త్రివర్ణ శోభితం

ABN , First Publish Date - 2022-08-15T04:51:30+05:30 IST

జిల్లా త్రివర్ణ శోభితమైంది. ఊరూరా జాతీయతాభావం వెల్లివిరుస్తోంది. దేశభక్తి ఉప్పొంగుతోంది. అజాదీ కా అమృత్‌ మహోత్సవంలో అన్నివర్గాల ప్రజానీకం భాగస్వామ్యం అవుతోంది. ఇంటింటా మువ్వన్నెల జెండాలను కట్టి మురిసిపోతోంది. ర్యాలీలు, మానవహారాలతో వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది.

త్రివర్ణ శోభితం
ఒంగోలులో మూడు కిలోమీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ


ఊరూరా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌

ఇంటింటా మువ్వన్నెల జెండా రెపరెపలు

ఒంగోలులో స్ఫూర్తిదాయకంగా త్రివర్ణ ప్రకాశం ర్యాలీ

3కి.మీ జాతీయ పతాకంతో ప్రదర్శన

హాజరైన పలువురు ప్రముఖులు 

నేడు 76వ స్వాతంత్య్ర వేడుకలు


జిల్లా త్రివర్ణ శోభితమైంది. ఊరూరా జాతీయతాభావం వెల్లివిరుస్తోంది. దేశభక్తి ఉప్పొంగుతోంది. అజాదీ కా అమృత్‌ మహోత్సవంలో అన్నివర్గాల ప్రజానీకం భాగస్వామ్యం అవుతోంది. ఇంటింటా మువ్వన్నెల జెండాలను కట్టి మురిసిపోతోంది. ర్యాలీలు, మానవహారాలతో వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది. జయహో భారత్‌ అని నినదిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఒంగోలులో మూడు కిలోమీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ ఉత్సాహంగా సాగింది. దేశభక్తి గీతాలు, భారత్‌ మాతాకీ జై నినాదాలతో నగర వీధులు మర్మోగాయి. మరోవైపు సోమవారం 76వ స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వపరంగా ఒంగోలులోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో వేడుకలు జరగనున్నాయి. ఇన్‌చార్జి మంత్రి మేరుగ నాగార్జున జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో శకటాలు, స్టాల్స్‌, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.   


ఒంగోలు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి/కలెక్టరేట్‌) : ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమానికి అనుగుణంగా ఈనెల 1 నుంచి జిల్లాలో వివిధ రూపాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకవైపు హర్‌ ఘర్‌ తిరంతా పేరుతో ఇళ్లపై జెండాలు ఎగురవేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం వివిధ సంస్థలు, పౌరసంఘాలు, విద్యా సంస్థల ఆధ్వర్యంలో జాతీయ జెండాతో ర్యాలీలు, మానవహారాలు నిర్వహిస్తున్నారు. అన్నివర్గాల ప్రజలూ ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతున్నారు. 


ఉత్సాహంగా త్రివర్ణ ప్రకాశం ర్యాలీ

ఒంగోలులో జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్‌ దినే్‌షకుమార్‌, ఎస్పీ మలికగర్గ్‌ల నేతృత్వంలో ఆదివారం త్రివర్ణ ప్రకాశం పేరుతో 3 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన చేపట్టారు. దాదాపు 600 కిలోల బరువు ఉండే 3కి.మీ జెండాతో గుంటూరు రోడ్డులోని రవిప్రియా మాల్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అద్దంకి బస్టాండు, బాపూజీ కాం ప్లెక్స్‌, ట్రంకురోడ్డు, కలెక్టరేట్‌ మీదుగా మినీ స్టేడియం వర కూ సాగింది. వివిధ వర్గాలకు చెందిన దాదాపు పదివేల మంది పాల్గొన్నారు. దేశభక్తి గీతాలు, భారత్‌ మాతాకీ జై నినాదాలతో  నగర వీధులు మార్మోగాయి. ఈ ర్యాలీని నగర మేయర్‌ గంగాడ సుజాత ప్రారంభించగా రాష్ట్రమంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు బుర్రా మధుసూదన్‌యాదవ్‌, చీరాల నియోజకవర్గ వైసీపీ కరణం వెంకటే్‌షతోపాటు జిల్లా అధికారులు, వివిధ వర్గాలకు చెంది న పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మినీస్టేడియంలో నిర్వహించిన సభలో ఇన్‌చార్జి మంత్రి నాగార్జున మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగం, పోరాటం వల్ల దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో జిల్లా సమగ్ర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 


టీడీపీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా కార్యక్రమాలు 

ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా ఉత్సవాల నిర్వహణకు పిలుపునివ్వడంతో జిల్లాలో ఆపార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా శనివారమే కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ స్వామి నాయుడుపాలెంలోని తన నివాసంపై జెండా ఎగురవేశారు. ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఒంగోలులోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సత్య హైదరాబాద్‌లోని నివాసంలో జెండాను ఎగురవేయగా, కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి నేతృత్వంలో ఆదివారం రాత్రి భారీగా వేడుకలు జరిగాయి. సంతనూతలపాడు, జరుగుమల్లితోపాటు పలు ఇతర చోట్ల టీడీపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహించాయి.  గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబు నేతృత్వంలో జాతీయ జెండాలతో ర్యాలీ జరిగింది. పొదిలిలో ఆర్టీసీ కార్మికులు ప్రదర్శన నిర్వహించారు.


వైసీపీ ప్రకాశంగా మారిన కార్యక్రమం

ఎలాంటి ఆహ్వానం లేకుండా వేదికపై కూర్చున్న ఆ పార్టీ నేతలు

త్రివర్ణ ప్రకాశం పేరుతో ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ నేతలు హల్‌చల్‌ చేశారు. ర్యాలీ అనంతరం మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ఎలాంటి అహ్వానం లేకుండా వేదికపై ముందు భాగంలో కూర్చోవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమంలో నేతలు వేదికపైకి ఎక్కి ఏదో ఒకపక్కన నిల్చొని ఉండటం కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆశీనులు కావడం విమర్శలకు తావిచ్చింది. 


Updated Date - 2022-08-15T04:51:30+05:30 IST