నిలువెత్తు దేశభక్తి

ABN , First Publish Date - 2022-02-26T06:14:05+05:30 IST

గురూజీ తన జీవితంలో సగం కంటే ఎక్కువ కాలాన్నే సంఘకార్యానికి సమర్పించారు. 66 సార్లు ఆసేతు హిమాచలం పర్యటించారు. జాతి హితం కొరకు అనేక ప్రాంతాల్లో స్వయంసేవకుల పాత్ర ఉండేలా వివిధ సంస్థలను ప్రారంభించారు

నిలువెత్తు దేశభక్తి

గురూజీ తన జీవితంలో సగం కంటే ఎక్కువ కాలాన్నే సంఘకార్యానికి సమర్పించారు. 66 సార్లు ఆసేతు హిమాచలం పర్యటించారు. జాతి హితం కొరకు అనేక ప్రాంతాల్లో స్వయంసేవకుల పాత్ర ఉండేలా వివిధ సంస్థలను ప్రారంభించారు. దేశం మొత్తం పర్యటిస్తూ స్వయంసేవకులకు, వివిధ రంగాల్లో పని చేస్తున్న వ్యక్తులకు, సంస్థలకు మార్గదర్శిగా నిలిచారు.


మాఘబహుళ ఏకాదశి నాడు (ఫిబ్రవరి 27న) గురూజీగా ప్రసిద్ధి చెందిన ఆరెస్సెస్ రెండవ సర్ సంఘచాలక్ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ (ఎమ్.ఎస్. గోల్వాల్కర్) పుట్టినరోజు. ఆయన రామ్‌టెక్‌లో జన్మించారు, ఎమ్మెస్సీ ఎల్‍ఎల్‌బీ చదివి, కొద్దికాలం పాటు బీహెచ్‌యూలో ప్రొఫెసరుగా పని చేశారు. ఆయన గొప్ప మేధావి, సూక్ష్మగ్రాహి, వివిధ విషయాల పట్ల లోతైన అవగాహన ఉన్నవారు. తమ వేతనంలో ఎక్కువ భాగాన్ని పేద విద్యార్థుల చదువులకు, పుస్తకాలకు ఖర్చు చేసేవారు. అందుకే ఆయనను విద్యార్థులంతా ప్రేమగా ‘గురూజీ’ అని పిలిచేవారు. తర్వాత అదే పేరు స్థిరపడిపోయింది.


గురూజీ జీవితంలోకి సంఘం, ఆధ్యాత్మిక జీవితం రెండు సుమారుగా ఒకేసారి ప్రవేశించాయి. వారు స్వామి వివేకానంద అంతర్ దృష్టికి, ఆచరణాత్మక దృక్పథానికి దగ్గరగా ఉన్న సంఘ కార్యాన్ని తన జీవితానికి ఏకైక లక్ష్యంగా చేసుకున్నారు. క్రమంగా ఆరెస్సెస్ సంస్థాపకులు డాక్టర్ జీ సహచర్యంలో సంఘ కార్యంలో పూర్తిగా లీనమయ్యారు. డాక్టర్ జీ సూచనతో వారి తదనంతరం ఆరెస్సెస్‌కు ద్వితీయ సర్ సంఘచాలక్‌గా 1940లో బాధ్యతలు స్వీకరించారు.  


 గురూజీ బాధ్యతలను స్వీకరించిన కొన్నేళ్లకే సంఘానికీ, దేశానికీ పరీక్ష కాలం ఎదురైంది. స్వాతంత్ర్యం సిద్ధించిందిగానీ దేశం రెండు ముక్కలయ్యింది. గాంధీజీ హత్య తర్వాత సంఘంపై నిషేధం విధించారు. ఈ పరీక్ష సమయంలో గురూజీ ఎంతో గొప్ప నాయకత్వ పటిమను ప్రదర్శించి అన్ని సవాళ్ల నుంచి సంఘాన్ని ముందుకు తీసుకువెళ్లారు. పాకిస్థాన్‌లో కలిసే ప్రాంతాల నుంచి హిందువులను సురక్షితంగా వెనుకకు తీసుకువచ్చే విధంగా స్వయంసేవకులకు మార్గదర్శనం చేశారు. స్వయంగా ఉద్రిక్తత ఉన్న ప్రాంతాల్లో పర్యటించి అక్కడి హిందూ సమాజానికి ధైర్యం చెప్పారు. పాకిస్థాన్ నుంచి శరణార్థులుగా వస్తున్న హిందువులందరికీ శిబిరాలను నిర్వహించి వారిని ఆదుకునే దిశగా స్వయంసేవకులకు గురూజీ మార్గదర్శనం చేశారు. దేశ విభజన తరువాత దేశంలో సామరస్య భావనను నింపడం కోసం దేశమంతటా పర్యటించారు. 1948 జనవరి 14న బొంబాయిలో జరిగిన ఒక కార్యక్రమంలో భిన్నాభిప్రాయాలు ఉన్న వ్యక్తులు కూడా సమాజంలో భాగమే కాబట్టి, వాళ్ళు కూడా సమాజం కోసం త్యాగాలు చేసి ఉన్నారు కాబట్టి, వారిని స్వంతసోదరులుగా భావించాలి అని పిలుపునిచ్చారు.


