తెలుగువారు అందించిన త్రివర్ణ పతాకం

ABN , First Publish Date - 2021-04-01T05:50:01+05:30 IST

సరిగ్గా వంద సంవత్సరాల క్రితం విజయవాడ వేదికగా భారత జాతీయ పతాక నమూనా తయారీ జరిగింది. త్రివర్ణ పతాక రూపశిల్పి తెలుగువాడు పింగళి వెంకయ్య...

తెలుగువారు అందించిన త్రివర్ణ పతాకం

సరిగ్గా వంద సంవత్సరాల క్రితం విజయవాడ వేదికగా భారత జాతీయ పతాక నమూనా తయారీ జరిగింది. త్రివర్ణ పతాక రూపశిల్పి తెలుగువాడు పింగళి వెంకయ్య. త్రివర్ణ పతాకాన్ని స్వాతంత్య్ర సమరయోధులందరూ గర్వంగా తిలకించింది, ఆ పతాక అంశాన్ని ప్రకటించింది తెలుగునేల మీదే. ఆనాటి ఘటనను ఫోటోలో బంధించకపోయినా ఆ దృశ్యం తెలుగువారి స్మృతిపథాన నిలిచే ఉంది. పతాకాన్ని తయారు చేసి అందిస్తున్న పింగళి వెంకయ్య, దానిని అందుకున్న గాంధీజీల ముఖాలు మరువలేనివి. ఆ విజయవాడ వేదికలో త్రివర్ణ పతాక ఆవిష్కరణకు సాక్షులు పండిట్‌ మోతీలాల్‌ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్‌, అబుల్‌ కలామ్‌ ఆజాద్‌, రాజగోపాలాచారి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ వంటివారు. నాటి సమావేశంలో గాంధీజీ ఆ పతాక తయారీ అంశాన్ని సంక్షిప్తంగా ప్రకటించి, అదే ఇక తమకు దారి దీపం అని వ్యాఖ్యానించి, ఆ తర్వాత ‘యంగ్‌ ఇండియా’ (1921 ఏప్రిల్ 13) సంచికలో సవివరంగా వర్ణించారు. సంపాదకుడి హోదాలో మహాత్మాగాంధీ ఆ వ్యాసం రాసి భారతదేశంలోని నలుమూలలకు మువ్వన్నెల జెండా సందేశం తీసుకువెళ్లగలిగేలా చేశారు. నాటి వరకు భారతీయులకు స్వాతంత్య్రపోరాటంలో ఉర్రూతలూగించినది వందేమాతరం నినాదం. ఆ నినాదానికి భగత్‌సింగ్‌ బృందం ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ జోడించి ఉరికొయ్యలను ముద్దాడారు. వందేమాతరం అంటూ తమ చివరి ఊపిరి వరకు నినదించిన స్వాతంత్య్ర సమరయోధులు ఎందరో లెక్కలేదు. 


1921 మార్చి 31 తర్వాత వందేమాతరం నినాదానికి మువ్వన్నెల జెండా జతచేరింది. త్రివర్ణ పతాకాన్ని చేతబూని స్వాతంత్య్రపోరాటంలోకి దూకటం ఒక గౌరవం అయింది. ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగురవేసి జాతీయభావం, సమైక్యతలను బ్రిటీష్‌ వారికి తెలియజెప్పారు. తమ ప్రాణం పోయినా సరే చేతిలోని త్రివర్ణ పతాకానికి అవమానం జరగకుండా కాపాడుకున్నారు. లాఠీ దెబ్బలు తింటున్నా, తూటాలు ఎదుర్కొంటున్నా తమ ప్రాణం కన్నా మిన్నగా, పవిత్రమైనదిగా త్రివర్ణ పతాకాన్ని భారతీయులు భావించారు. జిల్లా కేంద్రాలలో ఎగురుతున్న బ్రిటీష్‌ పతాకాన్ని లాగి కిందపడేసి, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సాహసం ఎందరో భారతీయులది. మేమంతా జెండా వీరులం, మమ్మల్ని నడిపిస్తున్నది త్రివర్ణ పతాకం అంటూ వీధుల వెంట సత్యాగ్రహకారులు కవాతులు నిర్వహించారు. అంతలా జాతిని కదిలించింది ఒక జెండా. 


