం పార్టీకి ఎన్నో ద్రోహాలు తలపెట్టారని, ద్రోహానికి మారుపేరు పన్నీర్‌సెల్వం అని ఆయన విమర్శించారు. పార్టీ కోశాధికారి పదవి నుండి పన్నీర్‌సెల్వంను తొలగిస్తారా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ త్వరలో జరిగే సర్వసభ్యమండలి సమావేశంలో తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.



Updated Date - 2022-06-28T14:56:42+05:30 IST