మన యూరియా వచ్చేస్తోంది!

ABN , First Publish Date - 2021-03-01T09:45:41+05:30 IST

రాష్ట్రంలో యూరియా కొరత తీరబోతోంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి పరంగా కీలక ఘట్టం విజయవంతమైంది.

మన యూరియా వచ్చేస్తోంది!

  • ఆర్‌ఎ్‌ఫసీఎల్‌లో ట్రయల్‌ రన్‌ సక్సెస్‌..
  • మార్చిలో ఉత్పత్తి ప్రారంభం..
  • వినియోగంలోకి ప్రిల్లింగ్‌ ప్లాంట్‌, బ్యాగింగ్‌ యూనిట్లు
  • ప్రధాని చేతుల మీదుగా త్వరలో ప్రారంభం
  • రోజుకు 3850 టన్నుల యూరియా,
  • 2200 టన్నుల అమ్మోనియా ఉత్పత్తి
  • తెలంగాణకు తీరనున్న యూరియా కష్టాలు

గోదావరిఖని, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో యూరియా కొరత తీరబోతోంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి పరంగా కీలక ఘట్టం విజయవంతమైంది. ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటలకు ప్లాంట్‌లో నిర్వహించిన ట్రయల్‌ రన్‌ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది. ప్రిల్లింగ్‌ టవర్‌ నుంచి యూరియా ప్రిల్లింగ్‌ యూనిట్‌లోకి చేరి.. కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా బ్యాగింగ్‌ యూనిట్‌కు సరఫరా జరిగింది.   ప్రాజెక్టు సీఈవో నిర్లిప్‌ సింగ్‌ రాయ్‌ పర్యవేక్షణలో.. ఉత్పత్తిలో కీలకమైన ప్రిల్లింగ్‌ యూనిట్‌ను టెక్నికల్‌ గ్రేడ్‌ యూరియాను వినియోగించి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎ్‌ఫసీఎల్‌) నుంచి ఈ నెలలోనే ప్రధాని మోదీ చేతుల మీదుగా ఉత్పత్తి ప్రారంభం కానుంది. కాగా, ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వరంగ ఎరువుల సంస్థలైన నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌, ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌, ఎఫ్‌సీఐలతో ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టుకు సంబంధించి యూరియా టెక్నాలజీని ఇటలీకి చెందిన సైపం, అమ్మోనియా టెక్నాలజీని డెన్మార్క్‌కు చెందిన హల్దర్‌ టాప్స్‌ సమకూర్చాయి. మొదట రూ.5254 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. 2015 సెప్టెంబరు 25ను జీరో డేట్‌గా నిర్ణయించారు. 2018 సెప్టెంబరులో వాణిజ్య ఉత్పత్తి జరుపాలని నిర్ణయించారు. అయితే ఆర్‌ఎ్‌ఫసీఎల్‌కు భాగస్వామ్యులు దొరకకపోవడంతో ఫైనాన్స్‌ క్లోజర్స్‌కు జాప్యం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం 11 శాతం, టెక్నాలజీ సరఫరా చేసే డెన్మార్క్‌కు చెందిన హల్దర్‌ టాప్స్‌ 11.7శాతం, గ్యాస్‌ సరఫరా చేసే గెయిల్‌ 14.3శాతం వాటా తీసుకున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో నిర్మాణ జాప్యం ఏర్పడింది.  నిర్ణీత సమయానికి గ్యాస్‌ సరఫరా కాకపోవడంతో అదనపు భారం పడింది. మొత్తంగా  వ్యయం రూ.6700 కోట్లకు పెరిగింది.


రూ.160కోట్లకు పైగా రాష్ట్ర పెట్టుబడులు

తెలంగాణ ప్రభుత్వం ఆర్‌ఎ్‌ఫసీఎల్‌లో 11శాతం వాటా పొందింది. రూ.160 ఈక్విటీగా చెల్లించి షేర్లు పొందింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 0.55టీఎంసీలను కేటాయించి రోజుకు 40ఎంఎల్‌డీల నీటిని సరఫరా చేస్తున్నారు. దీనికి 27 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ నిర్మించారు. విద్యుత్తు  లైన్ల నిర్మాణం చేసింది. 


ఉపాధి అంతంతే...

ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ పునరుద్ధరణలో ఒక్క ఉద్యోగం కూడా స్థానికులకు ఇవ్వలేదు. కాంట్రాక్టు వర్కర్‌ పనులు మాత్రమే ఇస్తున్నారు. అందుకు రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకు రేటు పెట్టి అమ్మకాలు చేస్తున్నారు. అధికారులు మొదలు అటెండర్‌ స్థాయి వరకు జాతీయ స్థాయిలో రిక్రూట్‌మెంట్‌ చేస్తోంది.

 

కొద్ది రోజుల్లోనే వాణిజ్య ఉత్పత్తి

ట్రయల్‌ రన్‌ ఆటంకాలు లేకుండా పూర్తి చేశాం. కొద్ది రోజుల్లోనే వాణిజ్య ఉత్పత్తి చేస్తాం. ప్రారంభోత్సవానికి ప్రధాని రాక  ఎరువుల మంత్రిత్వశాఖ, ప్రధాన మంత్రి కార్యాలయాలు ఖరారు చేస్తాయి. 

- ప్రాజెక్టు సీఈఓ నిర్లిప్‌ సంఘ్‌ రాయ్‌


ఏటా 12.7 లక్షల టన్నుల ఉత్పత్తి

ఈ పరిశ్రమలో రోజుకు 3850 టన్నుల యూరియా, 2200 టన్నుల అమ్మోనియా ఉత్పత్తి జరుగనుంది. రామగుండంలో కిసాన్‌ బ్రాండ్‌పై ఏటా రూ.12.7లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేయనున్నారు. ఇందులో సగానికి పైగా రాష్ట్రానికి కేటాయించారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడంతో సీజన్‌కు 21లక్షల టన్నుల ఎరువుల అవసరాలు ఉన్నాయి. ఆర్‌ఎ్‌ఫసీఎల్‌ నుంచి వచ్చే యూరియాను 90 శాతం రాష్ట్ర అవసరాలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. తద్వారా రవాణా చార్జీల భారం తగ్గుతుందని పేర్కొంటున్నారు. 

Updated Date - 2021-03-01T09:45:41+05:30 IST