జాతికి జెండా అవసరం అన్నది పింగళి వెంకయ్య నమ్మకం. ఆయన దక్షిణాఫ్రికా వెళ్లినప్పుడు, ఐరోపా దేశాల వారిని గమనించినప్పుడు భారతదేశానికి జాతీయ జెండా లేకపోవటం లోపంగా కనిపించింది. నాటి నుంచి ఆయన ఆలోచన భారత జాతిని ప్రతిబింబించే ఒక జెండా రూపకల్పన మీదే. లాహోర్‌లో జపనీస్ భాష నేర్చుకుంటున్న పింగళి వెంకయ్య 1906 నాటి కలకత్తా కాంగ్రెస్‌ సమావేశాలకు హాజరయ్యారు. నాడు ఆయన కొందరు కాంగ్రెస్‌ నాయకులతో జాతీయ జెండా అంశం ప్రస్తావించినా, వారంతా నాటి వందేమాతరం నినాదం సరిపోతుందని భావించారు. పింగళి ప్రతి ఏటా కాంగ్రెస్‌ సమావేశాలకు హాజరవుతూనే ఉన్నారు. గాంధీజీతో కూడా ఈ విషయం మాట్లాడారు. అయితే స్వాతంత్య్ర సమరం ఫలించిన తర్వాతే జాతీయ జెండా గురించిన ఆలోచన చెయ్యాలన్నది గాంధీజీ భావన. సత్యాగ్రహం అనే దానికి ఖద్దరు, గాంధీ టోపీ చాలనుకున్నారు. గాంధీ ఆలోచనలతో పింగళి వెంకయ్య ఏకీభవించలేదు. 


మచిలీపట్నంలో ఆంధ్రజాతీయ కళాశాల 1910లో మొదలైంది. జాతీయ భావజాలంతో మొదలైన ఆ విద్యాలయంలోకి హేమాహేమీలు ఉపాధ్యాయులుగా వచ్చారు. అందులో పింగళి వెంకయ్య ఒకరు. అప్పటికే ఆయన జపనీస్‌లో అనర్గళంగా మాట్లాడటం చూసి అందరూ ఆయన జపాన్‌ వెంకయ్య అని పిలిచేవారు. ఆ తర్వాత మునగాల జమిందార్ సహాయంతో పత్తి పంటమీద పరిశోధనలు చేసి పత్తి వెంకయ్య అని పిలిపించుకున్నారు. 1911లో జాతీయ కళాశాలలో చేరిన ఆయన స్థానిక నేతలు, చిత్రకళా అధ్యాపకులతో నిరంతరం జాతీయ జెండా అంశం మీద చర్చిస్తుండేవాడు. తన ఆలోచనలు, నమూనాలు, జాతీయ జెండా ప్రాముఖ్యత అనే అంశాలను కలిపి ‘నేషనల్‌ ఫ్లాగ్‌ ఫర్‌ ఇండియా’ అనే పుస్తకాన్ని రాసి 1916లో కాంగ్రెస్‌ నాయకులకు అందించారు. 


నాటి వరకు కాంగ్రెస్‌ పార్టీ అఖిలభారతస్థాయి సమావేశాలు ఉత్తర భారత దేశంలోనే జరిగేవి. దక్షిణాదిన ఆ సమావేశాలు జరగాలన్నది అయ్యదేవర కాళేశ్వరరావు ఆలోచన. కాంగ్రెస్‌ పెద్దలను ఒప్పించి, అంతగా సౌకర్యాలు లేని విజయవాడలో ఆ సమావేశాలు నిర్వహించే సాహసం 1921లో చేశారు. మార్చి 31, ఏప్రిల్‌ 1తేదీల్లో రెండురోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. నాడు విద్యుత్‌ సౌకర్యం లేదు, మైక్‌లు లేవు, హోటళ్లు లేవు. అయినా తాము ఆ సమావేశాల నిర్వహణకు సాహసించిన వైనం అయ్యదేవర వారే మరోచోట వివరంగా రాశారు. స్వాతంత్య్ర పోరాటానికి కొత్త ఊపు ఇవ్వాలని ఆలోచిస్తున్న గాంధీకి పింగళి వెంకయ్య, ఆయన ప్రతిపాదించిన జాతీయ జెండా అంశం జ్ఞప్తికి వచ్చాయి. తాను విజయవాడ సమావేశానికి వస్తున్నందున అక్కడికి రమ్మని వెంకయ్యకి కబురుపెట్టారు. బందరు నుంచి వచ్చిన వెంకయ్యకి గాంధీ ఇచ్చింది మూడు గంటల సమయమే. ఆ సమయం లోపల నీవనుకున్న జాతీయ జెండా రూపకల్పనతో రమ్మనమని గాంధీ ఆజ్ఞ. నిత్యం జాతీయ జెండా ఆలోచనల్లోనే ఉండే పింగళి వెంకయ్య గాంధీ ఇచ్చిన సమయంలోనే త్రివర్ణ పతాకం తయారు చేసి అందించాడు. ఆయనకు ముందు మేడమ్‌ కామా కూడా త్రివర్ణ పతాకం ఒకటి భారతీయుల కోసం రూపొందించి యూరప్‌లో ప్రదర్శించింది. అయితే వాటి రంగుల ఏర్పాటులో భిన్నమైనది పింగళి వెంకయ్యది. 


