Advertisement

పవన్‌ కోసం త్రివిక్రమ్‌ యజ్ఞం

Mar 7 2021 @ 19:19PM

సినిమా పరిశ్రమలో ఏ కాంబినేషన్‌లు ఎందుకు సెట్‌ అవుతాయో చెప్పడం ఎంత సులభమో, అంత కష్టం కూడా. ఆ కాంబినేషన్‌కి సక్సెస్‌ కారణమా.. లేక అండర్‌స్టాండింగ్‌ కారణమా అంటే ఇదమిధ్ధంగా తేల్చి చెప్పలేం. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌ అటువంటిదే. ఇద్దరూ స్నేహితులుగా క్వాలిటీ బాండ్‌ని షేర్‌ చేసుకుంటున్నారు. ఒకరి గురించి మరొకరు చాలా గొప్పగా వేదికల మీద బాహాటంగా, బహిరంగంగా మనసు విప్పి చెప్పుకుంటారు. తను అందరి హీరోల సినిమాలు డైరెక్ట్ చేసినా సరే పవన్‌ మీద త్రివిక్రమ్‌కి ప్రత్యేకమైన అభిమానం ఉందని ప్రతీసారీ నిరూపణ సహితంగా చెప్పుకోడానికి త్రివిక్రమ్‌ సిద్ధంగా ఉంటాడు. అందుకు ఉదాహరణే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం. 

 

మళయాళంలో సూపర్ హిట్‌ అయిన అయ్యప్పన్ కోషియమ్‌ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ తెలుగులో పవర్‌స్టార్‌, రానా కాంబినేషన్‌లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. మళయాళ మాతృకని తెలుగుకి అనువుగా కొన్ని మార్పులు  చేర్పులు చేసి మరీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి తెలుగులో త్రివిక్రమ్‌ మాటలు రాస్తున్నారు. డైలాగ్‌ డ్రామాకి ప్రాధాన్యత అధికంగా ఉన్న ఈ చిత్రానికి త్రివికమ్‌ అయితేనే న్యాయం జరుగుతుందని త్రివిక్రమ్‌నే డైలాగ్‌ రైటర్‌గా ఎంచుకున్నారు. డైలాగ్‌ రాయడంలో తనదైన మార్కును చాలా కాలంగా విజయవంతంగా కొనసాగిస్తున్న త్రివిక్రమ్‌ ఈ చిత్రానికి మాటల రచనని ఓ యజ్ఞంలా భావించి, ఆ పనిమీదే నిమగ్నమై ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఏ సందర్భంలో, ఏ డైలాగ్‌ చెబితే అభిమానులు ఈలలు వేసి, చప్పట్లు మోత మోగిస్తారో త్రివిక్రమ్‌ తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అలాగే ఏ ఎమోషన్‌ని అయినా త్రివిక్రమ్‌ అద్భుతంగా పండించగలరన్న నమ్మకం పరిశ్రమ మొత్తానికి ఉంది. అందుకే త్రివిక్రమ్‌ ఈ సినిమాకి తను డైరెక్టర్‌ కాకపోయినా, ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. 

త్రివిక్రమ్‌ డైరెక్టర్ అయిన తర్వాత మెగాఫోన్‌ని పక్కనబెట్టి, కలం మాత్రమే పట్టుకున్న సినిమా ఇటీవల రోజులలో ఇదే కావడం విశేషం. లోగడ డైరెక్టర్‌ ఇంకొకరైనా త్రివిక్రమ్‌ డైలాగ్‌లు రాసిన సినిమా తీన్‌మార్‌ ఒక్కటే. ముఖ్యంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేయబోయే సినిమా ప్రారంభం కావడానికి ఇంకా చాలా టైం ఉండడం ప్రస్తుతం పవన్‌ సినిమాకి కలిసొచ్చిన పాయింట్. ట్రిపుల్‌ ఆర్ ఇప్పుడప్పుడే పూర్తయ్యే సూచనలు ఎక్కడా కనబడడం లేదు. వీళ్ళ కాంబినేషన్‌లో రాబోయే సినిమాకి బౌండ్‌ స్క్రిప్టు రెడీగా ఉంది. కాకపోతే ఎన్టీఆరే.. ఇప్పట్లో దొరకడు. దాంతో త్రివిక్రమ్‌కి పూర్తిగా ఆటవిడుపు. తన అభిమాన కథానాయకుడి సినిమాకి హాయిగా మాటలు రాయడంలో మునిగిపోయున్నాడు. 

రాజకీయ రంగంలో పూర్తిగా ఇన్వాల్వ్‌ అయిన పవన్‌ కళ్యాణ్‌ చెప్పే ప్రతీ డైలాగుకి ఎంతో ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో త్రివిక్రమ్‌కే ఆ బాధ్యతను పవన్‌ కళ్యాణే స్వయంగా భుజాలమీద పెట్టారు. అయితే లోగడ త్రివిక్రమ్‌ డైరెక్టర్‌ కాకపోయినా మాటలు రాసిన తీన్‌మార్‌ చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించలేదు. మరీ సారి ఈ సినిమా ఏమవుతుందో వేచి చూడాల్సిందే. పవన్ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌ ఇదొక ప్రత్యేకమైన పరీక్ష. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.