పోటాపోటీగా తెలంగాణ పార్టీల గ్రౌండ్ వర్క్.. టార్గెట్ ఈ స్థానాలే..!

ABN , First Publish Date - 2022-02-17T17:46:39+05:30 IST

నియోజకవర్గాల వారీగా లెక్కలు వేస్తూ పార్టీ బలోపేతం కోసం పని మొదలు పెట్టాయి. అందులో భాగంగా ఫస్ట్ రిజర్వుడ్‌ స్థానాల

పోటాపోటీగా తెలంగాణ పార్టీల గ్రౌండ్ వర్క్.. టార్గెట్ ఈ స్థానాలే..!

తెలంగాణలో అన్ని పార్టీలు ఆ స్థానాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ప్రత్యేక సంక్షేమ పథకాలతో అధికార టీఆర్ఎస్‌ అక్కడ పట్టు పెంచుకునే వ్యూహం అమలు చేస్తోంది. ఇక కమలం పార్టీ సైతం ఆ నియోజకవర్గాలపైనే దృష్టి కేంద్రీకరించి కమిటీ కూడా వేసింది. ఇక కాంగ్రెస్ కూడా ఆ స్థానాల్లో పట్టు సడలకుండా ప్రణాళికలు రచిస్తోంది. ఇంతకీ ఇప్పుడు అన్ని పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్న ఆ నియోజకవర్గాలు ఏవి? వాటిలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నాయి? అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


గ్రౌండ్ వర్క్‎పై ఫోకస్ పెట్టిన అన్ని పార్టీలు

ఎన్నికలే టార్గెట్‌గా పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. నియోజకవర్గాల వారీగా లెక్కలు వేస్తూ పార్టీ బలోపేతం కోసం పని మొదలు పెట్టాయి. అందులో భాగంగా ఫస్ట్ రిజర్వుడ్‌ స్థానాల మీద అన్ని పార్టీలు ఫోకస్ పెట్టి గ్రౌండ్ వర్క్ ప్రారంభించాయి. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాలున్నాయి. ఇక మూడు ఎస్సీ, రెండు ఎస్టీ లోక్‌సభ రిజర్వుడ్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తంగా 31 అసెంబ్లీ రిజర్వుడ్‌ స్థానాలతో పాటు ఆ లోక్‌సభ నియోజకవర్గాల్లో కూడా మొదటి నుంచి కాంగ్రెస్‌కు మంచి పట్టుంది. అక్కడి మెజారిటీ ఎస్సీ, ఎస్టీ వర్గాలు హస్తం పార్టీకే అండగా నిలుస్తున్నారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ వర్గాలు ఇతర పార్టీల వైపు మళ్లారు.


ఆకర్షణీయమైన హామీలతో కేసీఆర్ దూకుడు

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలను ఆకట్టుకోవడానికి ఉద్యమకాలం నుంచే టీఆర్‌ఎస్‌ ప్రత్యేక హామీలు ఇచ్చింది. గిరిజన రిజర్వేషన్ పెంపు, తాండాలను గ్రామపంచాయితీలుగా చేస్తామని ఎస్టీలను ఆకట్టుకునే హామీలు ఇచ్చింది. ఇక దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి వంటి ప్రకటనలతో ఎస్సీలను తమ వైపునకు తిప్పుకునే ఎత్తుగడలు అమలు చేసింది. అటు బలమైన తెలంగాణ నినాదం, దీనికితోడు కేసీఆర్ ఇచ్చిన ఆకర్షణీయమైన హామీలతో ఆయా వర్గాలను టీఆర్ఎస్ తన వైపునకు తిప్పుకోగలిగింది. అయితే రెండు మార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌పై ఆ వర్గాల్లో ఓ స్పష్టత ఏర్పడింది. దీంతో అలర్ట్‌ అయిన కేసీఆర్ తాజాగా దళిత బంధు పథకాన్ని మొదలుపెట్టారు. అన్ని దళిత నియోజకవర్గాల్లో ఒక్కో మండలంలో మొదట లబ్దిదారులను ఎంపిక చేసి 10 లక్షల రూపాయలు సహాయం చేసే ప్రక్రియను ప్రారంభించారు. దీంతో ఆ వర్గాలు దూరం కాకుండా అడ్డుకోవచ్చని కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. అటు గిరిజనుల కోసం పోడు భూముల పట్టాల సమస్యను తీరుస్తామని చెబుతున్నారు.


బీజేపీ పక్కా స్కెచ్..నియోజకవర్గాల వారీగా వ్యూహాలు 

అయితే కేసీఆర్ ప్రభుత్వంపై ఆయా వర్గాల్లో సహజంగానే వ్యతిరేక భావం ఏర్పడుతోంది. దాన్ని క్యాచ్ చేసుకునే ఎత్తుగడను వేస్తున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యంగా తెలంగాణలో పాగా వేయాలని పట్టుదలతో ఉన్న బీజేపీ పక్కా స్కెచ్‌తో ముందుకు వెళుతోంది. సర్వేలు చేసుకుని వాటి ఆధారంగా నియోజకవర్గాల వారీగా వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా తొలుత ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలనే టార్గెట్‌గా పెట్టుకుంది. ఆయా నియోజక వర్గాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఓ కమిటీని వేసింది. ఎస్సీ, ఎస్టీ సమస్యలపై ఫోకస్ పెట్టిన బీజేపీ నేతలు... టీఆర్ఎస్ మీద మాటల దాడి పెంచుతున్నారు.


నియోజకవర్గాల్లో దృష్టి పెట్టిన రేవంత్‎రెడ్డి

ఇక కాంగ్రెస్ సైతం ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో తమ పట్టు నిలుపుకోవడానికి కసరత్తు చేస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా రిజర్వుడ్‌ స్థానాల్లో కాంగ్రెస్ చాలా స్థానాలు గెలుచుకుంది. 2018లో కూడా హస్తం ఐదు ఎస్టీ, మూడు ఎస్సీ స్థానాల్లో విజయం సాధించింది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ చేపట్టిన లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ మిషన్ ఇన్ రిజర్వుడ్‌ నియోజకవర్గాల కార్యక్రమం మంచి ఫలితం ఇచ్చింది. అలాగే ఈసారి కూడా ఆ నియోజక వర్గాల్లో తమ పట్టును సడలకుండా టీపీసీసీ చీఫ్ రేవంత్ దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలు, ఎస్సీ ఎస్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం పెట్టి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా లీడర్ షిప్‌ను ఎంకరేజ్ చేసే పని మొదలుపెట్టారు. రిజర్వుడ్‌ స్థానాల్లో ఏదో ఓ కార్యక్రమం పెట్టుకుని పర్యటనలు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం మహబూబాబాద్ నియోజకవర్గానికి వెళ్లి వచ్చారు. ఇక అదే రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా జాతరకు హాజరయ్యారు. అర్ధరాత్రి వరకు విస్తృతంగా పర్యటించి మున్ముందు తన స్పీడ్ ఎలా ఉండబోతోందో శాంపిల్ చూపించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.


మొత్తానికి అన్ని పార్టీలు రిజర్వుడ్‌ స్థానాల మీద ఫోకస్ పెట్టడంతో అందరి దృష్టి అటు వైపు మళ్లింది. మరి ఆ నియోజకవర్గాల ప్రజలు ఎటు వైపు ఉంటారో తెలియాలంటే మాత్రం ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Updated Date - 2022-02-17T17:46:39+05:30 IST