ఆటోల కోసం ‘త్రిచక్ర’ యాప్‌

ABN , First Publish Date - 2021-07-30T07:23:42+05:30 IST

తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లా పరిధిలోని ఆటోల వివరాలను త్రిచక్ర యాప్‌లో నమోదు చేయాలని వాటి యజమానులకు ఎస్పీ వెంకటఅప్పలనాయుడు సూచించారు.

ఆటోల కోసం ‘త్రిచక్ర’ యాప్‌
ఆటోల యజమానులు, డ్రైవర్లకు సూచనలు చేస్తున్న ఎస్పీ

వివరాలను నమోదు చేయాలంటూ యజమానులకు అర్బన్‌ ఎస్పీ సూచన 

తిరుపతి(నేరవిభాగం), జూలై 29: తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లా పరిధిలోని ఆటోల వివరాలను త్రిచక్ర యాప్‌లో నమోదు చేయాలని వాటి యజమానులకు ఎస్పీ వెంకటఅప్పలనాయుడు సూచించారు. శ్రీ రామచంద్ర పుష్కరిణి సమావేశ స్థలిలో ఆటో యజమానులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి త్రిచక్ర యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఈ యాప్‌లో వివరాలు నమోదు చేయకుంటే ఆయా ఆటోలు నకిలీవిగా పరిగణించే ప్రమాదం ఉందన్నారు. ఈ యాప్‌తో ప్రయాణికులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అలాగే ప్రయాణికులు ఉన్నచోటినుంచే యాప్‌ద్వారా ఆటోలను బుక్‌చేసుకునే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. యాప్‌లో నమోదైన ప్రతి ఆటోకు ఓ క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని, దానిద్వారా ఆటోవారితో నేరుగా సంప్రదించే అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు. ప్రయాణించే మార్గాలను ప్రయాణికులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన పరిస్థితుల్లో సాయమందించవచ్చని చెప్పారు. దేశవిదేశాలనుంచి తిరుపతికి వచ్చే భక్తులు ఎక్కువగా ఆటోలపైనే ఆధారపడుతుంటారన్నారు. భక్తులు, ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి ఆటోకు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో త్రిచక్ర యాప్‌కు రూపకల్పన చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఆటోల యజమానులు పోలీసువారి సూచనలను పత్పనిసరిగా అనుసరించాలని సూచించారు. 

Updated Date - 2021-07-30T07:23:42+05:30 IST