గరిమెళ్లపాడు ‘గిరిజన గోస ’

ABN , First Publish Date - 2022-06-23T05:00:05+05:30 IST

గరిమెళ్లపాడు ‘గిరిజన గోస ’

గరిమెళ్లపాడు ‘గిరిజన గోస ’
ఉనికి కొల్పోతున్న గరిమెళ్లపాడు నర్సరీలోని కార్యాలయం

 ఉద్యాన నర్సరీకోసం గిరిజనుల భూమి తీసుకున్న ఐటీడీఏ 

 ప్రతిఫలంగా శాశ్వత ఉపాధి కల్పిస్తామని హామీ

 మూణ్నాళ్ల ముచ్చటగానే జీవనోపాధి

 రోడ్డునపడ్డ 150 గిరిజన కుటుంబాలు 

 ప్రస్తుతం పూటగడవడమే కష్టంగా మారిన ధైన్యం

 ఆదుకోవాలని పాలకుల చుట్టూ ప్రదక్షిణలు 

చుంచుపల్లి, జూన 22:ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉద్యాన నర్సరీకి కీలకంగా ఉంటూ పట్టు పరిశ్రమలు, పండ్ల తోటలకు, మొక్కల పెంపకానికి ప్రసిద్ధిగా విరాజిల్లి ఏడాదికి సుమారు రూ.60 లక్షల లాభాలు ఆర్జించిన ఘనచరిత్ర గరిమెళ్లపాడు నర్సరీది.. ఆ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల, కళాశాలస్థాయిలో సైన్స విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లిన కొత్తగూడెం ప్రాంతానికి ఒక ప్రత్యేకతను తీసుకువచ్చిన గరిమెళ్లపాడు ప్రాంతం ప్రస్తుతం తన ఉనికిని కోల్పోతోంది.


ఐటీడీఏ చేతిలో మోసపోయామంటున్న గిరిజనులు 

భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం ప్రశాంతనగర్‌ పంచాయతీ పరిధిలో వంద ఎకరాల్లో సుమారు 40ఇళ్లల్లో అనేక గిరిజన కుటుంబాలు జీవనం కొనసాగించేవి. అయితే ఆ ప్రాంతంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉద్యాన నర్సరీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 1983 ప్రాంతంలో అక్కడి గిరిజనులను ఒప్పించి వారి భూములను తీసుకున్నారు. ప్రతిఫలంగా వారికి జీవితాంతం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి కొంతకాలం పాటు ఉద్యోగాలు కల్పించారు. నర్సరీ ప్రారంభించిన తొలినాళ్లలో సంవత్సరానికి సుమారు రూ.60లక్షలతో ఆ నర్సరీ వ్యాపారం సాగింది. అయితే కాలక్రమంలో నర్సరీ వ్యాపారం తగ్గిపోవడం వంటి పరిణామాలతో 2004లో అందులో పనిచేసే గిరినులందరినీ వారికి తెలియకుండానే ఉపాధి కూలీలుగా మార్చారు. ఆ తరువాత అదికూడా లేకుండా చేసి తమను రోడ్డున పడేశారని గరిమెళ్లపాడు గిరిజనులు ఆరోపిస్తున్నారు. 50ఏళ్లకు పైగా అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న తమకు చెందిన సుమారు 100ఎకరాల ఐటీడీఏ తమ నుంచి తీసుకుందని, ఆ తరువాత తమను పట్టించుకోవడం మానేసిందని గిరిజనులు బోరున విలపిస్తున్నారు. తమ భూములిస్తే జీవితాన్నిస్తామని నమ్మబలికి ఐటీడీఏ అధికారులు తమ భూమిని స్వాధీనం చేసుకున్నారని, 2006నుంచి ఉపాధి నుంచి తొలగించి తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


గతమెంతో ఘనం..

గరిమెళ్లపాడులో 1985లో వంద ఎకరాల్లో 40ఇళ్లలో అనేక కుటుంబాలు జీవనాన్ని ప్రారంభించాయి. ప్రస్తుతం ఆ 40 ఇళ్లలోనే 150 కుటుంబాలు జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ఒకే ఇంట్లో సుమారు ఆరు కుటుంబాలు జీవిస్తున్నాయి. తమకు మొక్కలు పెంచడం, అంట్లు కట్టడం, నర్సరీలో మొక్కలకు నీరు పోయడం, ఉద్యానవన మొక్కల పెంపుదలలో భాగస్వాములు కావడం వంటి పనులు చేసేవారు. మామిడి, జీడిమామిడి, సపోట, బత్తాయి, జామకాయ, కొబ్బరి తోట, నిమ్మకాయలను అధిక దిగుబడినిచ్చే మొక్కలు పెంచేవారు.  


తినడానికి తిండి లేదు..  

గరిమెళ్లపాడు నర్సరీని నమ్ముకుని జీవిస్తున్న 150కుటుంబాలకు ప్రస్తుతం ఉపాధి లేకపోవడంతో తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు. కేవలం ఒక పూట మాత్రమే రేషన బియ్యాన్ని వండుకుని తింటూ తమ జీవితాలను కొనసాగిస్తున్నామని, ప్రభ్తువం చొరవ తీసుకుని తమకు ఉపాధితోపాటు  డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. తమ గోడును ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పుకోవాలని గత సంవత్సరం గరిమెళ్లపాడుకు చెదిన సుమారు 500మంది కాలినడకన పయనమయ్యారు. ఈ క్రమంలో  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును కలిసి వినతిపత్రం అందచేశారు. వారి వినతిని విన్న ఎమ్మెల్యే సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి గరిమెళ్లపాడు గిరిజనులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని హామీ ఇవ్వడంతో వారు తమ యాత్రను విరమించారు. కానీ ఇంతవరకు తమకు న్యాయం జరగలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 





Updated Date - 2022-06-23T05:00:05+05:30 IST