వైసీపీ సర్కారుకు చుక్కెదురు!

ABN , First Publish Date - 2021-11-14T14:52:44+05:30 IST

వైసీపీ సర్కారుకు..

వైసీపీ సర్కారుకు చుక్కెదురు!

నిధుల మళ్లింపుపై వెనకడుగు

ఒత్తిళ్లకు తలొగ్గని హెల్త్‌ వర్సిటీ 

వ్యతిరేకించిన ఈసీ సమావేశం 

మధ్యేమార్గంగా తెరపైకి టెండర్లు 

ఎస్‌ఎఫ్ఎస్‌సీ పాల్గొనవచ్చు: వీసీ 

ఎక్కువ వడ్డీ ఇస్తే డిపాజిట్‌: రిజిస్ట్రార్‌ 

‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో అలజడి


అమరావతి(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నిధులను అప్పనంగా మళ్లించుకుందామనుకున్న వైసీపీ సర్కారుకు చుక్కెదురైంది. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చినా మీడియాలో కథనాలు, వర్సిటీ ఉద్యోగుల్లో వ్యతిరేకతతో ఈ ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. శనివారం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌(ఈసీ) సమావేశంలో కొంతమంది సభ్యులు కూడా నిధుల మళ్లింపును వ్యతిరేకించారు. దీంతో మధ్యేమార్గంగా టెండర్ల ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చారు. నిబంధనల ప్రకారం ఎఫ్‌డీల కోసం వర్సిటీ టెండర్‌ ప్రక్రియను పాటిస్తోంది. కాబట్టి ఏపీఎస్ఎఫ్ఎస్‌సీ కూడా టెండర్లలో పాల్గొనాల్సి ఉంటుంది. దీనికోసం ఆ సంస్థకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఈ సీ ఆమోదం పొందిన ఆరు జాతీయ బ్యాంకులతో పాటు ఏడో సంస్థగా ఎస్ఎఫ్ఎస్‌సీ టెండర్లల్లో పాల్గొనాల్సి ఉంటుంది. హెల్త్‌ వర్సిటీ ఖజానాపై ఆరోగ్యశాఖ కన్ను పడిందని, వర్సిటీ నిధులు మళ్లించడానికి ఒత్తిడి చేస్తున్న వైనంపై ‘250 కోట్లకు స్కెచ్‌’ అంటూ రెండు రోజుల క్రితమే ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. దీంతో వర్సిటీ వర్గాల్లో అలజడి రేగింది. 


ఈసీకి ముందు ఎఫ్‌సీ సమావేశం 

శనివారం మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కావాల్సిన మీటింగ్‌ 4గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు ఈసీ ఫైనాన్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో వీసీ శ్యామ్‌ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ శంకర్‌, నలుగురు సభ్యులు పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఆర్థికశాఖ నుంచి కె.వి.వి.సత్యనారాయణ వర్చువల్‌ విధానంలో హాజరయ్యారు. వర్సిటీ నిర్వహించే బిడ్డింగ్‌లో ఏపీఎస్ఎఫ్ఎస్‌సీ పాల్గొనేందుకు, వర్సిటీ సర్‌ప్లస్‌ ఫండ్‌ డిపాజిట్‌ చేసేందుకు అనుమతి కోరు తూ సింగిల్‌ పాయింట్‌ అజెండాతో మీటింగ్‌ నడించింది. దీనికి సభ్యులు ఆమోదం తెలిపారు. దీనికిముందు సభ్యులు ఇదే అంశంపై చర్చించారు. నిధుల విషయంలో ఇప్పటివరకూ పాటించిన నిబంధనలే ఇకపైనా అమలు చేయాలని సభ్యులు తీర్మానించారు. ఎస్‌ఎ్‌ఫఎ్‌ససీకి టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈసీఎఫ్‌సీలో పెట్టిన అజెండాను సభ్యులు ఆమోదించారు. ఆ తర్వాత జరిగిన ఈసీ మీటింగ్‌లో దాన్ని మిగిలిన సభ్యులకు వివరించారు. 


మాపై ఒత్తిడి లేదు 

మిగిలిన బ్యాంకుల తరహాలోనే ఎస్‌ఎఫ్ఎస్‌సీ కూడా టెండర్లల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని వర్సిటీ వీసీ శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. ఈసీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్ఎస్‌సీకి ఆర్‌బీఐ కూడా అనుమతి ఇచ్చిందన్నారు. ఇలాంటి సంస్థలు గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో పదేళ్ల నుంచి ఉన్నాయన్నారు. నిధుల డిపాజిట్‌ విషయంలో తమపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేదని రిజిస్ట్రార్‌ శంకర్‌ అన్నారు. వర్సిటీ నిధులు విషయంలో జీవో.17ను అనుసరించే నిర్ణయం తీసుకుంటామన్నారు. వర్సిటీకి అత్యధికంగా 5.1శాతం వడ్డీ వస్తోందని, ఎస్ఎఫ్ఎస్‌సీ కూడా ఆ స్థాయిలో వడ్డీ ఇస్తే డిపాజిట్‌ చేస్తామన్నారు. ఎస్ఎఫ్ఎస్‌సీ నుంచి తమకు వచ్చిన లేఖలో 5శాతం వడ్డీ ఇస్తామని ఉందన్నారు. అయినా టెండర్‌ ప్రక్రియ ద్వారానే బ్యాంకులను ఎంపిక చేస్తామని వివరించారు. ఈసీ మీటింగ్‌కు వందశాతం మంది సభ్యులు హాజరయ్యారన్నారు. 


నిబంధనలు పాటించండి: ఉద్యోగులు 

నిధుల డిపాజిట్‌ విషయంలో నిబంధనలు పాటించాలని కోరుతూ వీసీకి హెల్త్‌ వర్సిటీ ఉద్యోగుల అసోసియేషన్‌ వినతిపత్రం సమర్పించింది. నిబంధనలు పాటించకుంటే కోర్టులను ఆశ్రయిస్తామని అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు కె.నర్సింహారావు, జనరల్‌ సెక్రటరీ యు.రాజేంద్రబాబు హెచ్చరించారు. 



Updated Date - 2021-11-14T14:52:44+05:30 IST