నెల్లూరులో ట్రైనీ ఐఏఎస్‌లు

ABN , First Publish Date - 2022-09-26T04:53:12+05:30 IST

నెల్లూరులో ఆదివారం పలు ప్రాంతాలను ఏడుగురు ట్రైనీ ఐఏఎస్‌లు సందర్శించారు.

నెల్లూరులో ట్రైనీ ఐఏఎస్‌లు
వాత్సల్య ఆర్గనైజింగ్‌ కార్యదర్శిని అడిగి వివరాలు తెలుసుకుంటున్న ట్రైనీ ఐఏఎస్‌లు

నెల్లూరు(హరనాథఫురం)/నెల్లూరు(వీఆర్సీ), సెప్టెంబ రు 25: నెల్లూరులో ఆదివారం పలు ప్రాంతాలను ఏడుగురు ట్రైనీ ఐఏఎస్‌లు సందర్శించారు. ముందుగా నగరంలోని వాత్సల్య అనాథ శరణాలయాన్ని వారు  సందర్శించారు. అక్కడున్న విద్యార్థులతో మాట్లాడి, వారికి అందుతున్న విద్య, వసతి సౌకర్యాలు, భోజన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ వాత్సల్య ఆర్గనైజింగ్‌ కార్యదర్శి జీవీ సాంబశివరావు తమను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారని, విద్యతోపాటు ఉద్యోగావకాశాలు వచ్చేలా కృషి చేస్తున్నారని తెలిపారు. అంతేకాక వివాహాలు చేయించి, జీవితంలో స్థిరపడేలా చేస్తున్నారని వివరించారు.  అనంతరం ట్రైనీ ఐఏఎస్‌లు  వాత్సల్యలోని రికార్డులను, వంట శాలలను, విద్యార్థుల వసతి భవనాన్ని సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్‌లు అర్పితాగుప్తా, హర్‌కిరణ్‌ సింగ్‌, పంకజ్‌ యాదవ్‌, సమీక్ష రత్నేష్‌ చంద్రజైన, సోనం టాబ్గే, సౌమ్యరంజన ప్రధాన, వాత్సల్య ఆర్గనైజింగ్‌ కార్యదర్శి జీవీ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


సఖీ సెంటర్‌ సందర్శన


అనంతరం వారు జీజీహెచలోని సఖీ సెంటర్‌ను సందర్శించారు. అక్కడున్న సిబ్బంది పనితీరుపై ఐసీడీఎస్‌ పీడీ ఉమామహేశ్వరిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధర్‌ థెరిస్సా హోంను సందర్శించారు. కార్యక్రమంలో డీసీపీవో సురేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.  


 కలెక్టర్‌తో భేటీ


ఉత్తరప్రదేశలోని ముస్సోరిలో శిక్షణలో ఉన్న  ఏడుగురు ట్రైనీ ఐఏఎస్‌లు గ్రామాల అధ్యయన పరిశోధనలో భాగంగా ఆదివారం కలెక్టర్‌ చక్రధర్‌బాబును  ఆయన బంగ్లాలో కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వింజమూరు మండలం ఊటుకూరులో ట్రైనీ ఐఏఎస్‌లు ఈనెల 29వ తేదీ వరకు బస చేసి గ్రామీణ జీవితం, సంస్కృతి, అభివృద్ధి ప్రక్రియ, రోజువారీ సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేస్తారని చెప్పారు. అందుకుగాను అన్నీ ఏర్పాటు చేశామని చెప్పారు.  వారికి డీఆర్‌డీఏ పీడీ కేవీ సాంబశివారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తారని తెలిపారు.

Updated Date - 2022-09-26T04:53:12+05:30 IST