29న గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఎన్నికలు

ABN , First Publish Date - 2022-05-20T06:00:37+05:30 IST

ఈనెల 29న అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల ప్రధాన అధికారి పలాసి కృష్ణారావు తెలిపారు

29న గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఎన్నికలు
ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను తెలుపుతున్న ఎన్నికల నిర్వాహకులు

ఎన్నికల ప్రధానాధికారి పలాసి కృష్ణారావు వెల్లడి

తుది ఓటర్ల జాబితా ప్రకటన రేపు 

పాడేరు, అరకులోయ, చింతపల్లి, పెదబయలులో జోన్ల వారీగా పోలింగ్‌

పాడేరు, మే 19(ఆంధ్రజ్యోతి):

ఈనెల 29న అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని   ఎన్నికల ప్రధాన అధికారి పలాసి కృష్ణారావు తెలిపారు. స్థానిక గిరిజన ఉద్యోగుల భవన్‌లో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటికే ఓటర్ల జాబితాను పక్కాగా సిద్ధం చేశామని, అందులోనూ ఇంకా ఏమైనా సవరణలుంటే ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు కోడా సింహాద్రి, సోమెలి సింహాచలాన్ని సంప్రతించాలన్నారు. ఈనెల 21న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని, 22న నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల ఉపసంహరణ, 25న నామినేషన్ల తుది జాబితా ప్రకటన, 29న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. గతానికి భిన్నంగా ఈసారి పాడేరు, అరకులోయ, చింతపల్లి, పెదబయలులో జోన్ల వారీగా ఎన్నికలు జరుగుతాయన్నారు. పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల మండలాలతోపాటు మైదాన ప్రాంత ఉద్యోగులకు పాడేరులో, అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాలకు అరకులోయలో, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాలకు చింతపల్లిలో, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలకు పెదబయలులో పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు పూర్తి చేసి విజేతలను ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు కె.గంగన్నపడాల్‌, రేగం సూర్యనారాయణ, కురసా పార్వతమ్మ, ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు కె.సింహాద్రి, ఎస్‌.సింహాచలం పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T06:00:37+05:30 IST