గాంధీజీ హత్య వెంటనే గురూజీ తన పర్యటనను రద్దు చేసుకొని ఆ దారుణాన్ని ఖండిస్తూ పత్రికా ప్రకటన ఇచ్చారు. ప్రభుత్వానికి సంతాప సందేశాన్ని పంపించారు. కానీ సంఘాన్ని ఏదో పేరుతో అణచివేయాలని ప్రయతిస్తున్న వారికి ఈ ఘటన ఒక సాకుగా దొరికింది. సంఘంపై నిషేధం విధించారు. ఇదే అదనుగా కొందరు స్వయంసేవకులపై, కార్యాలయాలపై దాడులు చెయ్యడం ప్రారంభించారు. ఈ సమయంలో గురూజీ స్వయంసేవకులందరికీ ‘be calm at all costs’ అని సందేశమిచ్చారు. నిషేధ సమయంలో గురూజీ కనబర్చిన నేతృత్వం అమోఘమైనది. నిషేధం తొలగిన తరువాత ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న గురూజీని చూసి బీబీసీ ఆయన్ను– భారతదేశంలో మెరుస్తున్న నక్షత్రంగా అభివర్ణించింది. 


 గురూజీ జాతీయ భద్రత విషయంలో ఎంతో దూరదృష్టి కలిగి ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో కశ్మీరు సమస్యను పరిష్కరించి ఆ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చెయ్యడానికి గురూజీ సరి అయిన వ్యక్తి అని సర్దార్ పటేల్ భావించారు. ఆయనను ప్రత్యేక విమానంలో కశ్మీరు రాజా దగ్గరికి పంపించారు. కశ్మీర్ భారతదేశంలో కలిసే విధంగా వారు రాజు హరిసింగును ఒప్పించారు. వారి కృషి ఫలితంగానే నేడు కశ్మీరు మన దేశంలో ఉన్నది. చైనా దుందుడుకు స్వభావాన్ని, ఆక్రమణ మనస్తత్వాన్ని గురూజీ ముందే పసిగట్టారు. అనేక సందర్భాల్లో చైనా గురించి మన దేశ పాలకులను హెచ్చరించారు. టిబెట్‌ను చైనాకు బహుమతిగా ఇవ్వడం చారిత్రక తప్పిదమని అప్పుడే చెప్పారు. ఆయన హెచ్చరించినట్టుగానే చైనా మన దేశంపై దాడి చేసి సరిహద్దులలో కొంత భూభాగాన్ని ఆక్రమించింది. ఆ సమయంలో గురూజీ స్వయంసేవకులు దేశ ప్రజానీకానికి, ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించాలి అని పిలుపునిచ్చారు.


చైనాతో జరిగిన యుద్ధంలో కలిగిన పరాభవం నుంచి జాతి కోలుకోవటానికి, ప్రజల్లో స్వాభిమానాన్ని నింపడానికి వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మాణం దిశగా గురూజీ మార్గదర్శనం చేశారు. ఆయన సర్ సంఘచాలక్‌గా 33ఏళ్లు పనిచేశారు. 67 ఏళ్ల వారి జీవితంలో సగం కంటే ఎక్కువ కాలాన్నే సంఘకార్యానికి సమర్పించారు. రైలు డబ్బానే ఇల్లుగా చేసుకుని 66 సార్లు ఆ సేతు హిమాచలం పర్యటించారు. జాతి హితం కొరకు అనేక ప్రాంతాల్లో స్వయంసేవకుల పాత్ర ఉండేలా అనేక రకాల సంస్థలను ప్రారంభించారు. దేశం మొత్తం పర్యటన చేస్తూ స్వయంసేవకులకు, వివిధ రంగాల్లో పని చేస్తున్న అనేకమంది వ్యక్తులకు, సంస్థలకు మార్గదర్శిగా నిలిచారు. వారి ఆలోచనలు ఇప్పటికీ మార్గదర్శకమే. 



త్రిలోక్

(సామాజిక కార్యకర్త) 


Updated Date - 2022-02-26T06:14:05+05:30 IST