ఏళ్లుగా.. ఇంతే!

Published: Mon, 16 May 2022 23:16:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఏళ్లుగా.. ఇంతే!చందనగిరిలో సిగ్నల్‌ లేక కొండపై పింఛన్‌ల కోసం ఇబ్బందులు పడుతున్న గిరిజనులు

మెళియాపుట్టి మండలం చందనగిరిలో కొండెక్కితే కానీ వలంటీర్లు పింఛన్లు అందించలేరు. సిగ్నల్‌ లేక ఇలా ప్రతినెలా మొదటి వారంలో కొండెక్కి కుస్తీలు పడుతుంటారు. ఒక్క చందనగిరే కాదు.. మండలంలో 16 గిరిజన గ్రామాలదీ ఇదే పరిస్థితి.


కొండశిఖర గ్రామమైన గూడ వాసులకు అత్యవసర, అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఇలా డోలీయే గతి. ఈ ఏడాది మార్చి 6న గ్రామానికి చెందిన నిర్మల పురిటినొప్పులతో బాధపడుతుండడంతో కుటుంబసభ్యులు అతి కష్టమ్మీద డోలీలో కొండ దిగువకు చేర్చారు.


అనంతగిరి గ్రామంలో తాగునీటి పథకాలు పనిచేయకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యయప్రయాసలకు ఓర్చి సుదూరం నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.   


...ఇవి ఒక మెళియాపుట్టి మండల గిరిజనుల సమస్యలే కాదు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో 1,239 గిరిజన గ్రామాలున్నాయి. 39,122 కుటుంబాలకుగాను 1,66,186 మంది గిరిజన జనాభా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సీతంపేట ఐటీడీఏ నుంచి అభివృద్ధి పనులు, గిరిజనుల మౌలిక వసతులకు ఏటా రూ.350 కోట్లతో బడ్జెట్‌ కేటాయిస్తున్నారు. కానీ అవన్నీ ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయి. పనులు జరగక గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పడుతున్నాయి. ప్రధానంగా కొండశిఖర గ్రామాల ప్రజల బాధలు వర్ణనాతీతం. సబ్‌ప్లాన్‌ మండలాల్లో 50 వరకు కొండ శిఖర గ్రామాలున్నాయి. వీటికి సరైన రహదారి సదుపాయం లేదు. తాగునీరు అందదు. అత్యవసర, అనారోగ్య సమయాల్లో 108, 104 వాహనాలు కూడా వెళ్లలేవు. దీంతో గిరిజనులకు డోలీయే గతవుతోంది. ప్రస్తుతం ఇంటింటా రేషన్‌ పథకం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. కానీ కొండ శిఖర గ్రామాలకు వాహనాలు వెళ్లవు. దీంతో ఐదారు కిలోమీటర్లు కొండ దిగి గిరిజనులు రేషన్‌ తెచ్చుకోవాల్సి వస్తోంది.

సిగ్నల్స్‌ లేక అవస్థలు..
ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నింటికీ ఇప్పుడు బయోమెట్రిక్‌ తప్పనిసరి చేసింది. కానీ గిరిజన గ్రామాల్లో సెల్‌ సిగ్నల్‌ అసలు ఉండదు. దీంతో పింఛన్లు, ఇతరత్రా పథకాలు అందించేటప్పుడు వలంటీర్లు బయోమెట్రిక్‌ యంత్రాలతో కుస్తీలు పడాల్సి వస్తోంది. గ్రామాలకు దూరంగా.. సిగ్నల్‌ వచ్చే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లి బయోమెట్రిక్‌ తీసుకోవాల్సి వస్తోంది. ఐటీడీఏ పరిధిలో 339 గ్రామాలకు అసలు సెల్‌ సిగ్నల్‌ జాడేలేదని అధికారులు గుర్తించారు. కానీ అందుకు తగ్గట్టు ఉపశమన చర్యలు మాత్రం కానరావడం లేదు. 39 చోట్ల కొత్తగా టవర్లు ఏర్పాటు చేస్తామని రెండేళ్లుగా అధికారులు చెప్పుకొస్తున్నా.. కార్యరూపం దాల్చలేదు.

వైద్యం దైన్యం..
గిరిజన ప్రాంతాల్లో వైద్యం దైన్యంగా మారింది. మౌలిక వసతులు లేక.. ఇటు సకాలంలో వైద్యం అందక ఏటా మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. అనారోగ్య సమయాల్లో 108 వాహనాలు కూడా వెళ్లలేని స్థితిలో గిరిజన గ్రామాలున్నాయి. దీంతో సకాలంలో వైద్యం అందక చాలామంది మృత్యువాత పడుడుతున్నారు. ఈ ఏడాది 18 మాతృ, 58 శిశు మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇంకా అధికారుల లెక్కలోకి రానివి చాలా ఉన్నాయి. ఐసీడీఎస్‌ ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్టు అధికారులు చెబుతున్నా.. చాలా గ్రామాలకు అందని పరిస్థితి. గిరిజనులకు సంపూర్ణ పోషణ ప్లస్‌ పేరిట పౌష్టికాహారం అందిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో వారికి అందిస్తున్నారా? లేదా? అన్న విషయంలో పర్యవేక్షణ కొరవడుతోంది.

