చివరి మజిలీకి ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-05-27T07:09:24+05:30 IST

చివరి మజిలీకి ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. గౌరవప్రదంగా అంతిమ యాత్రలు నిర్వహించేందుకు ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న శ్మశానవాటిక పనులు నత్తనడకను సాగుతున్నాయి

చివరి మజిలీకి ఇక్కట్లు
భువనగిరి సింగన్నగూడెంలో పూర్తిగాని స్మృతి వనం

 రూ.5.50కోట్ల వ్యయంతో 17 శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు 

నత్తనడకన పనులు

ఫఇబ్బంది పడుతున్న ప్రజలు

భువనగిరి టౌన్‌, మే 26: చివరి మజిలీకి ఇబ్బందులు ఎదురవుతు న్నాయి.   గౌరవప్రదంగా అంతిమ యాత్రలు నిర్వహించేందుకు ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న శ్మశానవాటిక పనులు నత్తనడకను సాగుతున్నాయి.  రెండేళ్ల క్రితం రూ.5.50కోట్ల వ్యయంతో 17శ్మశానవాటికల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. చాలా వాటిల్లో పూర్తిస్థాయిలో పనులు పూర్తి కాలేదు రూ.3.60కోట్ల వ్యయంతో చేపట్టిన ఒక స్మృతి వనం, రెండు వైకుంఠ ధామాల పనులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే హను మాన్‌వాడలోని బైరేణికుంట శ్మశానవాటికలోలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్యాస్‌ ఆధారిత దహన వాటిక ఇటీవల అందుబాటులోకి వచ్చింది.  

రూ.5.50కోట్లతో 17శ్మశానవాటికల అభివృద్ధి పనులు 

 భువనగిరి పట్టణంలోని శ్మశానవాటికల్లో మౌలిక వసతులు కల్పించ డానికి 14వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి, తదితర నిఽధులు రూ.5.50కోట్లతో  17శ్మశానవాటికల్లో అభివృద్ధి పనులు ప్రతిపా దించారు. దహన వాటికలు, ప్రహరీ, దుస్తులు మార్చుకునే గదులు, నీటి సదుపాయం, షెడ్స్‌, దహన వాటిక వరకు సీసీ రోడ్డు తదితర అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇప్పటివరకు 10శ్మశానవాటికల్లో  ప్రతిపాదించిన పనులన్నీ పూర్తయ్యాయి. కిసాన్‌ నగర్‌ రైల్వే అండర్‌పాస్‌ బ్రిడ్జి వెనక హుస్సేనాబాద్‌ రెవెన్యూ పరిధిలో, తాతానగర్‌, ఆరు మోరీల సమీపంలోని పెద్దచెరువు కట్ట కింది భాగంలో రూ.37లక్షల వ్యయంతో మూడు శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు కేటాయించి టెండరు ప్రక్రియ పూర్తియినప్పటీకీ సంబంధిత స్థలంపై  నెలకొన్న కోర్టు వివాదాలతో పనులు ప్రారంభం కాకుండానే నిలిచిపోయాయి. మాసుకుంట సమీపంలో రూ.40లక్షల వ్యయంతో శ్మశానవాటిక అభివృద్ది పనులు ఇటీవల ప్రారంభమైనప్పటికీ విద్యుత్‌ కనెక్షన్‌ లేకపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి.  బైపాస్‌రోడ్డు వెంట సింగన్నగూడెంలో రూ.కోటి 60లక్షల వ్యయంతో రెండేళ్ల క్రితం చేపట్టిన స్మృతి వనం పనులు నేటికీ నత్తనడకను మరిపిస్తున్నాయి. రాయిగిరి, హుస్సేనాబాద్‌లో రూ.2కోట్ల వ్యయంతో చేపట్టిన వైకుంఠధామం పనుల్లో కూడా పురోగతి లోపించింది. 

క్రిస్టియన్లకు లేని శాశ్వత శ్మశానవాటిక  

హిందువులు, ముస్లింలకు పట్టణంలో శాశ్వత శ్మశానవాటికలు ఉన్నప్ప టికీ క్రిస్టియన్లకు మాత్రం నేటికి శ్మశానవాటిక లేదు. గత కొన్నేళ్లుగా కిసాన్‌ నగర్‌లో ఉన్న శ్మశానవాటిక చుట్టూ ప్రజలు ఇళ్లను నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలో అంత్యక్రియలపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నందున వివాదాలు ఏర్పడి అంత్యక్రియలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.  శ్మశాన వాటిక కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించాలని క్రిస్టియన్ల  పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కోరినా ప్రయోజనం లేకుండా ఉంది.  ఇటీవల పట్టణ శివారులోని సర్వే నెం.107లో అంత్యక్రియల తంతు నిర్వ హిస్తున్నప్పటికీ అధికారికంగా స్థలాన్ని ప్రభుత్వం కేటాయించలేదు.   దీంతో క్రిస్టియన్లు ఆందోళనతో ఉన్నారు.

త్వరలో అన్ని పనులు పూర్తి చేస్తాం 

పట్టణంలో ప్రతిపాదించిన శ్మశానవాటికల అభివృద్ది పనులన్నీల  త్వరలో పూర్తి చేస్తాం. పనులకు ఎదుర వుతున్న సమస్యలను పరిష్కరిస్తున్నాం.  ప్రతీ శ్మశాన వాటికలో పూర్తిస్థాయి వసతులు కల్పిస్తాం.  క్రిస్టియన్ల శ్మశానవాటిక సమస్యను కూడా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సహకారంతో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. 

ఎనబోయిన అంజనేయులు, మునిసిపల్‌ చైర్మన్‌, భువనగిరి



Updated Date - 2022-05-27T07:09:24+05:30 IST