గిరిజనం... ‘వన ధనం’

ABN , First Publish Date - 2020-12-04T04:31:48+05:30 IST

గిరిజనులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. వారు సేకరించే అటవీ ఉత్పత్తులు దళారుల పాలు కాకుండా గిట్టుబాటు ధరలు అందించేందుకు యత్నిస్తోంది. దీనికోసం ఐటీడీఏల పరిధిలో ‘వన్‌ధన్‌ వికాస కేంద్రాల’ను ఏర్పాటు చేస్తోంది.

గిరిజనం... ‘వన ధనం’
నేరేళ్లవలస సంత (ఫైల్‌ )

అటవీ ఉత్పత్తులకు కేంద్రం భరోసా

 గిట్టుబాటుఽ ధరలు కల్పించే యోచన

సంతల్లో ‘హాట్‌ బజార్లు’

సాలూరు రూరల్‌, డిసెంబర్‌ 3: గిరిజనులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. వారు సేకరించే అటవీ ఉత్పత్తులు దళారుల పాలు కాకుండా గిట్టుబాటు ధరలు అందించేందుకు యత్నిస్తోంది. దీనికోసం ఐటీడీఏల పరిధిలో ‘వన్‌ధన్‌ వికాస కేంద్రాల’ను ఏర్పాటు చేస్తోంది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో సాలూరు, పాచిపెంట, మక్కువ, పార్వతీపురం, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో 32 వన్‌ధన్‌ వికాస కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. 20 మంది గిరిజనులతో ఒక సంఘం.. 15 సంఘాలు కలిపి ఒక వన్‌ధన్‌ వికాస కేంద్రంగా ఏర్పాటు చేస్తారు. ఈ గ్రూప్‌ల ఏర్పాటు, కేంద్రాల ఏర్పాటు వెలుగు ఆధ్వర్యంలో జరుగనుంది. 

అంతా వీటి పరిధిలోనే...

గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా ఈ కేంద్రం క్రయవిక్రయాలను నిర్వహిస్తుంది. చింతపండు, జీడిపిక్కలు, కొండచీపుర్లు, తేనె, ఉసిరి తదితర ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందిం చేందుకు ఈ కేంద్రాలు దోహదపడతాయి. సాలూరు, పార్వతీపురం మండలాల్లో మూడు చొప్పున.. గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం, మక్కువ మండలాల్లో నాలుగేసి.. పాచిపెంట, కొమరాడ మండలాల్లో ఐదు చొప్పున మొత్తం 32 వీడీవీకే (వన్‌ధన్‌ వికాస కేంద్రాలు) ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కేంద్రం నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.22,50,000 వంతున అందించనుంది. ఈ నిధులతో అటవీ ఉత్పత్తుల క్రయవిక్రయాలు, నిర్వహణ చేపట్టనున్నారు. గిరిజనుల నుంచి సేకరించిన ఉత్పత్తులను తిరిగి విక్రయించడానికి సంతల్లో హాట్‌ బజార్లు ఏర్పాటు చేయనున్నారు. ఎనిమిది మండలాల్లో 21 హాట్‌బజార్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో హాట్‌బజారు దాదాపు రూ.5 లక్షలతో నిర్మించనున్నారు. వీటి ఏర్పాటుకు స్థల సేకరణ చేయాలని ఎనిమిది మండలాల తహసీల్దార్లకు పార్వతీపురం ఐటీడీఏ పీవో రోణంకి కూర్మనాథ్‌ గురువారం ఆదేశించారు. ఈ కేంద్రాలు ఏర్పాటైతే గిరిజనులకు గిట్టుబాటు ధర లభ్యమవుతుంది.


ఎక్కడెక్కడంటే...

============

గుమ్మలక్ష్మీపురం: గొరడ, తాడికొండ, గుమ్మలక్ష్మీపురం. 

జియ్యమ్మవలస: పెదతోలుమండ, టీకేజమ్ము, రావాడ

 కొమరాడ: కూనేరు, గుమడ 

కురుపాం: నీలకంఠపురం, మొండెంఖల్లు, కురుపాం

మక్కువ: నంద, మార్కొండపుట్టి, దుగ్గేరు 

పాచిపెంట: పూడి, వేటగానివలస, పాచిపెంట 

పార్వతీపురం: గోచెక్క, పార్వతీపురం 

సాలూరు: తోణాం, నేరెళ్లవలస సంత 

 

 వన్‌ధన్‌ వికాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు

వన్‌ధన్‌ వికాస కేంద్రాలు, హాట్‌బజార్లు ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఈ కేంద్రాల ద్వారా గిరిజనుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యం.

                                         - కె.సత్యంనాయుడు, వెలుగు ఏపీడీ, పార్వతీపురం, 


Updated Date - 2020-12-04T04:31:48+05:30 IST