పైన కాషాయం (ఎరుపు), మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ రంగులతో కూడినది ఆ పతాకం. కాషాయం హిందువులకు, ఆకుపచ్చ ముస్లిమ్‌లకు ప్రాతినిథ్యం అన్నది వెంకయ్య భావన. అయితే స్వాతంత్య్ర పోరాటంలో సిక్కుల పాత్ర మరువలేనిది. మాకు పతాకంలో గుర్తింపు వుండదా అన్నది వారి వాదన. మధ్యలోని తెలుపు రంగు అందరికీ చెందినది అని వెంకయ్య ఇచ్చిన వివరణ సిక్కులను సంతృప్తిపరచలేదు. మధ్యలో తెలుపు రంగుపై గుర్తుగా వెంకయ్య కమలం పువ్వును ఉంచగా అది హిందూ అంశమని గాంధీజీ అంగీకరించలేదు. ఈలోగా పంజాబ్‌కి చెందిన లాలా హన్స్‌రాజ్‌ సూచన గాంధీకి చేరింది. ఆ పంజాబీ దేశభక్తుడు చేసిన రాట్నం గుర్తు త్రివర్ణ పతాకంలో ఉంచితే సిక్కులను సంతృప్తిపరిచినట్లేననుకున్నారు గాంధీజీ. ఆ విధంగా త్రివర్ణ పతాకం, రాట్నంతో కూడింది తయారైంది. దానిని కాంగ్రెస్‌ పార్టీలో కొందరు విమర్శించినా నాడు ఏకాభిప్రాయం త్రివర్ణాలపరంగానే తీసుకున్నారు. 


1921 నుంచి 1947 లో దేశం స్వాతంత్య్రం పొందే వరకు ఆ పోరాటంలో త్రివర్ణ పతాకం అందుకున్న గౌరవం తిరుగులేనిది. 1947 జూలై 22న రాజ్యాంగ సభలో త్రివర్ణ పతాక ఆమోద సమయంలో జవహర్‌లాల్‌ నెహ్రూ రాట్నం స్థానంలో అశోకుని ధర్మచక్రం ఉండాలని ప్రతిపాదించాడు. ముందు, వెనుకల నుంచి చూసినా ఒకేలా కన్పించటం రాట్నంతో కుదరదు కాబట్టి ధర్మచక్రం తగినదని నాడు నెహ్రూ వివరించారు. అదే సమయంలో త్రివర్ణ పతాకంలోని రంగులకు మతపరమైన వివరణలు తీసేసి త్యాగం, సుభిక్షంగా పరిగణించాలని అంగీకరించారు. 


అదీ, భారతదేశానికి జాతీయ పతాకం అందించబడిన తీరు, అందులోని తెలుగువారి పాత్ర, విజయవాడ వేదిక చారిత్రకత. త్రివర్ణ పతాకం గాలిలో రెపరెపలాడుతుంటే గర్వంగా చూస్తూ వందనం చేస్తాం. ఆ త్రివర్ణ పతాకాన్ని అవనతం కానివ్వం. ఆ పతాకం కోసం సైనికులు తమ ప్రాణత్యాగానికి సిద్ధం. అయితే భారత జాతి ఆ త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యను సముచితంగా గౌరవించలేదు. కనీసం స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవం సందర్భంగానైనా పింగళి వెంకయ్యని ‘భారతరత్న’తో గౌరవించాలన్నది తెలుగువారి కోరిక. విజయవాడ వేదికగా జరిగిన త్రివర్ణ పతాక ఆవిష్కరణ తేదీ అయిన మార్చి 31కి జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వాలన్నది తెలుగువారి డిమాండ్‌. తెలుగువారు విజయవాడలో వందేళ్ళ త్రివర్ణ పతాక ఉత్సవం జరుపుకుంటున్నారు, అరుదైన ఫొటోలను ప్రదర్శిస్తున్నారు. ఇటువంటి ఉత్సవం ఢిల్లీ వేదికగా కూడా జరగాలి.

డాక్టర్‌ కె. లక్ష్మీనారాయణ

విశ్రాంత ఐఏఎస్ అధికారి

Updated Date - 2021-04-01T05:50:01+05:30 IST