కాలం చెల్లినా...కదలరే!

ABN , First Publish Date - 2020-08-09T10:42:20+05:30 IST

రహదారులు.. అందులో కీలకంగా ఉండే వంతెనల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

కాలం చెల్లినా...కదలరే!

పురాతన వంతెనల పైనే ప్రయాణాలు 

 మరమ్మతులకు భారీగా వ్యయం

కొత్తవి నిర్మాణంపై దృష్టి పెట్టని యంత్రాంగం

పారాది, సీతానగరం బ్రిడ్జిల పరిస్థితి దారుణం


ఈ వంతెన చూశారా? సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై ఉన్న వంతెన. ఇటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారితో పాటు అటు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారు కచ్చితంగా దీనిని దాటాల్సిందే. సువర్ణముఖి నదిపై దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెనకు ఎప్పుడో కాలం చెల్లింది. అనేకసార్లు మరమ్మతులకు గురై...‘నాతో ప్రమాదం పొంచి ఉంది’ అని హెచ్చరిస్తూనే ఉంది. అయినా మన పాలకులు...యంత్రాంగంలో మార్పు లేదు. ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టడమే తప్పితే...దీని స్థానంలో కొత్తది నిర్మించాలన్న ఆలోచన చేయడం లేదు. ఇటీవల రూ.1.20 కోట్లతో మరోసారి మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. కొద్ది రోజులకే గడ్డర్‌ విరిగిపడి..మరమ్మతులు ఎంత నాణ్యంగా ఉన్నాయో చెప్పింది. ప్రతిసారీ ఇదే తంతు. ఇలా కాకుండా కొత్త వంతెన నిర్మిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న అంశంపై దృష్టి పెట్టడం లేదు. ఇది ఒక్కటే కాదు..జిల్లాలో కాలం చెల్లిన అనేక వంతెనలది ఇదే పరిస్థితి.


(పార్వతీపురం): రహదారులు.. అందులో కీలకంగా ఉండే వంతెనల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కాలం చెల్లిన వంతెన స్థానంలో కొత్తవి నిర్మించాలన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. పాతవాటికే మరమ్మతులతో సరిపెడుతున్నారు. పార్వతీపురం డివిజన్‌లో పారాది, సీతానగరం వంతెనలు దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో హడావిడిగా రెండు వంతెనలకు ఆ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు శంకుస్థాపనలు చేశారు. ఆ తరువాత నిర్మాణంపై దృష్టి పెట్టలేదు.


సీతానగరం వంతెన మరమ్మతుల కోసం సుమారు రూ. 1.20 కోట్లు ఖర్చు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో స్పష్టమవుతోంది. ఇక్కడ కొత్త వంతెన నిర్మాణం తప్పనిసరి. మరమ్మతుల కోసం పెద్ద ఎత్తున వ్యయం చేసే బదులు కొత్త వంతెన నిర్మిస్తే నిధులు ఆదా అవుతాయి. అలా కాకుండా మరమ్మతులు చేస్తే అవి ఎన్నాళ్లూ ఉండవని ఇప్పటికే ఈ వంతెన విషయంలో రుజువైంది. ప్రతిసారీ లక్షల రూపాయల్లో ఖర్చు చేయడం.. మళ్లీ కొద్ది రోజులకు శిథిలం కావడం మామూలైపోయింది. ఇదే విధంగా పారాది వంతెన వద్ద మరమ్మతులు ప్రారంభించలేదు. కొత్త పనులూ చేపట్టలేదు. 


వందలాది గ్రామాలకు ఆధారం

పారాది, సీతానగరం వంతెన లు వందలాది గ్రామాలకు ఆధారం. ఎనిమిది మండలాల ప్రజలు నిత్యం వీటిపై ప్రయాణం సాగిస్తున్నారు. బొబ్బిలి, పార్వతీపురం పట్టణాలతో పాటు బొబ్బిలి, సీతానగరం, పార్వతీపురం, కురుపాం, మక్కువ, జియ్యమ్మవలస, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం మండలాలతో పాటు శ్రీకాకుళం జిల్లా పాలకొండ, రాజాం, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ తదితర ప్రాంతాలకు వెళ్లడానికి ఇవే ఆధారం.  సీతానగరం వంతెనకు రూ. 12 కోట్లు, వేగావతిపై గల పారాది వంతెనకు రూ. 11 కోట్లతో ఆర్‌అండ్‌బీ   ఉన్నతాధికారులకు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు వెళ్లాయి.


అప్పట్లో నిధులు మంజూరైనట్లు కూడా ప్రకటించారు. ప్రజాప్రతినిధులతో శంకుస్థాపనలూ చేయించారు. కానీ పనులు ప్రారంభించలేదు. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదు. సీతానగరం వంతెన మీదుగా సామర్థ్యానికి మించి వాహన రాకపోకలు సాగిస్తున్నాయి. 40 మెట్రిక్‌ టన్నుల కంటే బరువు ఎక్కువగా ఉండే వాహనాలు ఈ వంతెన పైనుంచి వెళ్లవద్దని హెచ్చరిస్తున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారు. దీనివల్ల అటు వైపు రాకపోకలు సాగించే వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తోంది.


 టెండర్లకు సిద్ధం..కె.చంద్రన్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ

సీతానగరం వంతెన నిర్మాణం కోసం టెండర్లు పిలవాల్సి ఉంది. గతంలో టెండర్లు పిలిచిన సమయంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సకాలంలో పనులు ప్రారంభించలేదు. దీంతో వారిని తప్పించాం. మళ్లీ టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నాం.

Updated Date - 2020-08-09T10:42:20+05:30 IST