శ్రీపద్మావతి కొవిడ్‌ కేంద్రం ముందు ‘ట్రయేజ్‌’

ABN , First Publish Date - 2022-01-21T07:03:03+05:30 IST

కొవిడ్‌ మూడో దశ ఉధృతంగా వ్యాపిస్తున్న క్రమంలో ట్రయేజ్‌, కొవిడ్‌ కేర్‌ సెంటర్లు సిద్ధమవుతున్నాయి.

శ్రీపద్మావతి కొవిడ్‌ కేంద్రం ముందు ‘ట్రయేజ్‌’
సిద్ధమవుతున్న ట్రయేజ్‌ కేంద్రం

స్విమ్స్‌ శ్రీపద్మావతి కొవిడ్‌ కేంద్రం ముందు పెరిగిన బాధితుల తాకిడి


తిరుపతి సిటీ, జనవరి 20: కొవిడ్‌ మూడో దశ ఉధృతంగా వ్యాపిస్తున్న క్రమంలో ట్రయేజ్‌, కొవిడ్‌ కేర్‌ సెంటర్లు సిద్ధమవుతున్నాయి. స్విమ్స్‌ శ్రీపద్మావతి కొవిడ్‌ కేంద్రంలో వారం కిందట వరకు 20-30లోపే ఉన్న కొవిడ్‌ బాధితుల సంఖ్య గురువారానికి 62కు చేరడం, రాబోవు రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ బాధితుల కోసం గురువారం కొవిడ్‌ కేంద్రం ముందు ట్రయేజ్‌ సెంటర్‌ను సిద్ధం చేశారు. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు ముందస్తుగా వైద్యులను, సిబ్బందిని, అవసరమైన వైద్య పరికరాలను సిద్ధం చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రణాళికలను రూపొందించినట్లు స్విమ్స్‌ అధికారులు తెలిపారు.


33 మంది కొవిడ్‌ బాధితుల డిశ్చార్జి 

స్విమ్స్‌, రుయాస్పత్రుల నుంచి గురువారం కొవిడ్‌ నుంచి కోలుకున్న 33 మంది బాధితులను వైద్యులు డిశ్చార్జి చేశారు. వీరిలో స్విమ్స్‌ శ్రీపద్మావతి కొవిడ్‌ కేంద్రంలో 11 మంది డిశ్చార్జి కాగా మరో 66 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే బ్లాక్‌ ఫంగ్‌సతో ఒకరు చికిత్స పొందుతున్నారని స్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ తెలిపారు. అలాగే రుయాలో 22 మంది డిశ్చార్జి కాగా.. మరో 112 మంది చికిత్స పొందుతున్నారని రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి తెలిపారు.

Updated Date - 2022-01-21T07:03:03+05:30 IST