Advertisement

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్‌

Jan 24 2021 @ 00:26AM

-  రాష్ట్ర ప్రభుత్వం చర్యలు  

-  జిల్లాలో 536 పెండింగ్‌ కేసులు   


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

రెవెన్యూ కోర్టుల్లోని పెండింగ్‌ కేసుల పరి ష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ స్థాయిలో కొనసాగే రెవెన్యూ కోర్టులను రద్దు చేస్తూ వాటి స్థానంలో జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో రెవెన్యూ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది.  నెల రోజుల్లోనే పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించాలని పేర్కొంది. కొన్ని జిల్లాలో ఇప్పటికే తహసీల్దార్లు, ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌ల వద్ద ఉన్న కేసులను ట్రిబ్యునల్‌కు బదలాయించి విచారణ ప్రారం భించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేక ట్రిబ్యు నల్‌ ఏర్పాటు చేసినా విచారణ మొదలు కావాల్సి ఉంది. తహసీల్దార్ల నుంచి ఫైళ్లను తెప్పించు కుంటున్నారు. ప్రత్యేక ట్రిబ్యునల్‌ ద్వారా పెండింగ్‌లో ఉన్న కేసులను ఈ నెల 31 వరకు పరిష్కరించాల్సి ఉంది. ప్రభుత్వ సెలవుదినాలు మినహాయించి ప్రతీ రోజు ట్రిబ్యునల్‌ నిర్వహించాలి. 


జిల్లాలో 536 పెండింగ్‌ కేసులు 

ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. దీంతోపాటు రెవెన్యూ కోర్టులను రద్దు చేసి గతంలో రెవెన్యూ పరిధిలో ఉన్న కేసులను ప్రత్యేక ట్రిబ్యునల్‌లోకి తీసుకొచ్చింది. అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 536 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జాయింట్‌ కలెక్టర్‌ పరిధిలో 76, ఆర్డీవో పరిధిలో 262, తహసీల్దార్ల పరిధిలో 198 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ట్రిబ్యునల్‌లోకి మార్చే ప్రక్రియ చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్‌ సభ్యుడిగా ట్రిబ్యునల్‌ కొనసాగుతుంది. భూ వివాదాలన్నీ త్వరలోనే ట్రిబ్యునల్‌ ద్వారా పరిష్కరించే అవకాశం ఉంది. జిల్లాలో ట్రిబ్యునల్‌ ద్వారా కేసులు పరిష్కారం మొదలు కాకపోవడంతో భూ వివాదం కేసులను ఎదుర్కొంటున్న వారు ఎదురు చూస్తున్నారు. 

Follow Us on:
Advertisement