గుక్కెడు నీటికి కటకట..
ఏటా వేసవిలో గిరిజనులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. బిందెడు నీటి కోసం సుదూర ప్రాంతాల్లో ఊట బావులు, చెలమలపై ఆధారపడుతున్నారు. గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు ఉన్నా సరైన నిర్వహణ లేక మూలకు చేరుతున్నాయి. వేసవి ముందస్తు చర్యల్లో భాగంగా క్రాష్‌ ప్రోగ్రాం నిర్వహిస్తున్నా అధికారులు, సిబ్బంది గిరిజన గ్రామాల వైపు చూడడం లేదు. ఐటీడీఏ పరిధిలో 234 రక్షిత మంచినీటి పథకాలు, 115 గ్రావిటేషన్‌ స్కీములు, 888 బావులు, 230 సోలారు పంపు సెట్ల ద్వారా తాగునీరు అందిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇవన్నీ వర్షాకాలంలో మాత్రమే పనిచేస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సోలార్‌ పంపుసెట్లకు సంబంధించి ప్యానెల్స్‌ ఈదురుగాలులకు పాడయ్యాయి. వాటిని బాగుచేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

రహ‘దారుణాలు’
మన్యంలో రహదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారాయి. నిధులు ఖర్చు చేసినట్టు గణాంకాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా పనులు పూర్తిచేసిన దాఖలాలు లేవు. మెళియాపుట్టి మండలం చందనగిరి రోడ్డుకు రూ.95 లక్షలు మంజూరయ్యాయి. కానీ పనులు మాత్రం జరగలేదు. మెటీరియల్‌ వేసి చేతులు దులుపుకున్నారు. కానీ బిల్లులు మాత్రం చెల్లింపులు జరిగిపోయాయని గిరిజనులు, గిరిజన సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. కేరాసింగి, గూడ రహదారులకు సంబంధించి రూ.2 కోట్లు మంజూరైనా పనులు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిధులను సైతం ఖర్చు చేయలేని స్థితిలో ఉండడం బాధాకరం.

నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పర్యటన
ఎస్సీ, ఎస్టీ చైర్మన్‌ కుంభా రవిబాబు మంగళవారం జిల్లాలో పర్యటించనున్నట్టు ఐటీడీఏ పీవో బి.నవ్య తెలిపారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను వివరించారు. ‘శ్రీకాకుళం బీసీ గెస్ట్‌హౌస్‌ నుంచి ఎస్సీ, ఎస్టీ చైర్మన్‌ రవిబాబు ఉదయం 8 గంటలకు బయలుదేరుతారు. టెక్కలి మండలం సన్యాసిపేటకు 9.30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11 గంటలకు మెళియాపుట్టి మండలం కొండపై ఉన్న చందగిరి గ్రామంలో గిరిజనులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2.15 గంటలకు పాతపట్నం మండలం కోనంగి చేరుకుంటారు. తర్వాత 3 గంటలకు శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారులతో సమావేశమవుతారు. రాత్రి 8 గంటలకు విశాఖ పయనమవుతారు’ అని పీవో నవ్య తెలిపారు.  

మా బాధలు అన్నీఇన్నీ కావు
అనారోగ్య సమయాల్లో మా బాధలు అన్నీఇన్నీ కావు. సుమారు ఐదారు కిలోమీటర్ల మేర డోలీలో రోగిని కొండకు దించుతాం. మైదాన ప్రాంతానికి తరలించి.. అక్కడ నుంచి వాహనాల్లో ఆస్పత్రికి తీసుకెళతాం. రోగికి తక్షణ వైద్యానికే ఏడెనిమిది గంటలు పడుతుంది. అటువంటి సమయాల్లో చాలా మంది మృత్యువాత పడుతున్నారు.
పెద్దింటి దుర్గయ్య, కేరాశింగి  

రేషన్‌కు కొండ దిగాల్సిందే..
రేషన్‌ సరుకులు కావాలంటే మూడు కొండలు దిగాల్సిందే. రోడ్డు సదుపాయం లేకపోవడంతో వాహనం కొండ మీదకు రావడం లేదు. రేషన్‌ కావాలంటే మైదాన ప్రాంతాలకు రావాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
ఎస్‌.కర్రమ్మ, కేరాశింగి  

విన్నవిస్తున్నా..
మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారి సదుపాయం లేదు. గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికప్పుడు ఐటీడీఏలో వినతులు అందిస్తున్నా ఫలితం లేకపోతోంది. ప్రభుత్వం స్పందించి గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలి.
జె.గవిరేష్‌, సర్పంచ్‌, ఇలాయిపురం  

చేసిన పనులకే బిల్లులు
కొండ శిఖర గ్రామాలకు సంబంధించి రహదారి పనులపై దృష్టిపెట్టాం. ఇప్పటివరకూ చేసిన పనులకు మాత్రమే బిల్లులు చెల్లించాం. పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు ఉన్నతాధికారులకు నివేదించాం. గిరిజన గ్రామాలకు రహదారుల విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
సిమ్మన్న, ఐటీడీఏ డీఈ, పాతపట్నం

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.