మళ్లీ త్రిసభ్య కమిటీలే..

ABN , First Publish Date - 2021-06-07T03:57:10+05:30 IST

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మళ్లీ త్రిసభ్య కమిటీలే నియామకం కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు జూన్‌లో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం తాత్కాలిక షెడ్యూల్‌ను రూపొందించి హైకోర్టుకు సమర్పించింది.

మళ్లీ త్రిసభ్య కమిటీలే..
పొందూరు పీఏసీఎస్‌ కార్యాలయం

పీఏసీఎస్‌ల్లో నియామకానికి సన్నాహాలు

90 శాతం మేర పాతవే పునరుద్ధరణ

సహకార సొసైటీల్లో ప్రారంభమైన కసరత్తు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మళ్లీ త్రిసభ్య కమిటీలే నియామకం కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు జూన్‌లో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం తాత్కాలిక షెడ్యూల్‌ను రూపొందించి హైకోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో సహకార ఎన్నికలు నిర్వహిస్తారని అందరూ భావించారు. కానీ రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో  ఇప్పట్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. మూడు నెలలుగా సహకార సొసైటీలకు అధికారులే పర్సన్‌ ఇన్‌ఛార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ సమీపించడంతో పాలకవర్గం ఉంటేనే రైతులకు కొంత మేలు జరుగుతుందన్న ఆశాభావంతో ప్రభుత్వం గతంలో మాదిరిగా త్రిసభ్య కమిటీలను నియమించింది. సుమారు 90 శాతం వరకు పాత కమిటీలనే పునరుద్ధరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 


జిల్లాలో ఇదీ పరిస్థితి....

జిల్లాలో 49 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ఒక ఫార్మర్స్‌ సర్వీస్‌ కోఆపరేటివ్‌ సొసైటీ(రణస్థలం) ఉంది. ఈ 50 సొసైటీలకు త్రిసభ్య కమిటీలను నియమించడానికి డివిజనల్‌ సహకార అధికారులు కసరత్తు ప్రారంభించారు. కేవలం జిల్లాలో ‘కొత్తకోట’ సొసైటీకి మాత్రమే కోర్టు ఆదేశాలతో పాలకవర్గం ఉండేది. ఆ తర్వాత అది ముగియడంతో అక్కడ కూడా త్రిసభ్య కమిటీ ఏర్పాటు కానుంది. గతంలో నియమించిన సభ్యుల్లో కొందరు మరణించగా... మరికొందరు రాజీనామా చేశారు. వారి స్థానాల్లో కొత్త సభ్యులను ఎమ్మెల్యేలు సిఫారసు చేయాలి. కొన్నిచోట్ల మార్పులు, చేర్పులు చేసే పనిలో ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. త్రిసభ్య కమిటీల పదవీ కాలం వచ్చేనెల 30తో ముగియనుంది. అయితే అప్పటి పరిస్థితుల ఆధారంగా పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించే అధికారం ప్రభుత్వానికి ఉంది. 


డీసీసీబీ, డీసీఎంఎస్‌లపై స్పష్టత కరువు

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీలకు కమిటీల నియామకంపై ఇంకా స్పష్టత రాలేదు. పాత వాటినే పునరుద్ధరిస్తారా? లేక కొత్తవారిని నియమిస్తారా అనన అంశంపై సందేహం  నెలకొంది. ఈ విషయంపై జిల్లా సహకార అధికారి కె.మురళీకృష్ణమూర్తి మాట్లాడుతూ... ప్రస్తుతం సహకార సంఘాలకు త్రిసభ్య కమిటీలను నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సహకార బ్యాంకు, డీసీఎంఎస్‌ల విషయంపై ఇంకా ఎటువంటి ఆదేశాలు వెలువడలేదని చెప్పారు. జిల్లాలో 49 పీఏసీఎస్‌లు, 1 ఎఫ్‌ఎస్‌సీఎస్‌లలో త్రిసభ్య కమిటీల నియామకంపై డివిజనల్‌ కోపరేటివ్‌ అధికారులు చర్యలు ప్రారంభించారని తెలిపారు.   


Updated Date - 2021-06-07T03:57:10+05:30 IST